సర్వేలతో సచివాలయ సిబ్బంది సతమతం
ఒకే సారి పది రకాల సర్వేలు
ఏది ముందో, ఏది తరువాతో తెలియని పరిస్థితి
సర్వేలలో లోపిస్తున్న నాణ్యత
వత్తిడితో మొక్కుబడిగా కొన్ని సర్వేలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వివిధ రకాల సర్వేలతో సతమతం అవుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకేసారి 10 వరకు సర్వేలను నిర్వహిస్తోంది. దీంతో ఈ సర్వేల భారం మొత్తం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మీద పడింది. ప్రస్తుతం గ్రామ వాలంటీర్లు కూడా లేకపోవడంతో సచివాలయ సిబ్బంది అన్ని రకాల సర్వేలను చేయడానికి వ్యయ ప్రయాసలకు, ఒత్తిడికి గురవుతున్నారు. సిబ్బంది మీద ఒత్తిడి ఎక్కువ కావడంతో ఏ సర్వే ముందు చేయాలో తెలియక తికమక పడుతున్నారు. ఈ సర్వేలు ఒకటి అయిన తర్వాత మరొకటి అప్పగిస్తే తేలిగ్గా ఉంటుందన్న భావన సచివాలయ సిబ్బందిలో వ్యక్తం అవుతుంది. ఒకే పర్యాయం 10 రకాల సర్వేలను చేయమనడంతో ఈ సర్వేలలో నాణ్యత లోపించే ప్రమాదం కూడా ఉంది.
జిల్లాలో 612 గ్రామా వార్డు సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల కేంద్రంగా అన్ని రకాల సర్వేలు జరుతున్నాయి. రైతులందరికీ బీమా సౌకర్యం కల్పించడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతుల సర్వే జరుగుతోంది. ఈ సర్వే కింద జిల్లాలోని రైతులందరినీ గుర్తించి వారి చేత వివిధ రకాల పంటలకు బీమా చేయించాలి. ఇదివరకు భీమా చేసిన రైతులకు రెన్యువల్ చేయాలి. ఈ పథకం కింద జిల్లాలో 9,600 మంది రైతుల ఉండగా ఇప్పటివరకు 4,200 మంది రైతులకు సర్వే పూర్తి అయినట్లు తెలుస్తోంది. జియో టాకింగ్ పేరుతో ఇంటింటి సర్వే జరుగుతోంది. ఏదేని ప్రకృతి వైపరీత్యాలు జరిగితే బాధితులకు నష్టపరిహారం అందజేయడానికి జిల్లాలోని ఇళ్లను ఆధార్ కార్డులతో లింక్ చేస్తున్నారు. ఇంటిలోని ఒకరి ఫోటో తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో 5.91 లక్షల కుటుంబాలు ఉండగా, ఇప్పటివరకు 3. 4 0 లక్షల కుటుంబాలను జియో ట్యాగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ఆగస్టు నెల నుంచి అమలు జరుగుతుంది. వరదలు, అగ్ని ప్రమాదాలు సంభవిస్తే, బాధితులను ఆదుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పథకం కింద బ్యాంకు ఖాతాలను ఎన్పీసీఐ పోర్టల్ లో లింకు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు కింద అందజేసే ఆర్థిక సహాయం కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ప్రముక్త అందించే ఆర్థిక సహాయం నేరుగా అందుకోవాలని బ్యాంక్ అకౌంట్కు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కు లింక్ అయి ఉండాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు కూడా ఈ లింక్ అవసరము. చిత్తూరు జిల్లాలో రెండు లక్షల 40 వేల బ్యాంకు ఖాతాలు ఎన్ పి సి ఐ పోర్టర్ కు అనుసంధానం కాలేదని తెలుస్తోంది. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు సిబ్బంది ఒక లక్ష ఖాతాదారులను లింక్ చేసినట్టు సమాచారం. పాఠశాలల తనిఖీ కార్యక్రమం కింద సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ కానీ, వెల్ఫేర్ అసిస్టెంట్ గాని వారంలో రెండు రోజులు సచివాలయం పరిధిలోని పాఠశాలలను సందర్శించాలి. ఆ పాఠశాలలోని శానిటేషన్, మరుగుదొడ్ల ఫోటోలను ప్రభుత్వానికి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అపార్పథకం కింద పాఠశాల విద్యార్థుల ఆధార్ లింకింగ్ కార్యక్రమం జిల్లాలో జోరుగా నడుస్తోంది. పాఠశాలల్లో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, ఇంటి పేరు ఆధార్ కార్డుతో ఉన్న వివరాలతో సరిపోవాలి. జిల్లాలో చాలామంది విద్యార్థులు వివరాలు పాఠశాల రికార్డులలో ఒకలా, ఆధార్ కార్డులో మరోలా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది విద్యార్థుల ఇంటిపేరు, పుట్టిన తేదీలు సరిపోవటం లేదని తెలుస్తోంది. కావున జిల్లాలో పాఠశాలల విద్యార్థి వివరాలు, ఆధార్ లో ఉన్న విద్యార్థి వివరాలను ఒకేలా ఉండేవిధంగా అపార పథకం కింద చర్యలు తీసుకుంటున్నారు. క్లస్టర్ మ్యాపింగ్ కింద ఇదివరకు గ్రామ వాలంటీర్లు పనిచేసిన క్లస్టర్ మ్యాపింగ్ సర్వే జరుగుతుంది. ఈ సర్వే కింద వాలంటీర్ క్లస్టర్ హేబిటేషన్లో ఒకే పరిధిలో ఉన్నాయా, ఉంటే ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న విషయం మీద సర్వే చేసి మ్యాపింగ్ చేయాల్సింది. జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాల సభ్యుల ఆధార్, ఫోన్ నెంబర్లను సేకరించి అప్డేట్ చేసే కార్యక్రమం నడుస్తోంది. అలాగే జిల్లాలోని సుమారు 6000 మంది ఎస్టీలకు రేషన్, ఆధార్ కార్డులు లేవని తెలుస్తోంది. వారికి ఆధార్ కార్డు లను నమోదు చేసి అందచేస్తున్నారు. ఇవి పూర్తయిన తర్వాత వారికి రేషన్ కార్డులను కూడా అందజేయనున్నారు. సీడ్ సర్వే కింద జిల్లాలోని సంచార తెగలను గుర్తించి వారికి అవసరమైన విద్య, ఉపాధి, శిక్షణ, భీమా సౌకర్యాలపై వారికి అవగాహన కల్పించి, కేంద్ర ప్రభుత్వ పోర్టర్ లో వారిని నమోదు చేసే కార్యక్రమం జిల్లాలో జరుగుతోంది. ఇది ఇప్పుడిప్పుడే జిల్లాలో ప్రారంభమవుతుంది. ఇది కాకుండా జాతీయ పశుగణన కార్యక్రమం కూడా జిల్లాలో గత నెల ప్రారంభమైంది. అయితే సర్వేలు ఎక్కువ కావడంతో పశుసంవర్ధక శాఖ సిబ్బందిని కూడా వివిధ రకాల సర్వేలకు మళ్ళించారు. దీంతో జాతీయ పశుగణన కార్యక్రమం కూడా జిల్లాలో మందకోటిగా జరుగుతోంది. ఒకేసారిగా పలు రకాల సర్వేలు సచివాలయ సిబ్బందిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏ సర్వే కి ప్రాధాన్యత ఇవ్వాలో అర్థం కావడం లేదు. అన్ని విభాగాల అధికారులు తమ సర్వే అంటే తమ సర్వే ముందు చేయాలని సచివాలయ సిబ్బందిని వత్తిడికి గురిచేస్తున్నారు. దీంతో సచివాలయ సిబ్బంది ఏదో మొక్కుబడిగా సర్వేలను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ సర్వేకు కూడా పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే పూర్తయిన తర్వాత మరో సర్వేను అప్పగిస్తే అందుకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. మంచి ఫలితాలు వస్తాయి. ఇలా సర్వేలు మీద సర్వేలతో ఏదో ఉన్నఫళంగా సర్వేలను పూర్తిచేయాలనే వత్తిడి కారణంగా సర్వేలలో నాణ్యత లోపించి, అసలైన లబ్ధిదారులు తప్పిపోయే ప్రమాడం ఉంది.
పో రై గంగ 1 సచివాలయం
పో రై గంగ 1 సచివాలయం