16, నవంబర్ 2024, శనివారం

సింగిల్ విండోల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్యం చర్యలు

ఎరువులు, జనరిక్ మందుల విక్రయం ప్రారంభం 

పెట్రోల్ బ్యాంకుల నిర్వహణకు అనుమతులు 

త్వరలో కామన్ సర్విస్ సెంటర్ల ప్రారంభం 

వేగంగా జరుగుతున్న కంప్యూటరీకరణ 

జిల్లాలో సహకర వారోత్సవాలు ప్రారంభం 


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలు (సింగిల్ విండోలు)  ఆర్థికంగా, సాంకేతికంగా పటిష్టత దిశగా అడుగులు వేస్తున్నాయి. క్రమంగా వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక సహకార సంఘాలను పటిష్టం చేయడానికి పలు అభివృద్ధి, సంక్షేమ, వ్యాపార కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. జిల్లాలోని పలు సహకార ప్రాథమిక సంఘాలు ఇప్పటికే వ్యాపార రంగంలో దూసుకుపోతున్నాయి. పలు రకాల వ్యాపారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేస్తున్నాయి. మరిన్ని వ్యాపారాలు చేసి ఆర్థికంగా పరిపూర్ణత సాధించడానికి జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలు సమాయత్తమవుతున్నాయి. 


చిత్తూరు జిల్లాలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు అనుభంధంగా  37 ప్రాథమిక సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. వీటిలో పలు రకాల వ్యాపార, సేవా కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసి వాటిని ఆర్థికంగా పటిష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా సహకార సంఘాల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించింది. అలాగే సహకార్చే సంవృద్ది పథకం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. చిత్తూరు జిల్లాలోని 15 సింగల్ విండోలు ఇప్పటికే ఎరువుల అమ్మకాలను ప్రారంభించాయి. ఇందులో కల్తీ లేకుండా స్వచ్ఛమైన ఎరువులు, పురుగుమందులను ప్రభుత్వం రైతులకు విక్రయిస్తోంది. రైతులు తమ ఉత్పత్తులను నిల్వ ఉంచి, గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత విక్రయించుకోవడానికి గిడ్డంగుల నిర్మాణం కూడా జరుగుతుంది. ప్రధానమంత్రి జనరిక్ మందుల పథకం కింద జిల్లాలో నాలుగు సహకార సంఘాలకు జనరిక్ మందుల విక్రయానికి లైసెన్స్ లు మంజురయ్యాయి. ప్రస్తుతం నగరి, చిత్తూరులోని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలలో జనరిక్ మందుల విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే సింగల్ విండోలు పెట్రోల్ బంకులను నడపడానికి కూడా అనుమతులు ఇస్తున్నారు. ప్రస్తుతం నగరి, పలమనేరులోని బయ్యప్పగారి పల్లి, రొంపిచర్లలో  సింగల్ విండోల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులను నడుపుతున్నాయి. కామన్ సర్వీస్ సెంటర్ పేరుతో అన్ని సహకార సంఘాల్లోనూ సుమారు 200 వినియోగదారుల సేవలను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కరెంటు, టెలిఫోన్ ,మున్సిపాలిటీ ,గ్రామానికి సంబంధించి పన్నులు తదితర 200 సేవలను ఈ సొసైటీల ద్వారా పొందే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 25 సొసైటీలో ఈ సేవలను ప్రారంభించారు. తొందర్లోనే మిగిలిన వాటిల్లో కూడా  ప్రారంభించడానికి జిల్లా సహకార శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని సహకార సంఘాలు వ్యాపార పరంగా ముందుకు వెళుతుండడంతో ఆర్థికంగా అవకతవకలు జరగడానికి వీలు లేకుండా అన్ని సహకార సంఘాల్లో కంప్యూటరైజేషన్ కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. ఇప్పటివరకు 70 శాతం కంప్యూటరీకరణ పూర్తయింది. ఈ సంఘాల ద్వారా జరిగే వ్యాపారం వ్యాపారానికి సంబంధించిన బిల్లులన్నీ ఆన్ లైన్ ద్వారా చెల్లించవచ్చు. వీటి అన్నిటిని కేంద్రీకృత వ్యవస్థకు అనుసంధానం చేస్తారు. ఫలితంగా ప్రాథమిక సహకార సంఘాలు చేస్తున్న వ్యాపారాలలో  ఎక్కడా అవినీతి  జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కొన్ని సంఘాలలో మాత్రమే ఎరువుల అమ్మకం ,జనరిక్ మందుల అమ్మకం, పెట్రోల్ బంకుల నిర్వహణ, కామన్ సర్వీస్ సెంటర్ కార్యక్రమాలు నడుస్తుండగా, తొందర్లోనే అన్ని సింగల్ విండోలలో ఈ కార్యక్రమాలను ప్రారంభించడానికి జిల్లా సహకార శాఖ అధికారిని నాగవర్ధిని చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు  నిత్యం సింగల్ విందోలకు తగిన ఆదేశాలు ఇస్తున్నారు. సింగల్ విండోలను సందర్శిస్తున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి, వ్యాపార కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. మరో ఆరు నెలల్లో జిల్లాలో  గోదాములనిర్మాణ కార్యక్రమం కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే అన్ని రకాల సేవలు అన్ని సింగల్ విండోలలో అందుబాటులో రానున్నాయి.

*సహకార వారోత్సవాలు* 

దేశవ్యాప్తంగా అఖిల భారత సహకార వారోత్సవాలు ఈనెల 14వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి. భారత మాజీ ప్రధానమంత్రి  పండిత్  జవహర్లాల్ నెహ్రూ సహకార రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన జన్మదినోత్సవం నుంచి వారం రోజులపాటు సహకార వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతాయి. చిత్తూరు జిల్లాలో మొదటి రోజు 14వ తారీఖున జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో, 15వ తేదీన జిల్లా సహకార ప్రింటింగ్ ప్రెస్ లో, 16వ తారీఖున చిత్తూరు జిల్లా పోస్టల్, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ సహకార సొసైటీలో, 17వ తేదీన పలమనేరు కోపరేటివ్ సూపర్ బజార్ లో, 18వ తేదీన నగరి సింగిల్ విండోలో, 19వ తారీఖున ఎర్రచెరువుపల్లి ప్రాథమిక సహకార సంఘంలో జరుగుతాయి. ఈ నెల 20వ తారీఖున గంగవరం సింగిల్ విండోలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంతో సహకార వారోత్సవాలు పూర్తవుతాయి.

పో రై గంగ 1 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో సహకార వారోత్సవాలను ప్రారంభిస్తున్న డిసిఓ నాగవర్ధిని.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *