మూడో జాబితాలో చోటు ఎవరికో ?
ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆశావాహులు
చైర్మన్ పదవుల మీదనే నాయకుల గురి
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల మూడో జాబితా తయారు అవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మూడవ జాబితాలో 21 చైర్మన్ పోస్టులను ప్రకటించినట్లు సమాచారం. ఇప్పటివరకు చిత్తూరు జిల్లా నాయకులకు ఎవరికి రాష్ట్రస్థాయి చైర్మన్ పదవులు రాలేదు. మూడవ జాబితాలో చిత్తూరు జిల్లా నేతలు ఒకరిద్దరికి అవకాశం ఉంటుందని అంటున్నారు.
డిసెంబర్ 12 నాటికి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి అవుతుంది. అంత లోపల మొత్తం నామినేటెడ్ పదవుల నియామకం పూర్తి చేయాలని చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. మూడు రోజుల క్రితం ముఖ్య నాయకులతో జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్య సభ స్థానాలకు డిసెంబర్ లో ఎన్నికలు జరుగనున్నాయి. వీటి కోసం కొందరు టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పోటీ పడుతున్నారు. నాలుగవ తేదీ చంద్రబాబు డిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో మాట్లాడి రాజ్య సభ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తారని సమాచారం. అలాగే రాష్ట్రంలో మిగిలి ఉన్న 50 పైగా కార్పోరేషన్ లకు చైర్మన్ ల నియామకం కూడ పూర్తి చేస్తారని అంటున్నారు. డిసెంబర్ 15 నుంచి మాసం ప్రారంభం అవుతుందని, తరువాత నెల రోజులు మంచి కాదని, అంత లోపల అన్ని పదవులు భర్తీ చేయాలని భావిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే బిజెపి, జనసేన పార్టీల నుంచి జాబితాలు తెప్పించు కున్నారు. కాగా రెండు జాబితాలో 80 కార్పోరేషన్ లకు చైర్మన్ లను నియమించారు. అందులో కొన్నింటికి మాత్రమే 15 మంది చొప్పున డైరెక్టర్లను నియమించారు. ఇంకా 60 పగా సంస్థలకు, కొత్తగా నియామకాలు జరిగే సంస్థలకు డైరెక్టర్లను నియమించాల్సి ఉంది. దాదాపు 1500 మందికి డైరెక్టర్ పదవులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సి కె బాబుకు పదవీ యోగం ఉందని అంటున్నారు. ఆయన వారం క్రితం తన కుమారునితో పాటు విజయవాడలో లోకేష్ ను కలిశారు. అలాగే శుక్రవారం నారావారి పల్లెలో చంద్రబాబును కలిశారు. ఆయన పట్ల చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. అలాగే మరొక మాజీ ఎమ్మేల్యే ఎ ఎస్ మనోహర్ పేరు కూడ వినిపిస్తోంది. ఆయనకు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి వస్తుందని భావిస్తున్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డికి తప్పకుండా చోటు ఉంటుందని భావిస్తున్నారు. మరొక అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ ఇప్పటికే పలు సార్లు చంద్రబాబును కలసి తనకు అవకాశం కల్పించాలని కోరారు. చిత్తూరు చెందిన మాజీ ఎమ్మెల్సీ దొరబాబు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ రాష్ట్రస్థాయి చైర్మన్ రేసులో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముని చంద్రారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన భీమినేని చిట్టిబాబు, గ్యాస్ రవిలు కూడా రాష్ట్రస్థాయి పదవులను ఆశిస్తున్నారు. మూడవ జాబితా వారం రోజుల కిందటనే విడుదల కావాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయడు మరణముతో జాబితా ప్రకటన వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. రామ్మూర్తి నాయుడు ఉత్తర క్రియల కూడా పూర్తి కావడంతో మూడవ జాబితా త్వరలోనే విడుదల అవుతుందని కూటమి నేతలు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.