వైయస్సార్ సున్నా వడ్డీ పధకం అంటూ రైతులకు కుచ్చు టోపీ
అయిదు సంవత్సరాలలో రైతులకు రూ. 1000 కోట్ల నష్టం
ఈ పంట, ఈకేవైసి పేరుతో వడ్డీ రాయితీని ఎగ్గొట్టిన ప్రభుత్వం
30 శాతం రైతులకు లబ్ది, 70 శాతం మందికి రిక్తహస్తం
ప్రభుత్వం, బ్యాంకులు కలిసి రైతులను మోసం చేసిన వైనం
ఈ పంట, ఈకేవైసి విధానాన్ని సడలించాలని రైతుల వినతి
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతన్నలకు ఎంతో ఆర్భాటంగా సున్నా వడ్డి పథకం అంటూ ప్రకటించింది. అయితే అమలులో మాత్రం రైతులను దగా చేసినట్లు అర్థమవుతుంది. వాస్తవంగా సున్నా వడ్డీ పథకం జిల్లాలోని 30 శాతం రైతులకు మాత్రమే అమలు జరిగినట్లు ఒక విశ్లేషణలో వెళ్లడయ్యింది. 70 శాతం మంది రైతులకు సున్నా రుణ వడ్డీ పథకం అమలు కాలేదు. వడ్డీ తిరిగి జనం అవుతుందని ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు సున్నా వడ్డీ పథకాన్ని ఎగ్గొట్టడానికి పథకం ప్రకారం ప్రణాళికను రూపొందించింది. ఇందులో బ్యాంకు అధికారులు కూడా కీలకపాత్రను పోషించడం విశేషం. అయిదు సంవత్సరాల కాలంలో జిల్లాలోని రైతులు సుమారు వేయి కోట్ల రూపాయల వడ్డీ రాయితీని నష్టపోయినట్లు అంచనా.
చిత్తూరు జిల్లాలోని ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడతారు. వ్యవసాయం చేయడానికి బ్యాంకులు రైతులకు రుణాలను మంజూరు చేస్తాయి. రైతులకు పంట రుణాలు కింద బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేస్తాయి. 2022- 23 ఆర్థిక సంవత్సరానికి 5272 కోట్ల రూపాయలను పంట రుణాలుగా బ్యాంకులు అందజేశాయి. అలాగే 2023- 24 ఆర్థిక సంవత్సరంలో 7237 కోట్ల రూపాయలను పంట రుణాలుగా అందజేశాయి. చిత్తూరు జిల్లాలో 274 బ్యాంకు బ్రాంచ్ లు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో నటన 138, సెమీ అర్బన్ బ్యాంకులు 70, అర్బన్ బ్యాంకులు 66 పని చేస్తున్నాయి. వీటి ద్వారా రైతులకు పంట రుణాలను పొందుతారు. ఇందుకు జిల్లా స్థాయిలో లీడ్ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంకు వార్షిక రుణ ప్రణాళికను రూపొందించి వివిధ బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఈ మేరకు ఆయా బ్యాంకులు రైతులకు రుణాలను మంజూరు చేస్తాయి. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సున్నా శాతం రుణ పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయించింది. ఇందుకు వైయస్సార్ సున్నా వడ్డీ పథకం అని నామకరణం చేసింది. ఈ పథకం కింద లక్ష లోపు రుణాలు పొందిన రైతులకు కన్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. పంట రుణాలకు సంవత్సరం వరకు బ్యాంకులు 7 శాతం వడ్డిని అమలు చేస్తాయి. పంట రుణం కింద రుణం తీసుకున్న రైతులకు, వడ్డీ చెంచిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మూడు శాతం వడ్డీ రాయితీని జమ చేస్తుంది. గతంలో రుణం చెల్లించిన వెంటనే మూడు శాతం వడ్డీ రాయితీని రైతులకు చెల్లించేవాళ్లు. ప్రస్తుతం వారం, పది రోజుల తర్వాత మూడు శాతం నిధులను కూడా రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. అలాగే వైసిపి ప్రభుత్వం నాలుగు శాతం వడ్డీ రాయితీని వైయస్సార్ సున్నా పధకం కింద తిరిగి రైతులకు జమ చేయాలని, రైతులకు వడ్డీ లేని రుణాలను అందజేయడం నిర్ణయించింది. అయితే ఈ పథకం చాలా వరకు అమలు కాలేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట. ఈ కేవైసీ పేరుతో రైతులను దగా చేయడం ప్రారంభించింది. బ్యాంకులు చెరుకు పంటకు ఎకరాకు 85,000, టమాటా పంటకు 85,000, వరికి 25,000, మామిడి తోటలకు 35,000, అరటి తోటలకు 60,000, వేరుశనగ పంటకు 25 వేల రూపాయల చొప్పున పంట రుణాలుగా మంజూరు చేస్తాయి. జిల్లాలో ఎక్కువగా మామిడి తోటలు కనిపిస్తాయి. అయితే ఎక్కువ మొత్తం ఋణం కావలసిన రైతులు తాము చెరకు, టమేటా సాగు చేశామని, పంట రుణాలను తీసుకుంటున్నారు. అలాగే బ్యాంకులు కూడా తమ లక్ష్యాలను చేరుకోవడానికి రైతులు చెరకు సాగుచేసినట్లు నమోదు చేసుకుని రుణాలను ఇస్తున్నాయి. పొలంలో ఏ పంట ఉన్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం మూడు శాతం వడ్డీ రైతుని తిరిగి రైతులకు తిరిగి చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వడ్డిని తిరిగి చెల్లించడానికి ఈ పంట, ఈకేవైసీ లను కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ పంట ద్వారా గ్రామంలోని వ్యవసాయ శాఖ అధికారులు రైతులు వారి పొలంలో ఏ పంటను పండించారో దానిని నమోదు చేస్తారు. తర్వాత రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి ఈ కేవైసీ కింద అ పంటను ధ్రువీకరిస్తారు. బ్యాంకులో ఒక పంటకు పేరుతో రుణం తీసుకొన్న రైతులు మరొక పంటను వేస్తే నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే వడ్డీ రాయితీ రైతులకు అందడం లేదు. బ్యాంకులో ఒక పంటకు రుణం తీసుకున్నారని, రైతు మరో పంట వేశారని, పొలంలో ఉన్న పంటకు, బ్యాంకులో నమోదు చేసిన డానికి మ్యాచ్ కాలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం వడ్డీ రాయితీని ఎగ్గొడ్తుంది. ఇందులో బ్యాంకు అధికారులు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ఒకసారి బ్యాంకు అధికారులు ఒక పంట మీద రుణాన్ని మంజూరు చేస్తే, తిరిగి ఆ పంటను సవరించి, వాస్తవంగా ఉన్న పంటను నమోదు చేయడం లేదు. దీంతో జిల్లాలోని 70 శాతం రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అందలేదు. కేవలం 30 శాతం రైతులకు మాత్రమే ఈ పథకం అమలు అయ్యింది. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని అన్ని బ్యాంకులు కలిపి 7237 కోట్ల రూపాయలను పంట రుణాలను అందజేశాయి. వీటికి ఏడు శాతం వడ్డీ చొప్పున 507 కోట్ల రూపాయలను రైతులకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 217 కోట్ల రూపాయలను, రాష్ట్ర ప్రభుత్వం 289 కోట్ల రూపాయలను భరించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం మూడు శాతం వడ్డీ రాయితీ కింద 217 కోట్ల రూపాయలను సకాలంలో వడ్డీ చెల్లించిన రైతులందరికీ తిరిగి చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 289 కోట్ల రూపాయలలో కేవలం 86 కోట్ల రూపాయలను మాత్రమే తిరిగి చెల్లించినట్లు సమాచారం. 202 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించకుండా రైతులను మోసం చేసినట్లు తెలుస్తోంది. రైతులు ఒక సంవత్సరంలోపు వడ్డీ చెల్లించుకుంటే ఆ రుణం మీద 12 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం వడ్డీని రాయితీగా ఇచ్చింది. లక్షల నుంచి మూడు లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం మూడు శాతం వడ్డీ రాయితీ మాత్రమే చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే నాలుగు శాతం వడ్డీ రాయితీ వర్తించదు. సంవత్సరానికి రైతులు వడ్డీ రాయితీ కింద 200 కోట్ల రూపాయలు వంతున ఐదు సంవత్సరాలలో సుమారుగా 1000 కోట్ల రూపాయలను నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ పంట, ఈ కేవైసీ ద్వారా పంటల నమోదును చేస్తూ రైతులకు చెల్లించాల్సిన నాలుగు శాతం వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గోడుతుంది. గత వైసిపి ప్రభుత్వంలో ఈ విధానం ద్వారా జిల్లాలోని రైతులు భారీగా నష్టపోయారు. ప్రస్తుతం కొలువుతీరిన కూటమి ప్రభుత్వమైన ఈ నిబంధనలను సడలించి రైతులందరికీ సున్నా వడ్డీ పథకం అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లాలోని రైతాంగం విజ్ఞప్తి చేస్తుంది.
రెండేళ్లుగా బ్యాంకు ఖాతాలకు జమకాని నగదు
అన్నదాతలకు తప్పని ఎదురుచూపులుజిల్లాలో రైతులు సున్నా వడ్డీ కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. గత ఖరీఫ్‌లో అకాల వర్షాలు, తుపాను కారణంగా రైతులు నష్టపోయిన విషయం విధితమే. తాజాగా రబీ సీజన్ ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా సంస్థాగత రుణాలు అందించడం, పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తూ ఆర్థిక వెసులుబాటు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్ సున్నావడ్డీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో రెండేళ్లుగా వడ్డీ మాఫీ డబ్బులు అందకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రుణం సకాలంలో చెల్లించినా, వడ్డీ డబ్బులు జమ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రైతు లకు సున్నావడ్డీ రాయితీ తక్షణమే జమయ్యేది. వైసిపి అధికారంలోకొచ్చిన తర్వాత రెండేళ్లుగా సున్నా వడ్డీ రాయితీ సకాలంలోనే అందించింది. అనం తరం దీనికి బ్రేకులు వేసింది. ఎన్నికల ముందు అధిక మొత్తంలో రైతులకు సాయం చేస్తామంటూ సిఎం జగన్ ప్రకటించారు. అధికారంలోకొచ్చిన తర్వాత రూ.లక్షకు కుదించారు. ఏటా వడ్డీ చెల్లించి రైతులను ఆదుకోవాల్సి ఉండగా కేంద్రం ఇచ్చే రాయితీతో సరిపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. 2019-20లో జిల్లాలో 14,190 మంది రైతులకు రూ.2.74 కోట్లు, 2020-21లో 19,993మంది రైతులకు రూ.5.01 కోట్లు చెల్లించినట్టు జిల్లా వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. సున్నావడ్డీ రాయితీ 2022, 2023 సీజన్లకు సంబం ధించి సుమారు 50 వేల మందికి పైగా రైతులకు రూ.25కోట్లు బకాయిలు ఉన్నాయి. రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులకు ఈ వడ్డీ మాఫీ వర్తిస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రాయితీ కిసాన్ క్రెడిట్ కార్డు పథకం నిబంధనలకు అనుగుణంగా అర్హత ప్రమాణాలు విధించారు. ఆ మేరకు రైతుల బ్యాంకు ఖాతాలకు ఏటా పంట సీజన్ ముగిసే సమయానికి ఇవి జమకావాలి. పంట రుణాలపై సున్నావడ్డీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం వడ్డీ చెల్లించాలి. ఇలానే రూ.3లక్షల లోపు రుణం తీసుకుని ఏడాదిలోగా చెల్లిస్తే ప్రామ్ట్ రీపేమెంట్ సున్నావడ్డీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వెంటనే వారి ఖాతాలో మూడు శాతం నగదు జమ చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సకాలంలో చెల్లించడం లేదని రైతులు వాపోతున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత రైతులకు ఉపయోగపడే అనేక పథకాలకు మంగళం పలికింది. కేవలం రైతు భరోసా అందించి తమది రైతు ప్రభుత్వం అని ప్రచార చేసుకుంటోంది. అయితే ఆచరణలో పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోందని రైతులు వాపోతున్నారు.