టిటిడి పాలకమండలిలో చిత్తూరు జిల్లాకు అగ్రస్థానం
చైర్మన్ గా బి ఆర్ నాయుడు
సభ్యుడిగా శాంతారాం
జిల్లా టిడిపి వర్గాలలో హర్షాతిరేకాలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కూర్పులో చిత్తూరు జిల్లాకు అగ్రస్థానం లభించింది. పెనుమూరు మండలానికి చెందిన మీడియా అధినేత బిఆర్ నాయుడు టిటిడి చైర్మన్ గా నియమితులయ్యారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన నాయిబ్రాహ్మణ సాధికార కమిటీ చైర్మన్ శాంతారాం సభ్యులుగా నియమితులయ్యారు. చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరికీ ప్రాతినిధ్యం లభించడం పట్ల టిడిపి వర్గాలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. టీటీడీ చైర్మన్ గా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోకి చెందిన బిఆర్ నాయుడు నియమించడం పట్ల టిడిపి శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. ఆ నియోజకవర్గం నుండి టిటిడి చైర్మన్ బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి బిఆర్ నాయుడు. అలాగే చిత్తూరు జిల్లా నుంచి కమ్మ సామాజిక వర్గం నుండి చైర్మన్ గా మొట్టమొదట నియమితులైన వ్యక్తి కూడా బియర్ నాయుడు అవుతారు. మీడియా అధిపతిగా ఉంటూ టిటిడి చైర్మన్ గా నియమితులైన మొదటి వ్యక్తిగా కూడా బిఆర్ నాయుడు రికార్డ్ సృష్టించారు.
చిత్తూరు జిల్లాకు చెందిన బొల్లినేని రాజగోపాల్ నాయుడు ( బి ఆర్ నాయుడు) టీటీడీ పాలక మండలి చైర్మన్ అయ్యారు. గతంలో జిల్లాకు చెందిన డి కె ఆదికేశవులు నాయుడు టీటీడీ చైర్మన్ గా సేవలు అందించారు. జిల్లాకు చెందిన రెండవ వ్యక్తిగా బి ఆర్ నాయుడుకు అవకాశం రావడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జి డి నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలం దిగువ పునేపల్లిలో జన్మించిన ఆయన చిత్తూరు బి జడ్ ఉన్నత పాఠశాలలో చదువు కొన్నారు. ఉన్నత విద్యానంతరం హైదరాబాదులో ఉద్యోగంలో చేరారు. తరువాత ఎన్టీఆర్ కు దగ్గరై ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారవేత్తగా మారారు. అలాగే ఒక ఎలక్ట్రానిక్ మీడియా సంస్థకు అధిపతి అయ్యారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో టిడిపికి అండగా నిలిచి పోరాటం చేసారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంలో ఆయన పాత్రకూడా ఉంది. దీంతో బిఆర్ నిడుకు టిటిడి చైర్మన్ పదవి లభిస్తుందని టిడిపి వర్గాలలో జోరుగా ప్రచారం జరిగింది. అది నిజం చేస్తూ చంద్రబాబు బిఆర్ నైడును టిటిడి చైర్మన్ గా నియమించారు. గత పూతలపట్టు నియిజకవర్గం నుండి మాజీ ఎం ఎల్ ఏ తలారి రుద్రయ్య టిటిడి సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం అదే మండలానికి చెందిన బిఆర్ నాయుడు కు చైర్మన్ గా అదృష్టం వరించింది. ఆయనతో పాటు కుప్పం నియోజకవర్గానికి చెందిన శాంతారాం ( నాయీ బ్రాహ్మణ) కు అవకాశం కల్పించారు. గతంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన గౌనివారి శ్రీనివాసులు టిటిడి బోర్డు సభ్యుడిగా పనిచేశారు. అయన టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గా, అధ్యక్షుడిగా, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా పని చేశారు. తరువాత శాంతారాం కు అవకాశం లభించింది. ఈ నెల ఆరవ తేదీన టీటీడీ పాలక మండలి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇదిలా ఉండగా తిరుమలలో జరిగిన అవినీతిని వెలికి తీస్తానని, దేవుడిని సామాన్య భక్తులకు దగ్గర చేస్తానని నాయుడు చెప్పారు. తన మీద నమ్మకం ఉంచి అవకాశం కల్పించినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నియామకం తరువాత జిల్లా రాజాకీయ సమీకరణల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయన కమ్మ సామాజిక వర్గం కావడం వల్ల జిల్లా నుంచి ఆ వర్గానికి చెందిన ఇతరులకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు దక్కక పోవచ్చు అంటున్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన పదవులలో రాష్ట్ర స్థాయి డైరెక్టర్లుగా ఒక బలిజ, ఒక బిసి నేతకు అవకాశం దొరికింది. అలాగే ఆర్టీసీ వైస్ చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యునిగా కుప్పం నియోజక వర్గానికి చెందిన బిసి నేతలు నియమితులు అయ్యారు. ఈ నేపథ్యంలో రెడ్డి, బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలకు రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆర్ కె రోజా, కె నారాయణ స్వామి, వైసిపి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి లను ఎదుర్కొగల రెడ్డి నేతకు ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో విడుదల కానున్న నామినేటెడ్ పదవులలో ఒకటి జిల్లాకు దక్కే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.