కొత్త పించన్లకు మోక్షం ఎప్పుడు ?
11 నెలలుగా ఆగిన కొత్త పించన్ల మంజూరు
జిల్లాలో 20 వేల మంది పించన్ కోసం నిరీక్షణ
గ్రామ సచివాలయాల చుట్టూ తిరుగుతున్న దఖస్తుదారులు
తమను కనికరించాలని ప్రభుత్వానికి వేడుకోలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
రాష్ట్రవ్యాప్తంగా గత 11 నెలలుగా కొత్త పింఛన్ల మంజూరుకు బ్రేక్ పడింది. సాధారణంగా ప్రతి 6 నెలలకు ఒక సారి ప్రభుత్వం కొత్త పించన్లను మంజూరు చేస్తుంది. కూటమి ప్రభుత్వం కొత్త పించన్ లను విస్మరించింది. చివరిసారిగా గత సంవత్సరము డిసెంబర్ లో కొత్త పించన్లు మంజూరు అయ్యాయి. వాటిని జనవరిలో ఇచ్చారు. తరువాత ప్రభుత్వం కొత్తగా పించన్ లను మంజూరు చేయలేదు. ఇదివరకు ఉన్న పింఛన్లను మాత్రం పంపిణీ చేస్తున్నారు. పాత పింఛన్దారులకు వైసీపీ ప్రభుత్వంలో ఇస్తున్న మొత్తాలను పెంచి మరి అందజేస్తున్నారు. కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు గత 11 నెలలుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
తమకు పింఛన్లు ఎప్పుడు వస్తాయని గ్రామ సచివాలయాలు, చుట్టూ మండల కార్యాలయాలు చుట్టూ లబ్దిదారులు కాళ్లు అలిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వం కొత్తగా పెన్షన్లను మంజూరు చేయడం లేదని, మంజూరు చేయగానే ఇస్తామని మండల అధికారులు లబ్ధిదారులకు నచ్చ చెబుతున్నారు. జిల్లాలో సుమారుగా 20,000 మంది కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా వితంతు పెన్షన్లను కూడా మంజూరు చేయడం లేదు. గతంలో భర్త చనిపోతే ఆ పింఛన్ ను భార్యకు మరుసటి నెల నుండి అందచేసే వారు. ప్రస్తుతం కొత్త పింఛన్ల మాటను కూటమి ప్రభుత్వం మర్చిపోయింది. గతంలో ఉన్న లబ్ధిదారులకే పింఛన్లు అందజేయడంలోనే నిమగ్నమై ఉంది. దీంతో వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు కొత్త పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సామాజిక పించన్ల కారణంగా చిత్తూరు జిల్లాలో 2,68,820 మంది లబ్ధి పొందుతున్నారు. వీరికి ప్రతి 113 కోట్ల రూపాయలను అందచేస్తున్నారు. వీరికి ఏప్రిల్ నెల నుంచి పింఛన్ మొత్తలను కూటమి ప్రభుత్వం పెంచింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కార్మికులు, కళాకారులు, హెచ్ఐవి భాదితులు, హిజ్రాలు, చెప్పులు కుట్టే వారికి మూడు వేల రూపాయల నుంచి 4వేల రూపాయలుగా పెంచారు. ఈ మొత్తాన్ని ఏప్రిల్ నుంచి లెక్కగట్టి, జూలైలో ఒకేసారి ఏడువేల రూపాయలుగా అందజేశారు. అలాగే దివ్యాంగులకు 3000 ఉన్న పెన్షన్ ను 4000 రూపాయలు చేశారు. కుష్టు వ్యాధితో వైకల్యం సంభవించిన వారికి పెన్షన్ కూడా 3వేల నుంచి 6 వేలకు పెరిగింది. కిడ్నీ, కాలేయం, గుండె అపరేషన్ చేసుకున్న వారికి, డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలసరి పింఛన్ 5000 నుంచి 10000 రూపాయలకు పెంచారు. మంచానికే పరిమితమైన వారికి పింఛన్ 5000 నుండి 15 వేలకు పెరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన సందర్భంగా ఎన్ టి ఆర్ భరోసా పేరుతో అందచేస్తున్నారు. వీరిలో అభయ హస్తం అందుకుంటున్న 11,358 మందికి, సైనిక వెల్ఫేర్ పింఛన్లను అందుకుంటున్న 62 మందికి ఈ పించన్ల పెంపు వర్తించలేదు. మిగిలిన 2,61,554 మందికి పింఛన్ మొత్తాలు పెరిగాయి. చిత్తూరు జిల్లాలో వృద్ధాప్య పెన్షన్ కింద 1,46, 023 మందికి అవ్వ తాతలకు పింఛన్లు అందజేస్తున్నారు. 2,575 మంది చేనేత కార్మికులకు, 59, 903 మంది వితంతువులకు, 35,927 మంది వికలాంగులకు, 562 మంది కల్లుగీత కార్మికులకు, 32 మంది హిజ్రాలకు, 5751 మంది ఒంటరి మహిళలకు, 248 మంది చేపలు పట్టేవారికి, 6,296 మంది డప్పు కళాకారులకు, 794 మంది చెప్పులు కుట్టే వారికి, 71 మంది కళాకారులకు పెన్షన్లు అందజేస్తున్నారు. అలాగే వివిధ వ్యాధిగ్రస్తులకు 2,764 మందికి, ప్రైవేట్ గా డయాలసిస్ చేసుకుంటున్న వారికి 303 మందికి, ప్రభుత్వపరంగా డయాలసిస్ చేసుకుంటున్నా 195 మందికి పెన్షన్లు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం పాత పింఛన్దారులకు పింఛన్ మొత్తాలను పెంచి అందజేయడం పట్ల పింఛన్దారులలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న పింఛన్దారులను నిర్లక్ష్యం చేయడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్తను కోల్పోయిన వితంతువులు తమకు పింఛన్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. భర్త లేకపోవడంతో తమకు జీవనాధారం లేకుండా పోయిందని, తమను ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన చెందుతున్నారు. కొత్తగా ప్రమాదాలలో వికలాంగులైన వారు, ఒంటరి మహిళలు ఆవేదన చెప్పనలివి కావడం లేదు. పించన్ కోసం ప్రతి నెలా ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొత్త పింఛన్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకొని త్వరగా అర్హులైన వారికి అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
పో రై గంగ 1 పించన్ అందచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైల్ ఫోటో