వారం రోజుల్లో నామినేటెడ్ పోస్టుల పందారం
కూటమి నేతల్లో మళ్ళీ చిగురిస్తున్న ఆశలు
పదవుల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు
జాబితాలను కాచి, వడపోస్తున్న అధిష్టానం
అసెంబ్లీ సమావేశాలకు ముందే పోస్టుల ప్రకటన
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
వారం రోజుల్లోనే నామినేటెడ్ పోస్టుల పందారం ఉంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందడంతో జిల్లాలోని కూటమి నేతలలో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. పదవులను దక్కించుకోవడానికి నాయకులు తమ వంతు ప్రయత్నాలను ప్రారంభించారు. ఆ పార్టీలోని ముఖ్య నేతలను కలిసి తనకు నామినేటెడ్ పోస్టు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. జిల్లా మంత్రులు, శాసనసభ్యులను కలుస్తున్నారు. రాష్ట్ర టిడిపి కార్యాలయంలో ముఖ్య నేతలతో సిఫారసు చేయిస్తున్నారు. ఎలాగైనా రానున్న జాబితాలో తన పేరు ఉంటే విధంగా చూడాల్సిందిగా తెలుగుదేశం, జనసేన, బిజెపి అగ్ర నేతలను జిల్లా నాయకులు, కార్యకర్తలు మనవి చేస్తున్నారు.
దీపావళి సందర్భంగా రెండవ జాబితా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రెండో పర్యాయం 41 కార్పొరేషన్ల చైర్మన్లను, పాలకమండలని నియమించనున్నట్లు తెలిపారు. దీంతో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు ఎంతో ఆతృతగా నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూశారు. అయితే, దీపావళి సందర్భంగా టిటిడి బోర్డులు మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీపావళి అయిపోయినా, నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎలాంటి ప్రకటన లేకపోవడంతో నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. తిరిగి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తీపి కబురు కూటమి నేతలకు అందింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం 6 గంటల పాటు ఈ విషయంలో పార్టీ కార్యాలయంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై కసరత్తు చేశారని టిడిపి నేతలకు సమాచారం అందింది. ఈనెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఉన్నాయి. ఈ లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ పర్యాయం మొదటి జాబితా కంటే రెండు మూడు రెట్లు పదవుల అదనంగా ఉంటాయని భావిస్తున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతున్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన నాయకులందరూ నామినేటెడ్ పోస్టుల పైన ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం కూడా రెండు మూడు రకాలుగా సర్వేలను నిర్వహించింది. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పార్టీ కోసం శ్రమించిన వారి జాబితాను తెప్పించుకుంది. అలాగే రాబిన్ శర్మ టీం నుంచి ఒక నివేదిక అందింది. వీరితోపాటు నియోజకవర్గాల పరిశీలకులుగా పనిచేసిన వారు కూడా నివేదికలు అందజేశారు. రాష్ట్రస్థాయి ప్రోగ్రామ్స్ కమిటీ నుంచి కూడా రిపోర్టు తీసుకున్నారు. ఇవి కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు వేరువేరుగా సర్వే నివేదికలను తెప్పించుకున్నారు. ఈ నివేదికలను సమన్వయం చేసి అర్హులు అయిన వారికి నామినేటెడ్ పోస్టులను ఇవ్వడానికి కసరత్తు జరుగుతుంది. గత ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం ఎక్కువ ప్రభావం చూపిన నాయకులు, అభ్యర్థి గెలుపు కోసం ధన సహాయం చేసిన వారు కూడా జాబితాలో ఉన్నారు. నియోజకవర్గాల వారిగా జాబితాలు తయారయ్యాయి. వీటికి తోడు సంబంధిత శాసనసభ్యుల నుంచి కూడా జాబితాలను తెప్పించుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్ పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది. జిల్లాలో మొదటి జాబితాలో కుప్పంకి చెందిన మునిరత్నంకు ఆర్టీసీ ఉపాధ్యక్ష పదవి లభించింది. ఆయనకు క్యాబినెట్ హోదా ఇచ్చే విషయం కూడా పరిశీలనలో ఉంది. తర్వాత గంగాధర నెల్లూరు మండలం పెనుమూరుకు చెందిన బిఆర్ నాయుడు కు టిటిడి బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టారు. జిల్లాలో ఇప్పటివరకు బలహీన వర్గాలకు, కమ్మ సామాజిక వర్గానికి క్యాబినెట్ హోదా పెదవుల లభించాయి. చిత్తూరు మున్సిపల్ మాజీ మేయర్ కటారి హేమలతకు డైరెక్టర్ పోస్టుతో సరిపెట్టారు. చిత్తూరు అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సి కె బాబు, మాజీ ఎమ్మెల్యే మనోహర్, మాజీ ఎం ఎల్ సి దొరబాబు పార్లమెంటు అధ్యక్షుడు సి ఆర్ రాజన్, పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి కోదండయదవ్, కాజూరు బాలాజీ, వై వి.రాజేశ్వరి, చెరుకూరు వసంత కుమార్, గుడిపాలకు చెందిన అరణి బాలాజీ పేర్లు వినిపిస్తున్నాయి. పలమనేరుకు చెందిన మాజీ మంత్రి అమరనాధ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పూతలపట్టుకు చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుష్పరాజ్ కూడా చంద్రబాబును కలసి వచ్చారు. తవనంపల్లికి చెందిన కోడందయ్య కూడా పదవుల రేస్ లో ఉన్నారు. గుడిపాలకు చెందిన పీటర్, మాజీ ఎం ఎల్ ఏ గాంధీ, పుత్తూరుకు చెందిన గ్యాస్ రవికుమార్ కూడా పదవి ఆశిస్తున్నారు. బిజెపి నుండి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, బిసి నేత అట్లూరి శ్రీనివాసులు కూడా రేసులో ఉన్నారు. పలమనేరు నుంచి పెద్దగా పేర్లు వినిపించడం లేదు. పుంగనూరు నియోజక వర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో తలపడి ఓడిపోయిన చల్లా రామచంద్రా రెడ్డికి పదవి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. జి. డి నెల్లూరు నియోజక వర్గం నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు అరుణలకు పదవీ యోగం ఉందంటున్నారు. జనసేన ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ కూడా పదవి రేసులో ఉన్నారు. నగరి నియోజకవర్గంలో మాధవ నాయుడు, పోతుగుంట విజయబాబు పదవులను ఆశిస్తున్నారు. అయితే అక్కడ సిద్ధార్థ విద్యాసంస్థలు అధిపతి అశోక్ రాజుకు బిజెపి కోటాలో పదవి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎవరిని, ఏ విధంగా కరుణిస్తారో వేచి చూడాలి.