చిత్తూరు తాగునీటి అవసరాలకు బృహత్తర పధకం
అడవిపల్లి రిజర్వాయర్ నుండి 0.785 టిఎంసిల నీటి కేటాయింపు
గురువారం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రోజుకు 27 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం
పూర్తి అయితే ప్రతి రోజు తాగునీటి సరఫరా
10 మిలియన్ లీటర్ల మిగులుతో ప్రాజెక్టు మంజూరు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరు నగర తాగునీటి సమస్యను పరిష్కరించడానికి గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర నిర్ణయం తీసుకుంది. కంబంవారిపల్లి మండలం అడవిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరుకు తాగు నీటిని తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో చిత్తూరు పట్టణానికి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. చిత్తూరు శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్ నాయుడు చొరవతో ఈ ప్రాజెక్టును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీల భాగంగా చిత్తూరుకు శాశ్వత తాగునీటి పథకాన్ని మంజూరు చేస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
కంభం వారి పల్లి మండలం సమీపంలోని అడవిపల్లి రిజర్వాయర్ నుంచి 0.785 టీఎంసీల నీటిని చిత్తూరు త్రాగునీటి అవసరాలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని తిరుపతి తెలుగుగంగ చీఫ్ ఇంజనీర్ కు అప్పగించింది. దీనిపై సత్వరం చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. సుమారు 276 కోట్ల రూపాయలతో అడవిపల్లె రిజర్వాయర్ నుండి చిత్తూరుకు తాగునీటిని తీసుకుని రానున్నారు. సుమారు 80 కిలోమీటర్ల పైపు లైన్ నిర్మించవలసి ఉంటుంది. ఫలితంగా చిత్తూరు నగరానికి తాగునీటి సమస్య శాశ్వతంగా తీరే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్తూరు పట్టణ జనాభా రెండు లక్షలు. ఈ జనాభాకు మనిషికి 130 లీటర్ల నీటి వంతున రోజుకు 27 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతాయి. కలవకుంట వద్ద 10 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఎన్టీఆర్ జలాశయం నిర్మాణం జరిగింది. అయితే ప్రస్తుతం ఆరు మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే ఎన్టీఆర్ జలాశయం నుంచి చిత్తూరుకు సరఫరా అవుతుంది. ఇది కాకుండా పూనేపల్లి నుంచి ఒక మిలియన్ లీటర్ల నీరు సరఫరా అవుతుంది. 27 మిలియన్ లీటర్ల నీరు లోటు ఉంది. ఈ లోటును అధికమించడానికి పట్టణంలో బోర్ల మీద ఆధారపడుతున్నాము. చిత్తూరు నగరంలో 480 వరకు బోర్లు ఉన్నాయి. ఈ బోర్ల ద్వారా రోజుకు సుమారు 23 మిలియన్ లీటర్ల నీటిని ఉపయోగిస్తున్నట్లు అంచనా. వీటి నిర్వహణ వ్యయం తడిచి మోపెడు అవుతోంది. ప్రాజెక్టుల నుంచి ఏడు మిలియన్ లీటర్ల నీళ్లు మాత్రమే సరపరా వస్తుండడంతో, చిత్తూరు పట్టణానికి రోజు మార్చి రోజు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి దీర్ఘ కాలంగా ప్రజాప్రతినిధులు పోరాడుతున్నారు. దీనికి వైసిపి ప్రభుత్వ పాలనలోనే కొంత కసరత్తు జరిగింది. అయితే నిధుల కొరత కారణంగా వైసిపి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అడవిపల్లె రిజర్వాయర్ నుండి చిత్తూరుకు తాగునీటిని తీసుకుని వస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ నాయుడు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి చిత్తూరు పట్టణ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం గురించి చర్చించారు. దీంతో కేవీ పల్లి మండలం అడవిపల్లె రిజర్వాయర్ నుంచి 0.785 టీఎంసీల నీటిని చిత్తూరు మున్సిపాలిటీ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అడవిపల్లె నుంచి చిత్తూరుకి తాగునీటిని తీసుకుని రావాలంటే 276 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా. ఈ అంచనా పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నిధులతో అడవిపల్లి రిజర్వాయర్ నుంచి రోజుకు 27 మిలియన్ లీటర్ల నీటిని చిత్తూరుకు తరలించే అవకాశం ఉంది. చిత్తూరు పట్టణం సమీపంలోని ఎన్టీఆర్ జలాశయం పది మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నడుస్తోంది. మొత్తం కలుపుకుంటే 37 మిలియన్ లీటర్ల నీరు చిత్తూరుకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం చిత్తూరు పట్టణానికి 27 మిలియన్ లీటర్ల నీటి అవసరం ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో 10 మిలియన్ లీటర్ల నీటిని అదనంగా సరఫరా చేయడానికి వీలుగా అడవి పల్లి ప్రాజెక్టును డిజైన్ చేయనున్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును ప్రారంభించి చిత్తూరుకు తాగునీటిని తీసుకుని రావాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే చిత్తూరు తాగునీటి సమస్య శాశ్యతంగా తిరనుంది.
పో రై గంగ 1 అడవిపల్లి రిజర్వాయర్ ను పరిశీలిస్తున్న చిత్తూరు ఎంఎల్ఏ ఫైల్ ఫోటో

