వేగంగా వ్యాపిస్తున్న మధుమేహ మహమ్మారి.
రేపు ప్రపంచ మధుమేహం దినోత్సవం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. చిన్న, పెద్దా తేడా లేదు. మన దేశంలోనూ డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. అయితే కొత్తగా ఆ వ్యాధి బారిన పడుతున్న వారిలో చాలామంది తమకు డయాబెటిస్ ఉందన్న విషయాన్ని త్వరగా గుర్తించలేకపోతున్నారు. దాంతో వ్యాధి ముదిరి ప్రమాదం అంచుల వరకు వెళ్ళిపోతున్నారు. అందుకే డయాబెటిస్‌ను ముందే గుర్తించడం చాలా ముఖ్యం. కాబట్టి మధుమేహం మొదలైతే మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
డయాబెటిస్ వచ్చే ముందు మనలో కనిపించే లక్షణాలను ప్రీడయాబెటిస్ సింప్టమ్స్ అంటారు. ఈ ప్రీడయాబెటిస్ సింప్టమ్స్ కింది పేర్కొన్న విధంగా ఉంటాయి. అయితే కొంతమందిలో మాత్రమే కింద పేర్కొన్న వాటిలోని అన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. మరి కొందరిలో మాత్రం వీటిలో కొన్ని రకాల లక్షణాలు మాత్రమే బయటపడుతాయి. మధుమేహం వచ్చే ముందు కొందరిలో జుట్టు రాలుతుంది. అయితే జుట్టు రాలిందంటే కచ్చితంగా మధుమేహం ఉన్నట్లు కాదు. సంబంధిత పరీక్షలు చేయించుకుంటే ఈ విషయంలో కచ్చితత్వం వస్తుంది. డయాబెటిస్ బారిన పడిన కొత్తలో కొందరిలో అలసట పెరుగుతుంది. రోజంతా అలసటగా ఉంటుంది. పని చేసినా, ఏ పని చేయకపోయినా అలసటగా అనిపిస్తుంది. కొందరికి మధుమేహం సోకితే చర్మంపై మచ్చలు వస్తుంటాయి. ఇలా చర్మంపై మచ్చలు కనిపిస్తే షుగర్ సంబంధ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఇంకా కొంత మందిలో మధుమేహం బారిన పడినప్పుడు తరచూ మూత్రం వస్తుంది. మూత్రానికి వెళ్లినా కొద్ది దాహం వేస్తుంది. నీళ్లు తాగినా కొద్ది యూరిన్‌కు వెళ్లాల్సి వస్తుంది. కొంత మందిలో పై లక్షణాలతోపాటే అదనంగా తరచూ తలనొప్పి వస్తుంది. చేతులు, కాళ్లు తిమ్మిర్లు పడుతాయి. పై లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే షుగర్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచం మొత్తంలో గల మధుమేహ బాధితుల్లో 21 శాతం, మన భారతీయులేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు తెలుపుతున్నాయి. ఆ సంస్థ గణాంకాల ప్రకారం ఇప్పటికే మన దేశంలో 8 కోట్ల మంది మధుమేహంతో బాధ పడుతుంటే, ఆ సంఖ్య 2045 నాటికి 13 నుండి 14 కోట్లకు చేరుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. గతంలో ఎక్కువగా 50 నుంచి 60 సంవత్సరాల వయసుగల వారిలో గుర్తించిన మధుమేహం, ఇప్పుడు యుక్తవయస్సులోనే 30 నుంచి 40 సంవత్సరాల్లోనే గుర్తించడం జరుగుతున్నది. ఇది భారతీయులను ఆందోళన కలిగించే విషయమే. ఇంకా చిన్న వయస్కులలో కూడా అంటే పిల్లలలో టైప్-2 మధుమేహం కనిపించడం మరింత ఆందోళన కలిగిస్తుంది. మన దేశంలోని స్కూలు పిల్లల్లో మధుమేహం బారిన పడ్డారని చెప్పలేకపోయినా, 60 శాతం పిల్లల్లో అసాధారణ బ్లడ్ షుగర్స్ ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఇంకా మన దేశంలో గుర్తించని మధుమేహ బాధితులు ఎంతోమంది ఉన్నారని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఏదో ఒక ఆరోగ్య సమస్య సందర్భంలో యాదృచ్ఛికంగా బ్లడ్‌షుగర్ పరీక్ష చేసినప్పుడే చాలామందిలో మధుమేహం బయట పడుతున్నది. జనాభాపరంగా మన దేశం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. చైనాని వెనక్కి నెట్టేసి ముందుకు వచ్చేసింది. జనాభాలో ముందున్నంత మాత్రాన, మధుమేహంలో ముందు ఉండాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వాల, ప్రజల స్వయంకృతాపరాధమే చాలావరకు మధుమేహం వ్యాప్తికి కారణమని చెప్పక తప్పదు. అధిక శాతం ప్రజల్లో శారీరక శ్రమ తగ్గిపోయింది. నిశ్చల శ్రమ తత్వం పెరిగిపోయింది. చాలామందిలో మానసిక ఒత్తిడి తప్ప, శారీరక కదలికలు లేవు. వీటికి తోడు పర్యావరణ మార్పులు, వంశపారంపర్యత (జనెటిక్), జీవన సరళలో, ఆహారంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు మధుమేహం విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మన దేశంలో తల్లిదండ్రులు ఇద్దరికీ మధుమేహం ఉన్నా, వారి పిల్లలలో కేవలం 7 శాతం మందిలో మాత్రమే జీవిత కాలంలో మధుమేహం బారిన పడ్డారు. వీరిలో కూడా ఆహారం, వ్యాయామం జీవన సరళిలో మార్పుల ద్వారా చాలావరకు నియంత్రించవచ్చునని పరిశోధనలో వెల్లడి అయింది. ఈ విధంగా మధుమేహం బారిన పడకుండా చాలాకాలం కాపాడవచ్చు. మన జన్యువులలోనే ఉంది కదా, ఎలా తప్పించుకోగలమని నిరుత్సాహ పడవలసిన అవసరం లేదు. నిరోధించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని సమస్యను అధిగమించాలి.
పో రై గంగ 1 మధుమేహం పరిక్ష