29, నవంబర్ 2024, శుక్రవారం

రైతన్నకు వరం పిఎం ఫసల్‌ బీమా యోజన

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణ 

అతి తక్కువ ప్రీమియంతో పంటల బీమా 

జిల్లాలో వరి, వేరుశనగ పంటలకు వర్హింపు 

పంట నష్టం జరిగితే రైతుకు బీమా చెల్లింపు   

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

తుఫానులు, కరువు, అకాల వర్షాల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటల దిగుబడి నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. ఈ పథకం కింద చిత్తూరు జిల్లాలో వరి, వేరుశనగ పంటలకు అతి తక్కువ ప్రీమియంతో  బీమా చేసుకున్న వచ్చును. వరి సాగు చేసిన రైతులు ఎకరాకు ప్రీమియంగా 84 రూపాయలు, వేరుసెనగ సాగుచేసిన రైతులు ఎకరాకు 60 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది. ఏదేని కారణాల చేత వరి పంట నష్టపోతే ఎకరాకు 42 వేల రూపాయలు, వేరుశెనగకు ఎకరాకు 30 వేల రూపాయలను బీమా కంపెనీలు నష్టపరిహారంగా చెల్లిస్తాయి. అయితే వరి పంటకు బీమా ప్రీమియం చెల్లించడానికి డిసెంబర్ 31 ఆఖరి తేదీ కాగా, వేరుశనగ పంటకు డిసెంబర్ 15వ తేదీ లోపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. తదుపరి చెల్లించే ప్రీమియంను ఈ పథకం కింద పరిగణంలోకి తీసుకోరు.

 ప్రకృతి విపత్తులు, అతి భారీ వర్షాలు. కళ్లముందు కాసుల రూపంలో కనిపించే పంటంతా నీటిపాలైన పరిస్థితులు. ఆరుగాలం ఇంటిల్లిపాదీ శ్రమించి పండించిన పంటంతా నేలపాలైన సందర్భాలు. పెట్టుబడి మొత్తం తుడిచిపెట్టుకుపోతే రైతన్న పడే మనోవేదన వర్ణనాతీతం. ఈ క్రమంలో అప్పుల పాలయ్యే వారు కొందరైతే, ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలూ చేసుకునే వారు ఇంకొందరు. కాగా పంటకు బీమా లేకపోవడమే ఈ దుస్థితికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులు రాకూడదని, రైతులకు అండగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట బీమా పథకాలు అమలు చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కాలానికి అనుగుణంగా బీమా పథకాన్ని సులభతరం చేసింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. భారతదేశంలో 60 శాతం కంటే ఎక్కువగా కుటుంబాలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. అందులో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. పంట నష్టం జరిగితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకు అందించే బీమానే  ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన. ఈ పథకంతో ఏదైనా విపత్తు సంభవించినా లేదా ఆ రైతు మరణించినా అతడికి సంబంధించిన వారికి కొంత సొమ్ము బీమాగా లభిస్తుంది. అలాగే, జరిగిన ఆస్తి నష్టం తిరిగి పొందడానికి కూడా బీమా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు అతివృష్టి, అనావృష్టి, మరికొన్ని సార్లు మార్కెట్ సరిగ్గా లేక నష్టపోవడం లేదా, పంట చేతికి వచ్చే సమయానికి పురుగురావడం, ఇలా ఎన్నో ప్రమాదాల నుంచి ఫసల్ బీమా పంటల్ని కాపాడుతుంది. ఫసల్‌ బీమాను బీమా కంపెనీలతో కలిసి 2016లోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వచ్చే పంట కాలం నుంచే రైతులు ఈ పథకంతో లబ్ధి పొందుతారని కేంద్ర, రాష్ట్ర అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో బీమా ప్రీమియం చెల్లింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున నిధులను భరిస్తాయి. ఇది అమలైతే ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎలాంటి భారం లేకుండా బీమా అందుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఈ పథకానికి రైతులు గ్రామ సచివాలయానికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఇక బ్యాంక్, మీ సేవ సెంటర్స్ లేదా పీఎంఎఫ్​బీవై వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకుల్లోనూ అప్లై చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీరే ఇంట్లో ఉండి  www.pmfby.gov.in వెబ్‌సైట్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అందులోనే మన దరఖాస్తు స్టేటస్‌ కూడా తెలుసుకోవచ్చు.  ఇలా దరఖాస్తు చేసుకున్న రైతుకు ఫసల్ బీమా యోజన ద్వారా పంటలకు పరిహారం విషయానికి వస్తే, ఈ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా భాగస్వామ్యం ఉండే బీమా కంపెనీలు కూడా ఉంటాయి. మీ సేవ కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, బ్యాంకుల్లో ఇలా ఎక్కడ దరఖాస్తు చేసుకున్నా సరే రశీదుతో పాటు సంబంధిత బీమా కంపెనీ వివరాలు అందిస్తారు. లేదా www.pmfby.gov.in వెబ్‌సైట్‌లోనూ మీ రశీదు నంబర్‌ ద్వారా తెలుసుకోవచ్చు.  సంబంధిత బీమా కంపెనీని మీరే స్వయంగా సంప్రదించి మీ పంట నష్టం గురించి తెలియజేయవచ్చు. లేదా మీ గ్రామ వీఆర్వో, వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించిన ఫలితం ఉంటుంది.  పంట నష్టం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయాలి. మీరు ఫిర్యాదు ఇచ్చిన వారం రోజుల్లోనే సంబంధిత బీమా కంపెనీ అధికారి వచ్చి అంచనా వేసి తగిన పరిహారాన్ని రైతులకు అందిస్తారు. పంటల బీమాకు గతంతో పోలిస్తే ప్రీమియాలు పెరిగాయి. ప్రస్తుత వానాకాలం పంటలకు 2 శాతం. యాసంగి పంటలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5శాతం ప్రీమియాన్నిబీమా సంస్థలు వసూలు చేస్తున్నాయి. పంట విత్తు నుంచి కోత వరకు ప్రకృతి విపత్తు కారణంగా ఏమైనా నష్టం వాటిల్లితే రైతుకు బీమా సొమ్ము జమ అవుతుంది. కౌలుదారులతో సహా రైతులందరూ ఈ పథకం కింద లబ్ది పొందడానికి అర్హులే. ఫసల్‌ బీమా పథకం కింద ఎక్కువ విస్తీర్ణం భూమి బీమా పరిధిలోకి రావాలంటే బ్యాంకుల నుంచి పంట రుణాల పంపిణీ కీలకం. పరిహారం చెల్లింపుల్లో జాప్యం ఉండకూడదు. పంట నష్టాలను నిర్ణయించేందుకు అనుసరించే విధానాలూ మరింత హేతుబద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. రకరకాల కారణాలతో రైతులను బీమా సంస్థలు విసిగిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ బీమా పథకం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. గడువు విషయంలోనే మన జిల్లా వాతావరణ పరిస్థితులకు సరిపడం లేదు. ఇతర జిల్లాలో తొందరగా వరి, వేరుశనగ పంటలు వేస్తారు. అక్కడ డిసెంబర్ నాటికి పంటలు సాగు పూర్తయ్యే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో మాత్రం ఇప్పటివరకు పది శాతం పంటలు కూడా సాగు కాలేదు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంటల సాగు పూర్తయ్యే అవకాశం ఉంది. సాగు చేయకుండా రైతులు బీమా చేయడం సాధ్యం కాదు. కావున ఇక్కడి వాతావరణ పరిస్థితుల ప్రకారం ఈ పథకం  గడవు తేదీని మరింత పెంచితే, రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువ మంది రైతులు ప్రయోజనం పొందుతారు.

పో రై గంగ 1 పిఎం ఫసల్‌ బీమా యోజన

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *