గౌరవమూ లేదు వేతనమూ లేదు
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను పట్టించుకోని ప్రభుత్వం
23 నెలలుగా జడ్పిటిసి సభ్యులకు అందని వేతనం
ఎంపిటిసి సభ్యుల, ఎంపిపిల వేతనాలు ఏడాదిగా పెండింగ్
గౌరవ వేతనం కోసం స్థానిక ప్రజా ప్రతినిధుల ఎదురుచూపులు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
ప్రభుత్వం మారడంతో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వీరికి అందాల్చిన గౌరవ వేతనాలు సకాలంలో అందడం లేదు. జడ్పిటిసి సభ్యులకు 23 నెలలుగా, ఎంపిటిసి సభ్యుల, ఎంపిపిల గౌరవ వేతనం సంవత్సరంగా పెండింగ్ లో ఉంది. గౌరవితనం కోసం జిల్లాలోని స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో కూడా పలువురు జడ్పీటీసీ సభ్యులు ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం కూడా అందజేశారు. అయినా, జడ్పిటిసి, ఎంపిటిసి సభ్యులకు గౌరవ వేతనాలను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. నిధుల లేమితో జగన్ ప్రభుత్వం వీరికి గౌరవ వేతనం ఇవ్వలేదు. అత్యధిక భాగం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు వైసిపి పార్టీ వారు కావడంతో కూటమి ప్రభుత్వం సకాలంలో గౌరవ వేతనాన్ని విడుదల చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
చిత్తూరు జిల్లాలో 65 మండల పరిషత్తులు ఉన్నాయి. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క జడ్పిటిసి చొప్పున 65 మంది జడ్పీటీసీలు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు కలిపి 67 మంది జడ్పిటిసిలు అంటున్నారు. అయితే పులిచెర్ల మండలానికి చెందిన మురళీధర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత జిల్లాలో 66 మంది జడ్పిటిసిలు కొనసాగుతున్నారు. వీరికి నెలకు 6000 చొప్పున గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. అయితే వీరికి జనవరి, 2023 వరకు మాత్రమే గౌరవ వేతనాన్ని చెల్లించారు. గత 23 నెలలుగా గౌరవ వేతనం కోసం జడ్పీటీసీ సభ్యులు ఎదురుచూస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ కుఇ నెలకు 40,000 రూపాయలను చెల్లిస్తారు. జిల్లా పరిషత్ చైర్మన్ కు మాత్రం మే నెల 2024 వరకు వేతనాలు చెల్లించారు. చైర్మన్ కు కూడా మరో ఆరు నెలలు గౌరవ వేతనం చెల్లించాలి. జిల్లాలో 877 ఎంపీటీసీ సభ్యులు ఎన్నికయ్యారు. ఇందులో పలువురు మరణించడం, రాజీనామామా చేయడంతో 16 ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం 861 ఎంపీటీసీలు కొనసాగుతున్నారు. వీరికి ప్రభుత్వంనెలకు 3,000 రూపాయల వంతున గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. వీరికి గత సంవత్సరం డిసెంబర్ నెల వరకు మాత్రమే గౌరవ వేతనం అందింది. మళ్లీ డిసెంబర్ నెలవస్తోంది. అంటే గత సంవత్సర కాలంగా వీరికి గౌరవ వేతనం చెల్లించడం లేదు. అలాగే జిల్లాలో 65 మంది మండల పరిషత్ అధ్యక్షులు ఉన్నారు. ఇందులో తిరుపతి రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసిన మోహిత్ రెడ్డికి తిరుపతి ఎమ్మెల్యే టికెట్ రావడంతో, రాజీనామా చేసి, ఎన్నికలలో పోటీ చేశారు. సదం, రామసముద్రం మండలాల ఎంపీపీలు స్వర్గస్తులయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 62 మంది మండల పరిషత్ అధ్యక్షులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు 6,000 గౌరవ వేతనంగా చెల్లించాలి. అయితే, గత సంవత్సరం రోజులుగా వీరికి గౌరవ వేతనం చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు తమకు గౌరవ వేతనం ఎప్పుడు విడుదల అవుతుందంటూ మండల పరిషత్ అధికారులను వాకబు చేస్తున్నారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో భారీ ఎత్తున అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు, ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్నికలలో నిర్వహిస్తోందని తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించింది. దీంతో ఎన్నికల బరిలో వైసీపీ పార్టీ మాత్రమే మిగిలింది. రాష్ట్రంలో 90 శాతం మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైసిపి వారే ఎన్నికయ్యారు. ఇందులో అత్యధిక శాతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసిపి, కూటమి ప్రభుత్వాలు జడ్పిటిసి ఎంపిటిసి సభ్యుల గౌరవ వేతనం విషయం పట్టించుకోవడం లేదు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగకపోవడం ఒక కారణం అయితే, ఈ ఎన్నికలలో ఏకపక్షంగా అత్యధికమంది వైసిపి అభ్యర్థులు గెలవడం మరో కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయం పట్టించుకోలేదు. నవరత్నాల పేరుతో జగన్ ప్రభుత్వం కూడా గౌరవ వేతనం విడుదల చేయలేదు. ప్రభుత్వం మారడంతో మండలాల్లో మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పిటిసి సభ్యులు కార్యాలయాలకు రావడమే తగ్గించేశారు. అభివృద్ధి కార్యక్రమాలు సంబంధిత శాసనసభ్యుల కనుసన్నల్లో నడుస్తున్నాయి. వైసీపీ పాలనలో అభివృద్ధి కార్యక్రమాలకు ఏమాత్రం నిధులు మంజూరు కాలేదు. ప్రస్తుతం నిధులు మంజూరు అవుతున్న, మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పిటిసి సభ్యుల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవడం లేదు. గతంలో జిల్లాలో పంచాయతీ వారోత్సవాలు జరిగాయి. మండలంలో మంజూరైన అభివృద్ధి కార్యక్రమాలకు శాసనసభ్యులు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాలలో కూడా జిల్లా పరిషత్ అధ్యక్షులు, జడ్పిటిసి సభ్యులు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొనడం లేదు. శాసనసభ్యులందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ఎన్నికయ్యారు. అయితే స్థానిక సంస్థల్లో మాత్రం వైసిపి పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. దీంతో పార్టీ విభేదాలు కారణంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం లేదు. తాము ప్రజా ప్రతినిధులం అన్న విషయం చాలా మంది మరచిపోయారు. పైగా గౌరవ వేతనం కూడా సకాలంలో అందడం లేదు. జడ్పిటిసి సభ్యులు మొక్కుబడిగా జిల్లా పరిషత్ సమావేశాలకు స్థాయి సంఘ సమావేశాలకు హాజరవుతున్నారు. అలాగే మండల స్థాయిలో సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ సమావేశానికి వచ్చి సంతకం చేసి వెళ్తున్నారు. మండల పరిషత్ కాదు సమావేశాలలో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఏవి రావడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ అభివృద్ధి కార్యక్రమాలకు ఆమడ దూరంలో ఉన్నారు. వేతనాల విషయమై ఒక జడ్పిటిసి మాట్లాడుతూ.. తాము ఎన్నికైన కొత్తలో గౌరవ వేతనం వచ్చిందని, తరువాత రాలేదన్నారు. గౌరవ వేతనం అనేది ఒకటి ఉన్న విషయాన్ని కూడా మరచిపోయమని ఆవేదన వ్యక్తం చేశారు.
పో రై గంగ 1 జడ్ పి కార్యాలయం