జిల్లాలో మొదలైన సాగునీటి సంఘాల ఎన్నికల హడావిడి
సిద్ధమవుతున్న ఓటర్ల జాబితా
20న ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
21 నుంచి మూడు రోజులపాటు ఎన్నికలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలకు నగారా తొందరలోనే మ్రోగనుంది. ఈనెల 10వ తారీఖు లోపు సాగునీటి సంఘాల ఓటర్ల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా మండల రెవెన్యూ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల 20వ తేదీన జిల్లాలోని సాగునీటి సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. 21వ తారీకు నుంచి మూడు రోజులపాటు జిల్లాలోని 225 సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, ఆరుగురు ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులను ఎన్నుకుంటారు.
తొలుత సాగనీటి సంఘాల ఎన్నికలను అక్టోబర్ నెల 15వ తేదీ నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో తుఫాన్ల కారణంగా భారీ వర్షాలు పడటంతో, ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇరిగేషన్ అధికారులు పాత ఓటర్ల జాబితాను మండల రెవెన్యూ అధికారులకు అందజేశారు. అందులో మార్పులు, చేర్పులు చేసి నూతన జాబితాను రూపొందించి ఈ నెల 10 లోపు తమకు అందజేయాల్సిందిగా కోరారు. జిల్లాలో ప్రస్తుతం సాగనీటి సంఘాల ఓటర్లు జాబితా సవరణ జరుగుతోంది. ఇది దాదాపు పూర్తి అయ్యింది. ఇంక జిల్లాలోని 225 సాగునీటి సంఘాలకు ఎన్నికలే తరువాయి. సాగునీటి సంఘాల ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయి. మొదటి విడతలో నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికల ద్వారా ఆరుగురు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఆరుగురు డైరెక్టర్లలో నుంచి ఓ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడులను ఎన్నుకుంటారు. రెండో విడతలో నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కలిసి డిస్ట్రిబ్యూటరీ కమిటీలను ఎన్నుకుంటారు. మూడో విడతలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు కలిసి జిల్లా ప్రాజెక్టు కమిటీ చైర్మన్, ఉపాధ్యక్షుడు, డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఈ కమిటీల పర్యవేక్షణలో డ్రైయినేజీ వ్యవస్థ, పూడికతీత, తట్టమట్టి తొలగింపు, పంట కాల్వల ఆధునీకరణ వంటి పనులు చేపడతారు. ఇలాంటి కీలకమైన సాగునీటి సంఘాలకు తిరిగి ఎన్నికలు నిర్వహిస్తూ ఉండటంతో రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. సుదీర్ఘ కాలం తర్వాత జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల హడావుడి మొదలైంది. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ సర్కార్ సాగునీటి సంఘాల ఎన్నికల ఊసే ఎత్తలేదు. కూటమి సర్కార్ ప్రస్తుతం నీటి వినియోగదారుల సంఘాలు, పంపిణీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో సందడిగా మారింది. నీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటైతే సాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టే వీలుంటుంది. మరో వైపు ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ ఎన్నికల తర్వాత రాష్ట్ర స్థాయి అపెక్స్ కమిటీకి ప్రాధాన్యం సంతరించుకోనుంది. రైతులకు ఆయకట్టు పరిధిలో సాగునీటి ఇబ్బందులు తొలగించి చివరి భూములకు నీరందించేలా పర్యవేక్షణ చేసేందుకు కాలువల వారీగా సాగునీటి సంఘాలకు శ్రీకారం చుట్టారు. పంట కాలువల, మురుగు కాలువల మరమ్మతులు, రైతుల సమస్యలను నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో 1999లో ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015 లో ఆ సంఘాలను టీడీపీ సర్కార్ పునరుద్ధరించింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 సెప్టెంబర్‌లో సాగునీటి వినియోగదారుల సంఘాలను రద్దు చేసింది. దీంతో ఆ బాధ్యతలను జలవనరుల శాఖ అధికారులే నిర్వహించాల్సి వచ్చింది. సాగునీటి సంఘాలను విస్మరించి పంట కాలువలను వైఎస్సార్సీపీ సర్కార్ నాశనం చేసింది. దీంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సాగునీటి సంఘాల ఎన్నికల కోసం ఉత్తర్వులు జారీ చేసింది. భారీ, మధ్య, చిన్ననీటి పారుదల శాఖలకు సంబంధించిన ప్రాజెక్టుల వారీగా సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఓటర్ల సాగునీటి సంఘాల ఓటర్ల జాబితాను రెడీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం ఉత్తర్వుల నేపథ్యంలో అధికారుల ఓటర్ల జాబితా రూపకల్పన, సవరణపై దృష్టిపెట్టారు. మరోవైపు నవంబర్‌లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణ కోసం ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2015లో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సాగునీటి సంఘాలను పట్టించుకోలేదు. అలాగే 2020లో సాగునీటి సంఘాల వ్యవస్థను రద్దు చేశారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావటంతో సీఎం చంద్రబాబు నాయుడు సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికల నిర్వహణ కోసం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రాదేశిక నియోజకవర్గాలు, సాగునీటి వినియోగదారుల కమిటీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి.