22, నవంబర్ 2024, శుక్రవారం

రబీ సీజన్ లో మందకొడిగా వ్యవసాయ పంటల సాగు

ఖరీఫ్ లో వర్షాభావంతో పూర్తిగా నష్టపోయిన రైతులు

రబీలో మళ్ళి పంటలు వేయాలంటే వెనకడుగు వేస్తున్న వైనం 

జిల్లాలో భారీగా ఉలవల సాగు 

జిల్లాలో భారీగా  తగ్గిన వరి సాగు  

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

ఖరీఫ్ సీజన్ లో  కరువు కాటకాలతో తీవ్రంగా నష్టపోయిన చిత్తూరు జిల్లా రైతులు రబీ సీజన్ లో  పంటల సాగుకు మొగ్గు చూపడం లేదు. సాంప్రదాయ పంటలైన వరి, చెరకు పంటలకు తిలోదకాలు ఇస్తున్నారు. మెట్ట పంటలైన ఉలవల సాగుకు  జిల్లాలోని రైతులు ఉత్సాహం చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల పథకం కింద రాయితీ ధర మీద ఉలవలను రైతులకు సరఫరా చేయడంతో జిల్లాలో భారీగా ఉలవ పంట సాగయింది. జిల్లాలో మిగిలిన పంటల సాగు బడి మందకొడిగా కొనసాగుతోంది. రబీ సీజన్ కు జిల్లా వ్యాప్తంగా 24 వేల హెక్టార్లలో రైతులు వివిధ రకాల పంటలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 9 వేల హెక్టర్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. జిల్లాలో జొన్న, సజ్జలు, కొర్రలు, శనిగలు, కందులు, నువ్వులు, పొద్దు తిరుగుడు, పత్తి పంటల సాగు ఇప్పటివరకు ప్రారంభమే కాలేదు. 

ఖరిఫ్ సీజన్ లో  చిత్తూరు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఋతుపవనాలు, తుఫాన్ సీజన్ లో కూడా జిల్లాలో ఆశించిన స్థాయిలో వానలు పడలేదు.  జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. జనవరి నెలలో 14.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 9.7 మిల్లీమీటర్ల మాత్రం నమోదయింది. ఫిబ్రవరిలో 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా చుక్క వాన కూడా పడలేదు. మార్చి నెలలో 9.4 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా వర్షం జాడే లేదు. ఏప్రిల్ నెలలో 19.5 మిల్లీమీటర్లు వర్షం పడాల్సి ఉందిగా పూర్తిగా వర్షం పడలేదు. మే నెలలో మాత్రం 67.2 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 103.3  మిల్లీమీటర్లు పడింది. జూన్ నెలలో 80.9 పడాల్సి ఉందిగా 188.7 మిల్లీమీటర్లు నమోదయింది. జూలై నెలలో 103.5  పడాల్సి ఉండగా 88.3 మిల్లీమీటర్లు మాత్రం పడింది. ఆగస్టు నెలలో 121.2 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా 136.3 పడింది. సెప్టెంబర్ నెలలో 153.1 మిల్లి మీటర్లు పడాల్సి ఉండగా కేవలం15.3 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. ఇలా జిల్లాలో వర్షపాతం తగ్గడంతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి. పశువులకు నీళ్లు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ ఖరీఫ్ కు  జిల్లాలో 1.50 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు కావలసి ఉండగా 60 వేల హేక్టర్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఖరీఫ్ సీజన్ లో  ప్రధానంగా వేరుశనగ పంట జిల్లాలో సాగవుతుంది. చిత్తూరు జిల్లాలో వేరుశనగ సాగు చేసిన తర్వాత  నెల రోజులు పాటు వర్షాలు సక్రమంగా పడ్డాయి. కాయలు ఏర్పడే దశ నుంచి జిల్లాలో వర్షాలు పూర్తిగా పడలేదు. రెండు నెలలు పూర్తిగా వర్షం పడకపోవడంతో  జిల్లాలో 60 వేల ఎకరాల్లో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతింది. రైతులకు పెట్టుబడి కూడా చేతికి అందలేదు. జిల్లాలో ఖరీఫ్ లో వేరుశనగ తో పాటు కందులు, ఉలవలు, అలసందలు, రాగులు, జొన్నలు, మొక్కజొన్నలు వంటి మెట్ట పంటలను పండిస్తారు. వర్షాభావం  కారణంగా జిల్లాలో వరి తప్ప మిగిలిన పంటలు అన్నీ ఎండిపోయాయి. వరిని మాత్రం బావులు, బోర్ల కింద పండిస్తారు. మిగిలిన పంటలు మెట్టపంటలుగా సాగవుతాయి. ఇవి పూర్తిగా వర్షాధారం మీద ఆధారపడి పండుతాయి. ఖరిఫ్ లో వర్షాలు భారీగా తగ్గడంతో జిల్లాలో వేరుశనగ తో పాటు కందులు, ఉలవలు, అలసందలు, అనపగింజలు, రాగి జొన్న, సజ్జలు వంటి పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని రైతులకు అపారమైన నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా కరవు పరిస్థితులు విలయ తాండవం చేయడంతో  రాష్ట్ర ప్రభుత్వం 6 మండలాలను కరవు  మండలాలుగా ప్రకటించింది. ఖరిఫ్ సీజన్ లో భారీగా నష్టపోయిన రైతులు రబీ సీజన్ కు పంటకు వేయడానికి ముందుకు రావడం లేదు. జిల్లాలో మందకొడిగా రబీ పంటలు సాగు అవుతున్నాయి.ఈ రబీ సీజన్ కు జిల్లా వ్యాప్తంగా 24 వేల హెక్టార్లలో రైతులు వివిధ రకాల పంటలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 9 వేల  హెక్టర్లలో మాత్రమే పంటలు సాగయినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. జిల్లాలో 11వేల హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 550 హెక్టార్లలో మాత్రమే వరి సాగు అయింది. ఉలవలు 7,500 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా, సుమారుగా 7 వేల హెక్టార్లలో సాగయింది. మినుములు 560 హెక్టార్లలో సాగు కావలసి ఉండగా, 140 హెక్టార్లలో సాగయ్యింది. వేరుశనగ 3 వేల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 100 హెక్టార్లలో కూడా  సాగు కాలేదు. జిల్లాలో జొన్న, సజ్జలు, కొర్రలు, శనిగలు, కందులు, నువ్వులు, పొద్దు తిరుగుడు, పత్తి పంటల సాగు ఇప్పటివరకు ప్రారంభమే కాలేదు. మొక్కజొన్న 500 హెక్టార్లకు కాను 100 యాక్టర్లలో సాగయింది. రాగి 500 హెక్టార్లకు  కేవలం ఆరు హెక్టార్లలో మాత్రమే వేశారు. పెసర 85 హెక్టార్లలో గాను 10 హెక్టర్లలో, మినుములు 600 హెక్టార్లకు కాను 150 హెక్టార్లలో, అలసందులు 70 హెక్టార్లకు కాను 15 హెక్టార్లలో,  అనువులు 25 ఎకరాలకు కాను ఏడు హెక్టార్లలో సాగయ్యాయి. ఇవి కాకుండా పశుగ్రాసం 1300 హెక్టార్లలో సాగు అయ్యింది. ఖరిఫ్ లో భారీగా దెబ్బ తిన్న రైతులు రబీలో పంటలు వేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. 

పో రై గంగ 1 ఉలవ పంట 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *