రోడ్ల మీద గుంతలకు మోక్షం వచ్చిందోచ్ !
ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి
కాంట్రాక్టర్లకు పనులు అప్పగింత
డిసెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు
సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు సిద్దం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు తీవ్ర నిర్లక్ష్యం చేసిన రహదారులకు మరమ్మతు పనులు చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ‘మిషన్ ఫర్ పాట్‌హోల్ ఫ్రీ రోడ్స్’ పథకం కింద ఆర్‌అండ్‌బీ రోడ్లపై గుంతలను కప్పేందుకు జిల్లాకు రూ6.5 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో 1200 కిలోమీటర్ల రోడ్డుకు మరమ్మత్తులు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇటివల చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కొంగారెడ్డిపల్లిలో జిల్లా కలెక్టర్ లాంచనంగా ప్రారంభించారు.
వైసీపీ పాలనలో రహదారుల నిర్వహణ, అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఐదేళ్ల కాలంలో రోడ్లపై పడిన గుంతలను పూడ్చలేని పరిస్థితి నెలకొంది. దీంతో రహదారులన్నీ గోతుల మయంగా మారాయి. వర్షం కురిస్తే నీరు చేరి పంట కుంటలను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే పరిస్థితి అత్యంత దారుణంగా తయారై రోడ్డు ఎక్కడుందా అని వాహన చోదకులు వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. అధ్వానంగా వున్న రోడ్ల కారణంగా ప్రమాదాలు సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది క్షతగాత్రులయ్యారు. రహదారులకు మోక్షం లేదా? అని జనం అనుకుంటున్న తరుణంలో ఎన్నికలు జరిగి, కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధ్వాన రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తున్నది. ‘మిషన్ ఫర్ పాట్‌హోల్ ఫ్రీ రోడ్స్’ కింద తొలుత రహదారులపై గుంతలు పూడ్చాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల పరవాడ మండలం వెన్నెలపాలెంలో రోడ్డు మరమ్మతు పనులను ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘మిషన్ ఫర్ పాట్‌హోల్-ఫ్రీ రోడ్స్’ కింద జిల్లాలో రోడ్ల నిర్వహణ పనుల కోసం ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. జిల్లాలో 2,430 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్లు ఉన్నాయి. వివిధ మార్గాల్లో సుమారు 1200 రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రధాన రహదారుల్లో సైతం రోడ్లు అత్యంత దయనీయంగా తయారయ్యాయి. జాతీయ రహదారుల్లో కూడా రోడ్డు పూర్తిగా పాడయ్యాయి. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ రోడ్లపై ప్రయాణించే వారు నానాఅవస్థలు పడుతున్నారు. ఇటువంటి ప్రధాన రోడ్లపై ఏర్పడిన గోతులను పూడ్చడానికి అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘మిషన్ ఫర్ పాట్‌హోల్ ఫ్రీ రోడ్స్’ పథకంలో భాగంగా ఆర్ అండ్ బీ రోడ్లపై పడిన భారీ గుంతలను కప్పించే పనులకు శ్రీకారం చుట్టారు. తొలి దశ పనుల కోసం రూ.6.5 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. ఒక్కో రోడ్డుకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలు వరకు నిధులు మంజూరు చేసి, గోతులు పూడ్చడమే కాకుండా అవసరం మేరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఆర్ అండ్ బీ అధికారులు 130 పనులకు టెండర్లు పిలిచారు. పనులను డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలనీ షరతు పెట్టారు. తొందర్లనే పనులు ప్రారంభం కానున్నాయి. సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు మీద ప్రజలు ప్రయాణం చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం, ఆర్ అండ్ బీ ఇఇ శ్రీనివాసులు చర్యలు తీసుకుంటున్నారు.