24, నవంబర్ 2024, ఆదివారం

సంచార జాతుల సర్వేను పట్టించుకోని ఎం పి డి ఓ లు

జిల్లాలో మొక్కుబడిగా సాగుతున్న సర్వే 

5-10 పేర్లతో సరిపెడుతున్న మండల అధికారులు 

తమ మండలంలో లేరని తప్పుడు నివేదికలు 

అధికారుల అలసత్వంతో నష్టపోతున్న అభాగ్యులు   

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలుచేస్తున్న సంచార జాతుల ఆర్థిక సాధికారత పథకం (సీడ్) సర్వేను జిల్లాలోని ఎక్కువ మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పట్టించుకోవడం లేదు. ఏదో ముక్కబడిగా మండలంలో అయిదు, పది పేర్లు నమోదు చేస్తున్నారు. మరికొందరు తమ మండలంలో అలాంటి వారు ఎవరూ లేరని తప్పుడు నివేదికలను జిల్లా యంత్రాంగానికి సమర్పిస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సంచార జాతులు అభివృద్ధికి మరింత దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సంచార జాతుల వివరాలు నమోదు చేయాల్సిందిగా బీసీ సంక్షేమ శాఖ అధికారులు చేస్తున్న విజ్ఞప్తిని కొందరు మండల పరిషత్ అధికారులు పెడచెవిన పెడుతున్నారు. జిల్లా కలెక్టర్  4వ తేదిన అందరు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు  ఆదేశాలు జారీ చేసినా, పలువురు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 

కుల వత్తి లేని సంచార జాతులను వెనుకబడిన కులాలలో  ఏ గ్రూపులో చేర్చారు. ఇందులో ఎక్కువ కులాల వృత్తి బిక్షటన. వీరు సంచార జీవులు. 2016 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన జాబితా ఏ గ్రూపులోని అత్యంత  వెనుకబడిన 32 కులాలను గుర్తించింది. బాలసంతు, బహురూపి, బండార,  బుడబుక్కల,  దాసరి,  దొమ్మర,  గంగిరెడ్లవారు, జంగం,  జోగి,  కాటిపాపల, కోర్చ,  మొండివారు, బండ, మొండిబండ,  పిచ్చిగుంట్ల, వంశీరాజ్,  పాముల,  పార్థి  (నీర్షికారి),  పంబల,  దమ్మలి, దమ్మల, దమ్ముల, దమల, పెద్దమ్మవాండ్ల, దేవరవాండ్లు, ఎల్లమ్మవాండ్లు, ముత్యాలమ్మవాండ్లు, వీరముష్టి, నెత్తికోతల, వీరబద్రియ,  గుడాల,  కుజరభట్ట, కోష్మారే, రెడ్డిక,  మొండిపట్ట,  నొక్కార్,  పరికిముగ్గుల,  యాత,  చోపెమరి,  కైకాడి,  జోషినందివలాస్,  మందుల,  కోనపులి,  పట్ర,  రాజన్నల, రాజన్నలు,  కాసికాపడి, కాసికాపుడిలను అత్యంత వెనుకబడిన కులాలుగా నిర్ణయించింది. వీరి అభివృద్ధి కోసం అత్యంత వెనుకబడిన కులాల కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా ఎంబిసిల అభివృద్ధికి నిధులను వ్యయం చేయాలని నిర్ణయం తీసుకుంది. గత తెలుగుదేశం ప్రభుత్వం 100 కోట్ల రూపాయల నిధులను ఈ కార్పోరేషన్ కు కేటాయించింది. కుటుంబాలకు 30,000 రూపాయల వంతున  ఆర్థిక సహాయం కూడా అందజేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఎంబీసీ కార్పొరేషన్ నిర్వీర్యమైంది. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయము, సాధికారత మంత్రిత్వ  శాఖ ఆధ్వర్యంలో సంచార, అర్థ సంచార జాతుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ద్వారా 2001- 22 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల లోపు సంచార జాతులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన తరగతులుగా గుర్తించిన 32 కులాలను సంచార జాతులుగా ప్రభుత్వం ఇటివల నోటిఫై చేసింది. వీరికి విద్యా సాధికారత, ఆరోగ్యం, జీవనోపాధి, భూమి, ఇల్లు సౌకర్యాలను కలుగజేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ పథకం కింద సంచార జాతుల విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించాలని, పోటి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోచింగ్ ఫీజులను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. సంచార జాతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల వంతున ఆరోగ్య భీమా కల్పించాలని నిర్ణయించింది. కమ్యూనిటీ స్థాయిలో జీవనోపాధిని పెంచడానికి  గ్రూపులను ఏర్పాటు చేసి, వాటిని బలోపేతం చేయాలని భావించింది. ఇళ్ళ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేయాలని, సంచార జాతుల గ్రూపులను ఏర్పాటు చేసి వాటి ద్వారా వ్యాపార నిమిత్తం రుణాలను అందజేసి కుటుంబ తలసరి ఆదాయాన్ని పెంచాలని నిర్ణయించింది. సంచార  జాతుల విద్యార్థులు కోచింగ్ తీసుకుంటే స్థానిక విద్యార్థులకు  1500 రూపాయలు, బయట విద్యార్థులకు 3,000 రూపాయలు వంతెన స్టైఫండ్ ను కోర్సు ముగిసే వరకు లేదా ఒక సంవత్సరం వరకు చెల్లిస్తారు. వారికీ కోచింగ్ ఫీజు కింద సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా యు పి ఎస్ సి, ఎస్ పి ఎస్ సి కోచింగ్ కు 1.20 లక్షలు, ఎస్ ఎస్ సి, ఆర్ ఆర్ బి కోచింగ్ కు 40,000, బ్యాంకింగ్ / బీమా కోచింగ్ కు 50,000, జె ఇఇ, ఎన్ ఇ ఇ టి కి 1.20లక్షలు, ఐ ఇ ఎస్ కు 80,000, కాట్, చ్మాట్ కు 60,000, జీ ఆర్ ఇ, గ్మాట్, తోఫెల్, సత్ కు 35,000, సి ఏ, చప్ట్, గేట్ కోచింగ్ కు 75,000, కో పి ఎల్ కోర్సులు 30,000, ఎన్ డి ఏ, సి డి ఎస్ కోర్స్ కోచింగ్ లకు 20,000 లను ప్రభుత్వమే భరిస్తుంది. 40 శాతం అంగవైకల్యం కలిగిన వారికి విద్యార్థులకు నెలకు 2000 రూపాయల వంతున ఉపకార వేతనాన్ని అదనంగా అందజేస్తారు. సంచార జాతులను నమోదు చేయడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైటును రూపొందించింది. అందులో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. చిత్తూరు జిల్లాలో జంగమ,  దాసరి, దొమ్మర, జోగి, పంబల, వంశీరాజ్, మొండిబండ, గంగిరెద్దుల, వీరభద్రీయ తదితర సంచార జాతులు ఉన్నారు. వీరిలో పలువురికి ఆధార్ కార్డు గాని, రేషన్ కార్డు కూడా లేదు. దమనీయ స్థితిలో తన జీవితాలను గడుపుతున్నారు. మండల పరిషత్ అభివృద్ధి  అధికారులు వీరందరినీ గుర్తించి, వారిని నమోదు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని సంచార జాతులు నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పో రై గంగ 1 జంగం దేవర్లు  

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *