29, డిసెంబర్ 2025, సోమవారం

చరిత్రలో మొదటిసారి రోడ్డుకెక్కిన మామిడి రైతులు

మామిడి మద్దతు ధర హామీలకే పరిమితం 
కిలోకు 4 నుంచి 5 రూపాయలు చెల్లిస్తున్న ఫ్యాక్టరీలు 
తొలుత కాయలు తీసుకోవాలని, ఇప్పుడు బిల్లుల చెల్లించాలని రైతుల ఆందోళన 
 రోడ్డుమీద మామిడికాయలు పారబోసి నిరసనలు
మద్దతు ధర కోసం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు 
కలెక్టరేట్ ముట్టడించిన కానరాని కరుణ 
రైతులకు కష్టాలు కన్నీళ్లు మిగిల్చిన 2025

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చిత్తూరు జిల్లా అంటేనే ఉద్యానవన సాగుకు చిరునామా. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా మామిడి సాగుకు కేంద్ర బిందువుగా పేరొందిన జిల్లా ఇది. అవిభక్త చిత్తూరు జిల్లాలో దాదాపు 97 వేల హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోంది. లక్షలాది కుటుంబాలకు ఇదే జీవనాధారం. ముఖ్యంగా తోతాపురి రకం మామిడి సాగులో ఈ ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆసియాలోనే అతిపెద్ద మామిడి పల్ప్ తయారీ కేంద్రాలుగా పేరొందిన పరిశ్రమలు చిత్తూరులో ఉన్నాయి. కానీ 2025 సంవత్సరం మాత్రం మామిడి రైతులకు శాపంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులు రోడ్డెక్కారు. కళ్లలో నీళ్లు, చేతుల్లో అప్పుల పత్రాలు, గుండెల్లో ఆవేదనతో మామిడి రైతులు ఈ ఏడాది తమ బాధను రాష్ట్రానికి చాటారు.

ఒకప్పుడు మామిడి తోటల్లో పండిన కాయలు రైతుల ఇంట్లో పండుగను తెచ్చేవి. ఇప్పుడు అదే మామిడి రైతుల జీవితాల్లో కన్నీళ్లను నింపుతోంది. గత సీజన్‌లో టన్నుకు ముప్పై వేల రూపాయల వరకు పలికిన మామిడి ధర, ఈ సీజన్‌లో నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు పడిపోవడం రైతు నడుము విరిచింది. కిలోకు నాలుగు నుంచి ఐదు రూపాయలు మాత్రమే ధర రావడం కోత ఖర్చుకూ సరిపోని పరిస్థితి. అయితే పెట్టుబడులు మాత్రం తగ్గలేదు. ఎరువులు, పురుగుమందులు, నీటి ఖర్చులు, కూలీల వేతనాలు కలిపి ఒక్కో రైతు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశాడు. చివరకు చేతికి మిగిలింది అప్పులే. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం మార్కెటింగ్ వ్యవస్థ పూర్తిగా రైతు వ్యతిరేకంగా మారడమే. చిత్తూరులో ఎక్కువగా పండే తోతాపురి మామిడి ప్రధానంగా పల్ప్ తయారీకి మాత్రమే ఉపయోగపడుతుంది. దీంతో రైతులు పల్ప్ ఫ్యాక్టరీలపై పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది ఆ ఫ్యాక్టరీలే రైతుల పాలిట అగ్నిపరీక్షగా మారాయి. గత సీజన్‌ నుంచి రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మెట్రిక్ టన్నుల మామిడి పల్ప్ నిల్వలు పేరుకుపోవడంతో ఫ్యాక్టరీ యజమానులు ఈ సీజన్‌లో మామిడి కొనుగోలుకు వెనుకంజ వేశారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం కారణంగా ఎగుమతులు నిలిచిపోవడం ఫ్యాక్టరీల సాకుగా మారింది. ఫలితంగా చిత్తూరులోని ఇరవై ఏడు పల్ప్ ఫ్యాక్టరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేదు. భారీ దిగుబడి ఉన్నప్పటికీ రోజుకు సగటున ఏడు మెట్రిక్ టన్నుల మామిడిని మాత్రమే ప్రాసెస్ చేశాయి.

ఈ పరిస్థితుల్లో రైతుల ఆందోళనలు తీవ్రతరం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి మామిడికి కిలోకు పన్నెండు రూపాయల కనీస మద్దతు ధరను ప్రకటించింది. ఇందులో ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీలు చెల్లించాలి, మిగిలిన నాలుగు రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన రైతుల్లో కొంత ఆశను రేకెత్తించింది. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. ప్రభుత్వ ఆదేశాలు మార్కెట్‌లో అమలు కాలేదు. ఫ్యాక్టరీ యజమానులు, వ్యాపారులు కలిసి సిండికేట్‌గా మారి కిలోకు నాలుగు నుంచి ఐదు రూపాయలే ఇస్తామని స్పష్టం చేశారు. రైతులు తమ కాయలను ఫ్యాక్టరీ గేట్ల వద్దకు తీసుకొచ్చాక ధర తగ్గించి బలవంతంగా అమ్ముకునేలా చేశారు. టోకెన్లను తమ బంధుమిత్రులకు, అనుకూల వర్గాలకు మాత్రమే కేటాయించడంతో చిన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు దీనిని పగటిపూట జరిగే దోపిడీగా అభివర్ణించారు. మద్దతు ధర కాగితాలకే పరిమితమైందన్న భావన రైతుల్లో బలంగా ఏర్పడింది. ఫ్యాక్టరీలు మామిడి కాయలను తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. తోటల్లో పండిన కాయలు పండిపోయి నేలరాలుతున్నాయి. కొందరు రైతులు వాటిని ట్రాక్టర్లలో తీసుకెళ్లి రోడ్లపై పారబోసి నిరసన తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మామిడి రైతులు ఫ్యాక్టరీల ఎదుట, మార్కెట్ యార్డుల్లో, కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనలకు దిగారు. ఈ ఏడాది జిల్లాలో ఐదు లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని ఉద్యానవన శాఖ అంచనా వేసినా, ఫ్యాక్టరీల ర్యాంపులకు చేరింది కేవలం మూడున్నర లక్షల టన్నులే. మిగిలిన కాయలు తోటల్లోనే పండిపోయి నాశనమయ్యాయి.

ఈ సంక్షోభంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. కుప్పం పర్యటనలో పల్ప్ ఫ్యాక్టరీ యజమానులతో ప్రత్యేకంగా సమావేశమై రైతుల బిల్లులు వెంటనే చెల్లించాలని సూచించారు. ప్రభుత్వం తన వంతుగా రైతుల ఖాతాల్లో నాలుగు రూపాయల సబ్సిడీని జమ చేసింది. అయినప్పటికీ ఫ్యాక్టరీలు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేదు. దీంతో రైతులు మరోసారి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనలకు దిగారు. నియోజకవర్గాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇదే సమయంలో మామిడి రైతుల దమనీయ పరిస్థితిని చూసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వచ్చారు. రైతుల ఆవేదనను విని, మామిడికాయలను రోడ్లపై పోసి ట్రాక్టర్లతో తొక్కడం ద్వారా రైతులు తమ నిరసనను మరింత తీవ్రంగా వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎవరు మాట్లాడినా రైతుకు మాత్రం న్యాయం ఆగలేదు.

మార్కెట్ సంక్షోభానికి తోడు ప్రకృతి కూడా రైతుకు ప్రతికూలంగా మారింది. ఈశాన్య రుతుపవనాల సమయంలో సాధారణం కంటే డెబ్బై నాలుగు శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఆపై ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల పూత ఆలస్యమై, వచ్చిన పూత, పిందెలు వాడిపోయి రాలిపోయాయి. సాధారణంగా రెండు లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉండాల్సిన చోట ఈసారి నలభై శాతం తగ్గుదల నమోదైంది. అంతేకాదు ఆకు ముడత, బూడిద తెగులు, కాయకుళ్లు తెగుళ్లు పంట నాణ్యతను తీవ్రంగా దెబ్బతీశాయి. దిగుబడి తగ్గడంతో రైతులు భయంతో పురుగుమందుల దుకాణాల చుట్టూ తిరిగారు. దుకాణదారుల సలహా మేరకు విచక్షణారహితంగా రసాయనాలను పిచికారీ చేశారు. కొందరు రైతులు తమ పెట్టుబడిలో అధిక భాగాన్ని రసాయనాలకే ఖర్చు చేసినా, చివరకు ఇరవై శాతం పంట కూడా రాలేదని వాపోతున్నారు. ఈ అధిక రసాయన వినియోగం వల్ల ఎగుమతి అవకాశాలు కూడా దెబ్బతింటున్నాయి.

ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇస్తామన్నా, దానికి ఉన్న కఠిన నిబంధనలు రైతులను నిరాశకు గురిచేస్తున్నాయి. ఒక హెక్టారుకు ఇరవై వేల రూపాయల పరిహారం పొందాలంటే కనీసం ముప్పై మూడు శాతం నష్టం జరగాలి. అంతేకాదు చెట్లు పూర్తిగా విరిగిపోవాలి, కాండాలు తెగిపోవాలనే నిబంధనలతో పూత నష్టపోయిన వేలాది చిన్న రైతులు పరిహారానికి దూరమవుతున్నారు. ఈ మొత్తం పరిస్థితి మామిడి రైతులను ఏడాది పొడవునా అప్పుల చక్రంలో బంధిస్తోంది. పంట ప్రారంభంలో పెట్టుబడి కోసం అప్పులు, సీజన్ చివర్లో ధర లేక నష్టం, బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం, తదుపరి సీజన్‌కు మళ్లీ అప్పులు. ఈ చక్రం నుంచి బయటపడే దారి రైతుకు కనిపించడం లేదు. తాత్కాలికంగా ఇచ్చే సబ్సిడీలు కొంత ఊరటనిస్తాయి గానీ శాశ్వత పరిష్కారం కావు.

రైతులు కోరేది స్పష్టంగా ఒక్కటే. మద్దతు ధరను కాగితాలకే పరిమితం చేయకుండా చట్టబద్ధంగా అమలు చేయాలి. మార్కెట్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి. మామిడి ఉత్పత్తి, నాణ్యత నియంత్రణ, మార్కెటింగ్‌ను సమన్వయం చేసే ప్రత్యేక మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ప్రత్యక్ష విక్రయానికి మౌలిక సదుపాయాలు కల్పించాలి. విలువ జోడింపు పరిశ్రమలను గ్రామ స్థాయికి తీసుకురావాలి. ప్రకృతి విపత్తుల పరిహార నిబంధనలను సవరించి నిజంగా నష్టపోయిన రైతుకు సహాయం అందాలి. ఇవి అమలు కాకపోతే చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు క్రమంగా వెలవెలబోతాయి. ఒకప్పుడు పండుగను తీసుకొచ్చిన మామిడి, రైతు జీవితంలో శాశ్వత వేదనగా మిగిలిపోతుంది. ఇదే 2025లో చిత్తూరు మామిడి రైతు ఎదుర్కొంటున్న దారుణమైన నిజం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *