20, డిసెంబర్ 2025, శనివారం

ఖరీఫ్ లో రావాల్సిన ఉలవలు రబీ సీజన్ కు వచ్చాయి !

4,843 క్వింటాళ్ల ఉలవలు అడిగితే, 1,880 క్వింటాళ్ల రాక 

వర్షాకాలం గడిచిన తర్వాత జిల్లాకు చేరిన ఉలవలు 

మూడు నియోజకవర్గాలకు  మాత్రమే ఉలవల పంపిణి 

నాలుగు నియోజకవర్గాలకు రిక్త హస్తం 

విమర్శల పాలవుతున్న ప్రభుత్వం చర్య

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)  


వర్షాభావ పరిస్థితులు, ప్రణాళికల వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం… ఈ మూడింటి మధ్య నలిగిపోయిన చిత్తూరు జిల్లా రైతుకు ఈ ఖరీఫ్ సీజన్‌లో  నిరాశ మాత్రమే మిగిలింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు గాను సాగు కావాల్సిన భూముల్లో కేవలం 7.8 శాతం మాత్రమే పంటలు సాగు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. జిల్లాలో ఈ ఖరీఫ్‌కు మొత్తం 63,147 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా 4,918 హెక్టార్లలో మాత్రమే సాగు జరిగింది. మిగిలిన భూములన్నీ బీడు భూములుగా మిగిలిపోయాయి. ఈ పరిస్థితులను అధిగమించడానికి వేరుశనగకు ప్రత్యామ్నాయంగా జిల్లాలో ఉలవల పంట వేయాలి వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించారు. జిల్లాకు 4,843 క్వింటాళ్ల ఉలవ విత్తనాలు అవసరమని ఈ విత్తనాలు ఆగస్టు నెల లోపు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఖరీఫ్ సీజన్ పూర్తయి, రబీ సీజన్ ప్రారంభమైన తర్వాత తాపీగా చిత్తూరు జిల్లాకు 18 80 క్వింటాళ్ల ఉలవలు అందాయి. వర్షాకాలం పోయిన తర్వాత జిల్లాకు చేరిన ఉలవ విత్తనాలను ఏం చేసుకోవాలో జిల్లా అధికారులకు సైతం పాలుపోలేదు. జిల్లాలో మూడు నియోజకవర్గాలకు మాత్రమే ఉలవలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. మిగిలిన నాలుగు నియోజకవర్గాల ప్రజలు తాము ఏమి పాపం చేశామని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. 


ఖరీఫ్ సీజన్‌లో జిల్లా రైతులు ప్రధానంగా వేరుశెనగ పంటను సాగు చేస్తారు. ఈ ఏడాది 35,238 హెక్టార్లలో వేరుశెనగ సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,475 హెక్టార్లలో మాత్రమే సాగు జరిగింది. పూత దశలో ఉండాల్సిన పంట, విత్తనే వేయలేని పరిస్థితి నెలకొంది. జూన్‌లో మొదలవాల్సిన ఖరీఫ్, ఆగస్టు దాటినా ముందుకు కదలలేదు. వరి, రాగులు, పప్పుధాన్యాలు వంటి ఇతర పంటల పరిస్థితి కూడా ఇదే. మొత్తం ఆహార ధాన్యాలు 20,397 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా1,192 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. పప్పు ధాన్యాలు 5,467 హెక్టార్లకు గాను కేవలం 65 హెక్టార్లకే పరిమితమయ్యాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ అధికారులు వేరుశెనగకు బదులుగా ఉలవలను ప్రత్యామ్నాయ పంటగా వేయవచ్చని రైతులకు సూచించారు. ఉలవలు ఆగస్టు 31లోపు వేస్తేనే పంట వస్తుందని, ఆ తర్వాత వేస్తే ప్రయోజనం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఇందుకు 19,446 హెక్టార్లలో సాగు చేయడానికి 4,843 క్వింటాళ్ల ఉలవ విత్తనాలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపారు. కానీ వాస్తవంలో జిల్లాకు ఒక క్వింటాలు కూడా సకాలంలో చేరలేదు. వర్షాలు ఉన్న సమయంలో విత్తనాలు లేక రైతులు చేతులెత్తేశారు. వర్షాలు తగ్గిన తర్వాత, పుణ్యకాలం పూర్తిగా గడిచాక, రబీ సీజన్ మొదలైన నాలుగు నెలల తర్వాత మాత్రమే జిల్లాకు 1,880 క్వింటాళ్ల ఉలవలు చేరాయి. అడిగిన పరిమాణంలో సగం కూడా సరఫరా కాలేదు.

వర్షాకాలం పోయాక విత్తనాలెందుకు?

సెప్టెంబర్ తర్వాత ఉలవలు చల్లితే పంట వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. వర్షాకాలం ముగిసిపోయింది. నేలలో తేమ లేదు. ఇప్పుడు ఉలవలు చల్లినా మొలకెత్తే పరిస్థితి కూడా లేదని వ్యవసాయ శాఖ అధికారులే ఒప్పుకుంటున్నారు. అయినా సరే, ఖరీఫ్‌కు రావాల్సిన ఉలవలను రబీ సీజన్‌లో, అదీ ఆలస్యంగా పంపడం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. రైతుల మాటల్లో చెప్పాలంటే  విత్తడానికి కాదు… వంటింటికి పనికొచ్చే సరుకుగా మారింది. మరోవైపు ఉలవల పంపిణీ విషయంలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు వచ్చిన ఉలవలను కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాలకు మాత్రమే సరఫరా చేయాలని నిర్ణయించారు. చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాలను పూర్తిగా పక్కన పెట్టడం రైతాంగంలో ఆగ్రహాన్ని రేపుతోంది. మార్కెట్‌లో కిలో ఉలవ ధర రూ.56 ఉండగా, రాయితీపై 80 శాతం సబ్సిడిగా ఇస్తామని చెప్పినా, విత్తే సమయం గడిచిపోయిన తర్వాత ఆ రాయితీకి అర్థమే లేకుండా పోయింది.

రెండిటికీ చెడ్డ రేవడిలా రైతు

మొత్తానికి వర్షాలు పడే సమయంలో విత్తనాలు లేవు… వర్షాలు పోయాక విత్తనాలు వచ్చాయి. ఈ వ్యవస్థాగత నిర్లక్ష్యంతో చిత్తూరు జిల్లా రైతు రెండిటికీ చెడ్డ రేవడిలా మారాడు. ఖరీఫ్ పూర్తిగా దెబ్బతింది. ప్రత్యామ్నాయ పంటల నినాదం కాగితాలకే పరిమితమైంది. సకాలంలో విత్తనాలు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని వచ్చే సీజన్‌కైనా ముందస్తు ప్రణాళికతో రైతును ఆదుకోవాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *