28, డిసెంబర్ 2025, ఆదివారం

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా చిత్తూరు జిల్లాలో భారీ మార్పులు

మదనపల్లి జిల్లాలో కలవనున్న పుంగనూరు నియోజకవర్గం

తిరుపతి జిల్లాలో కలవాలన్న నగరిలోని మూడు మండలాలు 

ఏడు నియోజకవర్గాల నుంచి ఐదుకు తగ్గనున్న చిత్తూరు జిల్లా 

చిత్తూరు డివిజన్లోకి బంగారు పాల్యం మండలం 

మదనపల్లి డివిజన్లోకి చౌడేపల్లి, పుంగనూరు మండలాలు 

పీలేరు రెవెన్యూ డివిజన్ లోకి సదం, సోమల మండలాలు

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు

 జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా చిత్తూరు భౌగోళిక పరిస్థితులు పూర్తిగా మారనున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి మొత్తం తొమ్మిది మండలాలు ఇతర జిల్లాల్లో విలీనమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ మార్పుల్లో ఆరు మండలాలు మదనపల్లి కేంద్రంగా ఏర్పడనున్న కొత్త జిల్లాలోకి వెళ్లనుండగా, మరో మూడు మండలాలు తిరుపతి జిల్లాలో కలవనున్నాయి. ఈ నిర్ణయాలతో చిత్తూరు జిల్లా పరిపాలనా హద్దులు గణనీయంగా మారిపోనున్నాయి. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఉండగా భవిష్యత్తులో ఐదు నియోజకవర్గాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రజలకు జిల్లా కేంద్రాల దూరం తగ్గడం, పరిపాలనా వ్యవహారాలు సులభతరం కావడం లక్ష్యంగా ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.

ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని చౌడేపల్లి, పులిచర్ల, పుంగనూరు, రొంపిచర్ల, సదుం, సోమల మండలాలను మదనపల్లి కేంద్రంగా ఏర్పడనున్న కొత్త జిల్లాలో కలపనున్నారు. ఇప్పటివరకు జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త జిల్లాతో పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు పరిపాలనా కార్యాలయాలు చేరువ కానుండటంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కానున్నాయని అంచనా వేస్తున్నారు. పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో కూడా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. పలమనేరు డివిజన్‌లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్‌కు మార్చనున్నారు. అలాగే పలమనేరు రెవెన్యూ డివిజన్‌లో ఉన్న చౌడేపల్లి, పుంగనూరును మదనపల్లి రెవెన్యూ డివిజన్‌కు మార్పు చేయనున్నారు. ఇదే విధంగా పలమనేరు డివిజన్‌లోని సదుం, సోమల మండలాలను మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్‌కు బదిలీ చేయనున్నారు. భౌగోళిక సౌలభ్యం, ప్రజల అవసరాలు, పరిపాలనా సమన్వయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసినట్టు అధికారులు వివరిస్తున్నారు.

నగరి నియోజకవర్గంలోనూ కీలక మార్పులు అమలుకానున్నాయి. ప్రస్తుతం నగరి నియోజకవర్గంలోని నగరి, నిండ్ర, విజయపురం మండలాలు చిత్తూరు జిల్లా పరిధిలో ఉండగా, పుత్తూరు, వడమాలపేట మండలాలు తిరుపతి జిల్లాలో ఉన్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నగరి నియోజకవర్గంలోని అన్ని మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే నియోజకవర్గం రెండు జిల్లాల్లో ఉండటంతో ప్రజలు ఎదుర్కొంటున్న పరిపాలనా గందరగోళానికి ఈ నిర్ణయంతో పూర్తిస్థాయి పరిష్కారం లభించనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

మొత్తంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో చిత్తూరు జిల్లా నుంచి తొమ్మిది మండలాలు బయటకు వెళ్లనుండటం జిల్లా రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ఏర్పడనున్న మదనపల్లి జిల్లా, విస్తరించనున్న తిరుపతి జిల్లా నేపథ్యంలో చిత్తూరు జిల్లా పరిమాణం తగ్గనున్నప్పటికీ, పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలను సమీప కేంద్రాలకు అనుసంధానం చేయడమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనపై స్వల్ప మార్పులతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత నెల 27న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయగా, కొత్తగా మూడు జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా వివిధ మార్పులను ప్రతిపాదించింది. ఈ నోటిఫికేషన్‌పై నెల రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను స్వీకరించగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు అందాయి.

ఈ అభ్యంతరాలు, సూచనలపై శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పరిపాలనా సౌలభ్యం దృష్టిలో పెట్టుకుని మార్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లాల పునర్విభజన రాజకీయ అంశంగా కాకుండా ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మార్పులన్నింటిని కలుపుకుని డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 31న వెలువడనున్న తుది నోటిఫికేషన్‌తో జిల్లాల పునర్విభజనపై నెలకొన్న అనిశ్చితికి ముగింపు పడనుండగా, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో జరగనున్న మార్పులు భవిష్యత్ పరిపాలన, అభివృద్ధిపై కీలక ప్రభావం చూపనున్నాయని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *