21, డిసెంబర్ 2025, ఆదివారం

ఉపాధి హామీ వేతనాలకోసం నాలుగు నెలలుగా కూలీలు ఎదురుచూపులు !

వేతనాలు, మెటీరియల్ కలిపి రూ.39.84 కోట్ల బకాయిలు… 

జిల్లాలో మందకొడిగా సాగుతున్న ఉపాధి పనులు 

 ఆగస్టు నుంచి వేతనాలు, ఏప్రిల్ నుండి మెటీరియల్ కాంపోనెంట్ రాలేదు 

 వెనుకబడిన 20 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు

పలు మండలాల్లో యంత్రాలతో పనుల ఆరోపణలు

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు 

చిత్తూరు జిల్లాలో ఉపాధి హామీ పథకం కూలీలకు ఇప్పుడు వేదనకు ప్రతీకగా మారింది. ఆగస్టు 15 నుంచి జిల్లాలో పనిచేసిన ఉపాధి హామీ కూలీలకు  వేతనాలు విడుదల కాలేదు. విత్తనాల కోసం  నాలుగు నెలలుగా లక్షలాది కూలీలు ఎదురు చూస్తున్నారు. పని చేసినా జీతం రాకపోవడంతో కూలీల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఫలితంగా జిల్లాలో అనేక చోట్ల ఉపాధి హామీ పనులు పూర్తిగా మందగించాయి. జిల్లాలో కూలీల వేతనాలుగా చెల్లించాల్సిన మొత్తం రూ.67.88 లక్షలు, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.39.17 కోట్లు బకాయిలు పడ్డారు. ఈ రెండింటిని కలిపి జిల్లాకు రూ.39.84 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నా, కూలీలకు మాత్రం ఆ సమాధానం కడుపు నింపడం లేదు.

వేతనాలు రావడం లేదన్న ఆగ్రహంతో ఉపాధి పనులకు కూలీలు ముందుకు రాకపోవడంతో, జిల్లాలో పనుల పురోగతి మంద పొడిగా నడుస్తోంది. ఈ పరిస్థితికి బాధ్యులని భావిస్తూ, బాగా వెనుకబడిన మండలాలకు సంబంధించి 20 మందికి జిల్లా అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇది క్షేత్రస్థాయిలో కలకలం రేపింది. ఇదే సమయంలో రామకుప్పం, ఐరాల, పూతలపట్టు మండలాల్లో యంత్రాలతో పనులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కూలీలకు పని లేకుండా యంత్రాలతో పనులు చేస్తున్నారని ఆరోపణలు రావడం మరింత ఆగ్రహానికి దారి తీసింది. ఉపాధి పనిదినాల కల్పనలో 56 పనిదినాలతో గుడిపల్లి మండలం జిల్లాలో మొదటి స్థానంలో నిలవగా, కుప్పం 52, విజయపురం 51, రొంపిచర్ల 47, సోమల 44 పనిదినాలతో ముందువరుసలో ఉన్నాయి. అయితే మరోవైపు ఐరాల మండలం కేవలం 27 పనిదినాలతో, గంగాధర నెల్లూరు, చిత్తూరు 30, బంగారుపాళ్యం, పుంగనూరు 31, నిండ్ర 32, గుడిపాల–బైరెడ్డిపల్లి 34 పనిదినాలతో అట్టడుగున నిలిచాయి. ఈ తేడానే జిల్లా లోపలి అసమానతలను బయటపెడుతోంది..ఉపాధి హామీ పథకం అమలులో జిల్లాలో ఏపీవోలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, జేఈలు, కంప్యూటర్ ఆపరేటర్లు, దోమ సిబ్బంది కలిపి 239 మంది, అదనంగా సుమారు 500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. వీరికి కూడా గతంలో ప్రతి నెల మొదటి తారీఖున వచ్చే జీతాలు ఇప్పుడు ఆలస్యమవుతున్నాయి. జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి సిబ్బందినీ కలవరపెడుతోంది.

41.24 లక్షల పనిదినాల కల్పన

జిల్లాలో మొత్తం 31 మండలాలు, 700 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటివరకు 2.47 లక్షల జాబ్ కార్డులు నమోదు కాగా, మొత్తం కూలీలు 4.24 లక్షలు. ప్రస్తుతం యాక్టివ్ జాబ్ కార్డులు 1.98 లక్షలు, యాక్టివ్ కూలీలు 3.20 లక్షలుగా ఉన్నారు. పని చేస్తున్న కుటుంబాలు 1.04 లక్షలు, పని చేస్తున్న కూలీలు 1.55 లక్షలుగా నమోదయ్యారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 81.30 లక్షల పనిదినాలు లక్ష్యంగా నిర్ధారించగా, ఇప్పటివరకు 41.24 లక్షల పనిదినాలు సృష్టించబడ్డాయి. అంటే 50.73 శాతం లక్ష్య సాధన జరిగింది. ఈ కాలంలో మొత్తం రూ.198.44 కోట్ల వ్యయం కాగా, సగటు దినసరి వేతనం రూ.273.18గా ఉంది. జిల్లాలో 4,368 కుటుంబాలు పూర్తి వంద రోజుల పనిని పూర్తి చేశాయి. సగటున ఒక్కో కుటుంబానికి 40 పనిదినాలు కల్పించగా, ఇది రాష్ట్ర సగటు కంటే కొద్దిగా ఎక్కువ. ఉద్యానవన తోటల పెంపకంలో కూడా జిల్లా ముందుంది. ఈ ఏడాది 4,000 ఎకరాల లక్ష్యంగా నిర్ణయించగా, 3,183 ఎకరాలకు అనుమతులు, 2,680 ఎకరాల్లో మొక్కలు నాటడం పూర్తయ్యింది.

జిల్లా మొత్తం మీద రూ. 528.8.2 కోట్ల వ్యయం
డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్  రవికుమార్

2025–26లో ఇప్పటివరకు చేపట్టిన పనులు
ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 62,848 పనులు మంజూరవగా, 17,788 పనులు పూర్తయ్యాయని దోమ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ.రవికుమార్ తెలిపారు. వీటిపై మొత్తం రూ.528.82 కోట్లు వ్యయం జరిగిందనీ, ఫామ్ పాండ్స్ పనుల్లోనే అత్యధికంగా రూ.39.76 కోట్లు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. ఫీడర్ ఛానళ్ల పూడికతీతకు 3,422 పనులు మంజూరు కాగా, 324 పూర్తయ్యాయని, రూ.17.87 కోట్లు వ్యయం జరిగిందని వివరించారు. తోటల పెంపకంలో 2,680 పనులు పూర్తై రూ.5.62 కోట్లు, నర్సరీల పనులు 11 పూర్తై రూ.426.07 కోట్లు ఖర్చైనట్లు తెలిపారు. జిల్లాలో 23,583 ఫామ్ పాండ్స్ మంజూరవగా, 6,678 పూర్తయ్యాయనీ, వీటిపై రూ.39.76 కోట్లు వ్యయం జరిగిందన్నారు. పల్లె పండుగ 2.0 కింద 2,395 పశువుల పాకలు మంజూరు కాగా, 682 పూర్తయ్యాయన్నారు. 6,678 వ్యక్తిగత ఇంకుడు గుంతలు మంజూరు కాగా, 2,283 పూర్తయ్యాయని చెప్పారు. అలాగే 9,791 కంపోస్ట్ గుంతలకు గాను గుంతలకు గాను 4,769 పూర్తి అయ్యాయని, 1,788 పశువుల తొట్లకు 761 పనులు పూర్తి చేశామన తెలిపారు. గ్రామీణ రహదారుల అభివృద్ధిలో భాగంగా 1,434 సీసీ రోడ్లు మంజూరవగా, 127 రోడ్లు (25.51 కి.మీ) పూర్తయ్యాయని వివరించారు. మొత్తంగా చూస్తే, ఉపాధి హామీ పథకం జిల్లాలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా మారిందన్నారు. ఉపాధితో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, పచ్చదనం పెంపు, నీటి సంరక్షణ వంటి అంశాల్లో పథకం బలమైన ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ కూలీల వేతనాలు మరో 15 రోజుల్లో వారి ఖాతాలకు జమ అయ్యి అవకాశం ఉందన్నారు. వేతనాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేసిందని, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు విడుదల చేయనుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగానే ఉపాధి హామీ కూలీల ఖాతాలలో జమ చేస్తామని డ్వామా పిడి రవికుమార్ తెలిపారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *