చిత్తూరు పార్లమెంటరీ పార్టీ నూతన అధ్యక్షుడిగా షణ్ముగం రెడ్డి
ప్రధాన కార్యదర్శిగా సునీల్ చౌదరి నియామకం
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)
చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గానికి నూతన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శుల నియామకాలను పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు నగరి నియోజకవర్గం పుత్తూరుకు చెందిన షణ్ముగం రెడ్డిని పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా, పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం కొండ్రాజు కాలువకు చెందిన సునీల్ చౌదరిని ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
ఈ నియామకాలతో జిల్లాలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారికి అభినందనలు తెలిపారు. అధ్యక్షుడిగా నియమితులైన షణ్ముగం రెడ్డి ఆదివారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేశారు. నగరి నియోజకవర్గం పుత్తూరుకు చెందిన షణ్ముగం రెడ్డి రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన నేత. 1999లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన, స్వర్గీయ మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు శిష్యుడిగా ఎదిగారు. పుత్తూరు పట్టణంలో 13 సంవత్సరాలపాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన షణ్ముగం రెడ్డి, రెండు సంవత్సరాలు తెలుగు యువత జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా సేవలందించారు. ప్రస్తుతం చిత్తూరు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడిగా, రాష్ట్ర వన్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యువగళం పాదయాత్రలో పార్టీ నేత లోకేష్ వెన్నంటి ఉండి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ పట్ల ఆయన చూపిన అంకితభావం, అనుభవమే ఈ కీలక బాధ్యతకు ఆయన ఎంపికకు దోహదపడినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే నగరి ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ రెడ్డి మద్దతు కూడా ఆయనకు బలంగా ఉందని సమాచారం.
ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సునీల్ చౌదరి తవణంపల్లి మండలం కొండ్రాజు కాలువకు చెందినవారు. గతంలో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగంలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయనకు పార్టీ వ్యవహారాలపై మంచి పట్టు ఉందని నాయకులు పేర్కొంటున్నారు. చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమల్ల ప్రసాదరావు అండదండలు సునీల్ చౌదరికి ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ సందర్భంగా సునీల్ చౌదరి మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ నిరంతరం కృషి చేస్తానని అన్నారు. నూతన నియామకాలతో చిత్తూరు జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు కొత్త ఊపొస్తుందని, రానున్న రాజకీయ పరిణామాల్లో ఇవి కీలకంగా నిలుస్తాయని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
గంగ 3 షణ్ముగం రెడ్డి
గంగ 4 సునీల్ చౌదరి

