చిత్తూరు జిల్లా ఆసుపత్రి వైద్యుడిపై క్రమశిక్షణా చర్యలు
డాక్టర్ సి. అరుణ్ కుమార్‌పై విచారణకు ఆదేశాలు
విచారణాధికారి, ప్రజెంటింగ్ ఆఫీసర్ నియామకం
రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ఆదేశం
(ఆంధ్రప్రభ బ్యూరో)
చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తు పదవి విరమణ చేసిన డాక్టర్ సి. అరుణ్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు ప్రారంభించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై సమర్పించిన లిఖితపూర్వక వివరణ సంతృప్తికరంగా లేదని తేల్చిన ప్రభుత్వం, సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జి.ఓ.ఆర్.టి. నెం.928 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ క్రమశిక్షణ అప్పీల్ నిబంధనలు, 1991లోని రూల్ 20 ప్రకారం డాక్టర్ సి. అరుణ్ కుమార్‌పై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా, ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను మెరుగైన చికిత్స పేరుతో తమ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లకు వెళ్లమని సూచించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణల్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై డాక్టర్ సి. అరుణ్ కుమార్ ప్రభుత్వం ముందు లిఖితపూర్వక వివరణ సమర్పించారు. అయితే ఆ వివరణ ఆరోపణలను ఖండించేందుకు సరిపడా ఆధారాలు లేవని ప్రభుత్వం నిర్ధారించింది. వివరణ నమ్మదగినది కాదని తేల్చిన ప్రభుత్వం, ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అధికారిక నిబంధనల మేరకు గుంటూరు డీసీహెచ్ఎస్ ని విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రభుత్వం తరఫున కేసును వాదించేందుకు నెల్లూరు డీసీహెచ్ఎస్ ని ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా నియమించింది. విచారణాధికారి అన్ని నిబంధనలు పాటిస్తూ విచారణను పూర్తి చేసి, రెండు నెలల లోపు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విచారణకు అవసరమైన అన్ని రికార్డులు, ఫైళ్లు, సంబంధిత సమాచారాన్ని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, ఆంధ్రప్రదేశ్ విచారణాధికారికి అందజేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆదేశం మేరకు వారి పేరిట జారీ చేసినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ ఘటన ఆరోగ్య శాఖలో సంచలనం సృష్టించగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధుల పట్ల వైద్యుల బాధ్యత, ప్రైవేట్ ప్రాక్టీస్ అంశాలపై మరింత కఠిన చర్యలకు ఇది దారి తీసే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

