గాంధీజీ గ్రామ స్వరాజ్య దిశగా ఎన్డీఏ అడుగులు
పంచాయతీరాజ్‌లో చారిత్రాత్మక విప్లవానికి శ్రీకారం
చిత్తూరులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
చిత్తూరు, డిసెంబర్ 04 ఆంధ్రప్రభ బ్యూరో :గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలోకి తెచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ,పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసులను గురువారం చిత్తూరు నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ వి.ఆర్. కృష్ణతేజ మైలవరపు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు, పూతలపట్టు, తిరుపతి, కోడూరు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, కె. మురళిమోహన్, ఆరణి శ్రీనివాసులు, ఆరవ శ్రీధర్, మేయర్ అముద, చైర్పర్సన్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసిన పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పునర్నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించడంతో దాదాపు 10 వేలమందికి అవకాశం లభించిందని చెప్పారు. జిల్లా పరిషత్ మరియు జిల్లా పంచాయతీ విభాగాల ఏకీకరణతో పరిపాలన మరింత స్పష్టతతో, వేగవంతంగా మారిందన్నారు. డిపిఓ స్థాయి అధికారిని డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి పెంచడం శాఖ సామర్థ్యాన్ని పెంచే చర్యగా పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో తీసుకున్న పెద్ద సంస్కరణగా 7,244 క్లస్టర్లను రద్దు చేసి 13,350 గ్రామ పంచాయతీలను స్వయం పాలనా సంస్థలుగా మార్చినట్లు తెలిపారు. ప్రతి పంచాయతీలో సెక్రెటరీ నియామకం, పెద్ద పంచాయతీలలో గెజిటెడ్ అభివృద్ధి అధికారిని నియమించడం ద్వారా ప్రజలకు సేవల అందకంలో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. ఐదు గ్రేడ్ల పంచాయతీ సెక్రెటరీలను మూడు గ్రేడ్లుగా మార్చి పంచాయతీ అభివృద్ధి అధికారులు అనే కొత్త పేరును ఇచ్చినట్లు వివరించారు. పంచాయతీరాజ్ సంస్థలను సాంకేతికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక సమాచార సాంకేతిక విభాగాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పంచాయతీరాజ్ పాలనాపరమైన సంస్కరణల భాగంగా జిఓ ఎంఎస్ 57, 58 అమలు చేస్తున్నామని కమిషనర్ కృష్ణతేజ పేర్కొన్నారు. ఇప్పటివరకు రెవెన్యూ, పోలీస్ శాఖలకు మాత్రమే డివిజినల్ స్థాయి వ్యవస్థ ఉండగా, ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖకు కూడా అలాంటి నిర్మాణం అందుబాటులోకి రావడం చారిత్రాత్మకమన్నారు. ఈ పోస్టులు అత్యున్నత అర్హతలతో కూడిన నియామకాలకు అవకాశం కల్పిస్తాయని తెలిపారు. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు ఆర్డిఓల తరహాలో పనిచేస్తారని, వారికి ఏపిడి, డిఎల్డిఓ స్థాయి అధికారాలు ఉండటం వలన పంచాయతీ రాజ్, మన దేశ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి కార్యక్రమాల పర్యవేక్షణ బలోపేతం అవుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లలో ఈ కార్యాలయాలను జెడ్‌పి నిధులతో జి+1 భవనాలుగా నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఎం.పి.డి.ఓలు, డి.డి.ఓలు సమన్వయంతో జిల్లా అభివృద్ధిలో మరింత వేగం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నుండి మంత్రి అచ్చెన్నాయుడు, తెనాలి నుండి మంత్రి నాదెండ్ల మనోహర్, ఆత్మకూరు నుండి ఆనం రామనారాయణ రెడ్డి, పెనుగొండ నుండి మంత్రి సవితమ్మలు వర్చువల్‌గా పాల్గొన్నారు. పలువురు డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు కూడా డిప్యూటీ సిఎంతో ఆన్‌లైన్‌లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
*పదవి అలంకారం కాదు… ప్రజల కోసమే నా ప్రయాణం*
తన రాజకీయ ప్రయాణం గుర్తింపుకోసం కాదని, ప్రజల కోసం మాత్రమే అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తూరులో నిర్వహించిన పార్టీ సమావేశాల్లో స్పష్టం చేశారు. పదవి నాకు అలంకారం కాదు… ప్రజలు అప్పగించిన బాధ్యత. గుర్తింపు కోసం పనిచేయను—ప్రజల కోసం మాత్రమే పనిచేస్తా అని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలతో జరిగిన రెండు సమావేశాలు జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. చిత్తూరు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ సుమారు 750 మంది కార్యకర్తలతో సమావేశమై, ఒక్కొరి సమస్యలు విని పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వీర మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడి, వారి ఇబ్బందులను అధికారులకు వెంటనే తెలియజేశానని చెప్పారు. కార్యకర్తలు ఎలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని, కష్టపడితేనే గుర్తింపు వస్తుందని ఆయన సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై మాట్లాడుతూ, సంవత్సరాల తరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూసిన పంచాయతీరాజ్ శాఖలోని పది వేల మందికి ఒకేసారి పదోన్నతులు ఇవ్వగలిగామని పవన్ గుర్తుచేశారు. పదోన్నతి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ఎంతటి గౌరవమో నాకు తెలుసు. అందుకే అర్హతే ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం అన్నారు. చిత్తూరులో ఏర్పాటు చేసిన నూతన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసును పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాల్లో చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, జనసేన జిల్లా అధ్యక్షుడు డా. పసుపులేటి హరిప్రసాద్, అరవ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మన ఐక్యతే రాష్ట్రానికి బలం. భావజాలాలు వేరైనా—రాష్ట్రం బాగుండాలి, అక్రమాలు దూరం కావాలి అన్న ఆశయం మనందరినీ కూటమిగా తెచ్చింది అని అన్నారు. కూటమిలో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ సహజమని, ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన వివరించారు. ఈ ఐక్యతే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి బలం అయిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో శేషాచలం అడవుల దోపిడీపై మండిపడుతూ, ఇప్పటి వరకు దొరికింది పది శాతం మాత్రమే… దాని విలువే వేల కోట్లు. ఇకపై అలాంటి దోపిడీని భరించం. బలహీనుల గొంతుకగా నిలబడటం మన ధర్మం అని పవన్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు ధైర్యంగా పోరాడిన తీరును గుర్తుచేసి, ధైర్యం కోల్పోని వారినే ప్రజలు నాయకులుగా తయారు చేస్తారని అన్నారు. తన పర్యటనలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్ఫూర్తితో పంచాయతీల్లో నడుస్తున్న స్వచ్ఛరథాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. తిరుచానూరు, కరకంబాడి పంచాయతీల నుంచి తీసుకువచ్చిన రథాల్లో అందిస్తున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసి, పరిశుభ్రత కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని అధికారులను అభినందించారు. చిత్తూరులో పవన్ కళ్యాణ్ సందర్శనలు, ప్రసంగాలు, పార్టీ శ్రేణులకు ఇచ్చిన దిశానిర్దేశం, కూటమి భవిష్యత్ రాజకీయాలకు కొత్త ఊపును తీసుకువచ్చినట్లుగా నాయకులు అభిప్రాయపడ్డారు.

