12, డిసెంబర్ 2025, శుక్రవారం

ఖాళీ అవుతున్నప్రభుత్య వసతిగృహాలు!

జిల్లాలో 57 హాస్టళ్లలో 5700 కాను, విద్యార్థులు 3683 మాత్రమే

 ప్రభుత్వ హాస్టళ్ల వైపు విద్యార్థులు తిరిగి చూడని పరిస్థితి

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.

చిత్తూరు జిల్లాలోని సామాజిక సంక్షేమ శాఖ హాస్టళ్లు ఒకప్పుడు విద్యార్థుల రద్దీతో కళకళలాడేవి. ఒక్కో హాస్టల్‌కు 100 మంది సామర్థ్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున భవనాలు నిర్మించింది. సీటు కోసం అప్పట్లో ఎమ్మెల్యేలు, నాయకులు రికమెండేషన్లు ఇచ్చే స్థాయి. కానీ నేటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జిల్లాలో మొత్తం 57 హాస్టళ్లు ఉన్నప్పటికీ, వీటిలో 5,700 మంది ఉండాల్సిన చోట కేవలం 3,683 మంది మాత్రమే ఉండటం హాస్టల్ వ్యవస్థ దెబ్బతిన్నదనడానికి ప్రత్యక్ష నిదర్శనం. జిల్లావ్యాప్తంగా 50 శాతం వరకు సీట్లు ఖాళీగా ఉండటమే కాక, కొన్ని హాస్టళ్లు అయితే మూతపడే స్థితికి చేరుకున్నాయి. రెసిడెన్షియల్ పాఠశాలలు పెరగడం, ప్రభుత్వ వసతి గృహాలలో రుచికరమైన భోజనం అందకపోవడం, పట్టణ శివార్లల ఉంటూ
 రక్షణ లేకపోవడంతో విద్యార్థులు ప్రభుత్వ వసతి గృహాలు అంటే విముఖతకు చూపిస్తున్నారు.


జిల్లాలోని కొన్ని హాస్టళ్లలో పరిస్థితి మరింత దిగజారింది. పుంగనూరు కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌లో మొత్తం ఐదుగురు మాత్రమే ఉండటం ప్రభుత్వ హాస్టళ్ల దిగజారిన స్థితిని చూపిస్తుంది. నగరి కాలేజ్ బాయ్స్ హాస్టల్‌లో 31 మంది, గంగాధర నెల్లూరు బాయ్స్ హాస్టల్‌లో 36, కార్వేటినగరం కాలేజ్ బాయ్స్ హాస్టల్లో 38, రామకుప్పం బాయ్స్ హాస్టల్లో 32, దేవళంపేటలో 38 మంది మాత్రమే ఉన్నారు. రాయలపేట గర్ల్స్ హాస్టల్‌లో 29 మంది, కార్వేటినగరం గర్ల్స్ కాలేజ్ హాస్టల్‌లో 19 మంది మాత్రమే నమోదు అయ్యారు. మరోవైపు కొద్ది హాస్టళ్లు మాత్రం కొంత రద్దీతో కళకళలాడుతున్నాయి. చిత్తూరు కాలేజీ గర్ల్స్ హాస్టల్ 2లో 126 మంది, పలమనేరు గర్ల్స్ హాస్టల్‌లో 112 మంది, పూతలపట్టులో 150 మంది, చిత్తూరు కాలేజీ బాయ్స్ హాస్టల్లో 163 మంది ఉండటం మాత్రం మిగతా హాస్టళ్ల పరిస్థితికంటే మెరుగైనది. అయినా, మొత్తం జిల్లాకి చూస్తే సంఖ్య తగ్గుదల ఆందోళనకరంగానే ఉంది.


*విద్యార్థులు   తక్కువ… ఖర్చు ఎక్కువ!*

హాస్టల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం కేవలం వసతిగృహాలకు మాత్రమే కాదు, మెస్ నిర్వహణకూ పెద్ద దెబ్బ. విద్యార్థులు నిండుగా ఉన్నప్పుడు ఒకరి ఖర్చు అందరిపై పడి మెస్ సులభంగా సాగుతుంది. కానీ ఇప్పుడు 20, 30 మంది విద్యార్థులతో నడుస్తున్న హాస్టళ్లలో తినుబండారాల ఖర్చు సర్దుబాటు కావడం లేదు. ఫలితంగా మెస్ బిల్లులు పెరుగుతూనే ఉన్నాయి; ప్రభుత్వం విడుదల చేసే నిధులు సరిపోవడం లేదు. కొన్ని హాస్టళ్లలో వార్డెన్లు జేబు నుంచి డబ్బు వేసి మెస్ నడపాల్సిన పరిస్థితి రావడం పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో చెప్పేస్తోంది. పరీక్షలు, సెలవులు, పండగల సమయంలో విద్యార్థులు మరింత తగ్గిపోతే మెస్ నిర్వహణ దాదాపు అసాధ్యం అవుతోంది.


*సౌకర్యాల లేమి, భద్రత లోపం, వంటపై అసంతృప్తి…*

సామాజిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి ఒకటి కాదు, అనేక కారణాలు ఉన్నాయి.  ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చేరికలు తగ్గిపోవడం,  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాల వైపు మొగ్గుచూపడం ప్రధాన కారణంగా తెలుస్తుంది. దీనితో పాటు  బాలికల హాస్టళ్లలో రక్షణలేమి, పర్యవేక్షణ లోపాలు,  పట్టణ శివార్లలో హాస్టళ్లు ఉండడం వల్ల రాత్రివేళ భద్రత సమస్యలు పెరగడం కూడా కారణమే.  భోజన నాణ్యత పట్ల విద్యార్థుల అసంతృప్తి,  కూరలు, తిండి రుచిగా లేదన్న ఫిర్యాదులు పెరగడంతో విద్యార్థుల ప్రభుత్వ వసతి గృహాలు అంటే మగ్గుచూపడం లేదు. ఈ సమస్యలన్నీ కలిసివచ్చి విద్యార్థులు ప్రభుత్వ హాస్టళ్లను దూరంగా ఉంచుతున్నారు. తల్లిదండ్రులూ తమ పిల్లలను ప్రైవేట్ హాస్టళ్లకు, రెసిడెన్షియల్ పాఠశాలలకు పంపుతున్నారు. ఒకప్పుడు ప్రభుత్వం నిర్మించిన హాస్టళ్లు విద్యార్థులతో కిటకిటలాడగా, నేడు ఖాళీ గదులు, మూతపడే పరిస్థితి, వివరాల లెక్క మాత్రమే నిలిచిపోయింది. వసతిగృహాల స్థిరత్వం, నాణ్యత, భద్రత, మెస్ నిర్వహణలో సంస్కరణలు చేపట్టకపోతే చిత్తూరు జిల్లాలోని హాస్టల్ వ్యవస్థ మరింత కుంగిపోడం ఖాయం. ప్రభుత్వం పరిస్థితిని అర్ధంచేసుకుని వెంటనే పునరుద్ధరణ చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *