చిత్తూరు సింగిల్ విండోల్లో కోట్ల రూపాయల కుంభకోణం !
పర్యవేక్షణ లేమి… సహకార సంఘాల్లో పెరిగిన అవినీతి
ఆడిట్ విభాగం మౌనం – దోపిడీదారులకు దన్ను
రుణాల మంజూరులో నిబంధనల ఉల్లంఘన… 58 గ్రూపులకు అక్రమ రుణాలు!
విచారణ జరగకుండా కోర్టుకెక్కుతున్న నిందితులు
విచారణలు పెరిగితే మరిన్ని కుంభకోణాలు బట్టబయలు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
చిత్తూరు జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాల్లో జరుగుతున్న ఆర్థిక అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు పూర్తైన విచారణల్లోనే నాలుగు సింగిల్ విండోల్లో రూ.298 లక్షలకు పైగా నిధులు స్వాహా అయినట్లు సహకార శాఖ అధికారులు నిర్ధారించారు. మరో మూడు సింగిల్ విండోల్లో విచారణ కొనసాగుతుండటంతో, ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీ రంగరాజపురం సొసైటీ సీఈఓను సహకార శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. బైరెడ్డిపల్లి సింగల్ విండోలో భారీగా అవకతవకలు జరిగినట్లు తేలింది. తదుపరి విచారణ నిలుపుదల చేయాలని నిందితులు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే కారణంగా అక్కడ విచారణ ఆగిపోయింది. సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకుల్లో భారీగా అవినీతి జరుగుతున్న అధికారులకు పట్టలేదు. పర్యవేక్షణ లోపం, ఆడిట్ విభాగం నిర్లక్ష్యం, అధికారుల కుమ్మక్కు కలిసి సహకార వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పరిధిలో మొత్తం 37 సింగిల్ విండోలు పనిచేస్తుండగా, వాటిలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 7 సింగల్ విండోలపై జిల్లా సహకార శాఖ అధికారులు విచారణలకు ఆదేశాలు జారీ చేశారు. సహకార చట్టం సెక్షన్–51 ప్రకారం చేపట్టిన ఈ విచారణల్లో ఇప్పటికే నాలుగు సొసైటీల్లో భారీ స్థాయిలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలింది. బైరెడ్డిపల్లి సింగిల్ విండోలో పరిమితిని మించి వ్యక్తులకు, గ్రూపులకు రుణాలు మంజూరు చేసినట్లు విచారణలో బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా 58 గ్రూపులకు రూ.250.39 లక్షలు రుణాలుగా ఇచ్చినట్లు డివిజనల్ సహకార శాఖ అధికారి గుర్తించారు. ఈ వ్యవహారంపై లోతైన విచారణకు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను కోరగా, సంబంధిత వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించడంతో తదుపరి విచారణను తాత్కాలికంగా నిలిపివేశారు. రొంపిచర్ల సింగిల్ విండోలో రూ.75.85 లక్షలు స్వాహా అయినట్లు విచారణలో తేలింది. పెట్రోల్ బంక్ నగదు లావాదేవీలను సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు మహేష్, సీఈఓ సునీల్ కలిసి దుర్వినియోగం చేసినట్లు అధికారులు నిర్ధారించారు. స్వాహా చేసిన మొత్తాన్ని 18 శాతం వడ్డీతో తిరిగి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ చర్యలు ప్రతిపాదించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. సదం సింగిల్ విండోలో రూ.8.33 లక్షలు స్వాహా అయినట్లు తేలగా, ఈ మొత్తాన్ని మాజీ సీఈఓ దామోదర్ రెడ్డి దుర్వినియోగం చేసినట్లు విచారణలో నిర్ధారణ అయింది. అయితే ఈ కేసులో కూడా క్రిమినల్ లేదా క్రమశిక్షణ చర్యలకు సంబంధించి స్పష్టమైన ప్రతిపాదనలు లేకపోవడం గమనార్హం. శ్రీరంగరాజపురం సింగిల్ విండోలో రూ.8.96 లక్షలు స్వాహా అయినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తాన్ని మాజీ సీఈఓ మురుగన్ నుంచి 18 శాతం వడ్డీతో వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు, ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయినప్పటికీ క్రిమినల్ చర్యలు ప్రతిపాదించకపోవడం ప్రశ్నలు రేపుతోంది. ఇదే సమయంలో అయ్యప్పగారిపల్లి, నగరి సింగిల్ విండోల్లో పెట్రోల్ బంక్ నిర్వహణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే శాంతిపురం సింగిల్ విండోలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాల మంజూరులో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మూడు సొసైటీల్లో విచారణలు కొనసాగుతుండగా, నివేదికలు అందాల్సి ఉంది. మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే, సింగిల్ విండోల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడం, లెక్కలను కాలానుగుణంగా తనిఖీ చేయాల్సిన ఆడిట్ విభాగం నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కొందరు ఆడిట్ అధికారులు కూడా పరోక్షంగా దోపిడీదారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. సింగిల్ విండో పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు, అధ్యక్షులు కలిసి కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేయడం సహకార వ్యవస్థ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. కొనసాగుతున్న విచారణలు పూర్తయితే మరిన్ని కుంభకోణాలు బయటపడే అవకాశముందని అధికారులు అంటున్నారు.

