ప్రస్తాయించిన ప్రజా సమస్యలకు పరిష్కారరం చూపాలి
మూడు జిల్లాల అధికారులు హాజరు కావాలి
సంక్షేమ పథకాల అమలులో అగ్రగామిగా చిత్తూరు
కలెక్టర్ సమీక్షలో స్పష్టత
చిత్తూరు, డిసెంబర్ 6 (ఆంధ్రప్రభ బ్యూరో) : చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశంలో ప్రస్తావించే సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు జడ్పిటిసి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులు వ్యయప్రయాసలకు ఓర్చి సభ ముందుకు సమస్యలను తీసుకువస్తున్నా, అవే సమస్యలు పునరావృతం అవుతున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మూడు జిల్లాల ఉమ్మడి సమావేశం అయినప్పటికీ తిరుపతి, అన్నమయ్య జిల్లాల అధికారులు హాజరు కాకపోవడం వల్ల చర్చలకు స్పష్టత లేదని, వచ్చే సమావేశానికి తప్పనిసరిగా హాజరు అయ్యే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులు లేకపోతే సమస్యలు ప్రస్తావించడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని వారు ప్రశ్నించారు. చిత్తూరు జెడ్పీ సమావేశం శనివారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, , తిరుపతి డిఆర్ఓ నరసింహులు, జెడ్పీ సీఈవో రవి కుమార్ నాయుడు, జిల్లా అధికారులు, జడ్పిటిసి సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు పాల్గొన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల అర్హత కలిగిన పాడి రైతులకు గోకుల షెడ్ల నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరైనట్లు పేర్కొంటూ, సంబంధిత ఇంజనీర్లు పనులను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధుల సహకారంతో వ్యవస్థ ముందుకు సాగుతోందని వివరించారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికి ఒక్కో కాలనీకి 20 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. అంతేకాక, నాడు–నేడు పథకానికి సంబంధించి పాఠశాలల అభివృద్ధికి నిధుల ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. పాడి రైతులకు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 2342 గోకుల షెడ్ల పనులు మంజూరు చేశామని, అందులో 620 పూర్తయ్యాయని, 1182 షెడ్లు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. అర్హత ఉన్న రైతులు దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. ఉద్యాన శాఖ ద్వారా పంటల విస్తీర్ణం పెంపుకు 40 శాతం రాయితీ, మామిడికాయల నాణ్యత మెరుగుపర్చేందుకు చిత్తూరుకు 4.50 కోట్ల కవర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో 35 మండలాల్లో 66,941 మందికి వితంతు పెన్షన్లు అందిస్తున్నామని, కొత్త పెన్షన్లకు అనుమతి రాగానే మంజూరు చేస్తామని చెప్పారు. గృహ నిర్మాణ శాఖపై మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 72,763 ఇళ్లను మంజూరు చేశామని, వీటి విలువ 1349.88 కోట్లు అని, ఇప్పటివరకు 53,382 ఇళ్లు పూర్తయ్యాయని, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడి చేశారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయ పనులు, అడవిలో తిరగడం వంటివి ప్రమాదానికి కారణమవుతాయని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సేవలు పొందాలని సూచించారు. విద్యార్థులు ఉన్న సంక్షేమ హాస్టళ్లలో వారానికి రెండు సార్లు వైద్యపరీక్షలు నిర్వహించాలని అభ్యర్థించారు. జెడ్పీ సీఈవో మాట్లాడుతూ నాగిరి, కార్వేటినగరం, పాలసముద్రం వంటి ప్రాంతాల అభివృద్ధి పనులకు పుష్కల నిధులు ఉన్నాయని, త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను ఆమోదిస్తామని తెలిపారు. సమావేశంలో పలువురు జడ్పిటిసి సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు ప్రాంతీయ సమస్యలను సభ ముందు ఉంచగా, వ్యవసాయం, ఉద్యానవనం, విద్య, వైద్య, నీటి సరఫరా, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశుసంక్షేమ, నీటి యాజమాన్య సంస్థలకు చెందిన అధికారులు శాఖల వారీగా ప్రగతిని వివరించారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు డుమ్మా
చిత్తూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు హాజరు కాలేదు. ఈ సమావేశానికి జిల్లాలోని 14 మంది శాసనసభ్యులు, ముగ్గురు పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు హాజరు కావాల్సి ఉంది. జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు గాని ఈ సమావేశానికి హాజరు కాలేదు. శాసనమండలి సభ్యుడు సిపాయి సుబ్రహ్మణ్యం మాత్రం హాజరయ్యారు.

