వసతుల లేమితో సంక్షోభంలో ప్రభుత్వ వసతి గృహాలు
భర్తీకి నోచుకోని 50 శాతం హాస్టల్ సీట్లు
అద్దె భవనాల్లో ఆరు వసతి గృహాలు
14 హాస్టళ్లకు ఇన్చార్జి వార్డెన్లే దిక్కు
జిల్లాకు కొత్తగా రెండు హాస్టల్ భవనాల మంజూరు
హాస్టళ్ల మరమత్తులకు రూ.11.84 కోట్లు మంజూరు
*చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.*
చిత్తూరు జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టళ్ల పరిస్థితి రోజురోజుకీ దిగజారుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, చదువు అన్నీ ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఒకప్పుడు పేద పిల్లలకు ఆశ్రయంగా ఉండాల్సిన హాస్టళ్లు ఇప్పుడు తాగునీరు, మరుగుదొడ్లు, బాత్రూములు, శానిటేషన్ వంటి ప్రాథమిక సదుపాయాలే లేక సమస్యల కేంద్రాలుగా మారిపోయాయి. జిల్లాలో మొత్తం 57 హాస్టళ్లు ఉన్నాయి. అందులో 33 బాలుర హాస్టళ్లు, 24 బాలికల హాస్టళ్లు మాత్రమే. ప్రభుత్వం నిర్మించిన భవనాలు మొత్తం 51 కాగా, మిగిలిన 6 ఇంకా అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. పలమనేరు బాలికల హాస్టల్, పూతలపట్టు హాస్టల్, నగరి కళాశాల బాలుర హాస్టల్, వీకోట కళాశాల బాలుర హాస్టల్, చిత్తూరు కళాశాల బాలికల హాస్టల్ నంబరు ఒకటి, అలాగే బాలుర కళాశాల హాస్టల్ నంబరు ఒకటిలాంటి వసతి గృహాలు ఈ వరసలో వస్తాయి.
హాస్టళ్లలో మరుగుదొడ్లు పాడై ఉండటం, తలుపుల్లేకపోవడం, బాత్రూములు దెబ్బతినడం, ఎలుకలు, కీటకాలు సంచరించడం వంటి సమస్యలు సాధారణమైపోయాయి. శుభ్రత లేకపోవడంతో కొంతమంది విద్యార్థులకు చర్మ సంబంధ వ్యాధులు రావడం, భోజనం సరైన సమయంలో అందకపోవడం, నీటి సమస్యలు ఎక్కువ కావడం వంటి ఇబ్బందులు తరచూ బయటపడుతున్నాయి. హాస్టల్లో భోజనం విషయంలో ప్రభుత్వం నెలనెలా పెద్ద మొత్తంలో నిధులు జమ చేస్తోంది. ఒకటి నుంచి నాలుగు తరగతుల పిల్లలకు 1150 రూపాయలు, ఐదు నుంచి పది తరగతుల పిల్లలకు 1400 రూపాయలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు 1600 రూపాయలు ఆహారం కోసం కేటాయిస్తుంది. ఈ మొత్తం కలిపి నెలకు దాదాపు కోటి రూపాయలు అవుతుంది. అయినా పిల్లలకు ఇవ్వబడుతున్న ఆహారం నాణ్యతపై ప్రశ్నలు ఎక్కడికక్కడ వినిపిస్తున్నాయి.
*ఏడేళ్లుగా వార్డెన్ల భర్తీ లేక కుంటుపడుతున్న పర్యవేక్షణ*
హాస్టళ్లలో అసలు సంక్షోభం వార్డెన్ల కొరతతోనే మొదలవుతుంది. మొత్తం 57 హాస్టళ్లకు 43 మంది వార్డెన్లు మాత్రమే ఉండటంతో 14 హాస్టళ్లు పూర్తిగా వార్డెన్ లేకుండా నడుస్తున్నాయి. దీనివల్ల అక్కడ చదువుతున్న పిల్లల చదువు, ప్రవర్తన, భద్రత అన్నీ గాలికి వదిలిపెట్టినట్టవుతోంది. వార్డెన్ నియామకాలు గత ఏడు సంవత్సరాలుగా జరగకపోవడంతో ఖాళీలు పూడకపోయాయి. ఉన్న వార్డెన్లలో పద్నాలుగురిని ఇంచార్జీలుగా మరో హాస్టళ్లకు పంపడంతో అక్కడి పరిపాలన కూడా అస్తవ్యస్తమైంది. మొత్తంగా చూస్తే ఇంచార్జీలుగా పంపిన కారణంగా ఇరవై ఎనిమిది హాస్టళ్లు సక్రమ పర్యవేక్షణ లేకుండా సాగుతున్నాయి. విద్యార్థులు చెబుతున్నట్టుగా మమ్మల్ని చూసే వారు ఎవరూ లేరు, సమస్య ఉంటే చెప్పుకునే వాళ్లే లేరు అన్న మాటలు దుస్థితిని బట్టబయలుగా చూపుతున్నాయి. బాలికల హాస్టళ్లలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. చిత్తూరు, గుడిపాడు, గంగాధర నెల్లూరు, నగరి, బంగారుపాలెం, పలమనేరు ప్రాంతాల్లోని బాలికల హాస్టల్స్‌లో రాత్రి పూట భద్రతా సిబ్బంది లేకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వెలుతురు సరిగా లేకపోవడం వంటి సమస్యలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు సురక్షితంగా ఉన్నారో లేదో అన్న భయం మాలో ఉందని బాధతో అంటున్నారు.
*కొత్త ప్రభుత్వ చర్యలతో విద్యార్థులలో చిగురిస్తున్న ఆశలు*
గత ప్రభుత్వం హాస్టళ్ల పరిస్థితి పట్ల సరైన శ్రద్ధ చూపలేదన్న ఆరోపణలు హాస్టల్ వార్డెన్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులలో విన్నవే. ఆహార నిధులు సకాలంలో రాకపోవడంతో వార్డెన్లు అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెట్టిన రోజులూ ఉన్నాయి. హాస్టళ్ల భవనాలు పాడైపోయినా మరమ్మతులు చేయకుండా సంవత్సరాలు గడిచిపోయాయి. దీనివల్ల విద్యార్థులు సగం హాస్టళ్లను వదిలి ఇంటి వద్ద నుంచే చదువుకు మొగ్గుచూపారు. అయితే నూతనంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హాస్టళ్ల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మౌలిక వసతులను పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం 11.84 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇందులో కుప్పం నియోజకవర్గానికి 3 కోట్లు, మిగిలిన నియోజకవర్గాలకు 8.84 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిధులతో పాడైపోయిన భవనాల మరమ్మతులు, కాలువల శుభ్రత, నీటి ట్యాంకుల మార్పిడి, మరుగుదొడ్ల పునర్నిర్మాణం వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రధాని అజయ్ పథకం కింద పలమనేరు బాలురు, బాలికల హాస్టళ్లకు కొత్త భవనాలు మంజూరయ్యాయి. బాలికల హాస్టల్ నిర్మాణం ప్రారంభమయ్యింది. బాలుర హాస్టల్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ చర్యలు విద్యార్థుల్లో కొత్త ఆశ రేకెత్తిస్తున్నాయి.
వసతుల లేమితో భర్తీ కానీ హాస్టల్ సీట్లు
జిల్లాలోని ప్రతీ హాస్టల్‌లో 100 మంది విద్యార్థుల వసతి సామర్థ్యం ఉంది. 57 హాస్టళ్లలో మొత్తం 5,700 విద్యార్థులు ఉండాలి. కానీ ప్రస్తుతం 3,683 మంది మాత్రమే ఉన్నారు. అంటే దాదాపు సగం సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థాయిలో విద్యార్థుల సంఖ్య పడిపోవడం హాస్టల్ వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. విద్యార్థులు హాస్టల్ పట్ల ఆసక్తి శుభక పోవడానికి ప్రధాన కారణాలు తాగునీరు సమస్యలు, మరుగుదొడ్లు బాగాలేకపోవడం, బాత్రూములు పనికిరాకపోవడం, నీటి ట్యాంకుల శానిటేషన్ లేకపోవడం, చర్మ వ్యాధులు రావడం, భద్రత లోపించడం, వార్డెన్ పర్యవేక్షణ లేకపోవడం. ఇవన్నీ కలిపి విద్యార్థులను హాస్టల్ నుంచి దూరం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ మాధ్యమ పాఠశాలలవైపు ఆకర్షణ పెరగడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇదే విధంగా కొనసాగితే జిల్లాలో సగం హాస్టళ్లకు తాళాలు వేసే రోజులు దూరంలో లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి హాస్టళ్ల బతుకు బట్టేలు విద్యార్థులే. వారికి వసతులు మెరుగుపడితేనే తిరిగి విద్యార్థులు హాస్టల్ దిశగా వస్తారు. అందుకోసం ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను తక్షణమే భర్తీ చేయడం అత్యవసరం. ప్రతి హాస్టల్‌లో శానిటేషన్, తాగునీరు, భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటే హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. హాస్టళ్లను నిజమైన విద్యా కేంద్రాలుగా మార్చేందుకు ఇది సరైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

