విలువల బడి పేరుతో కుప్పంలో సంస్కార విద్యకు శ్రీకారం
సామగుట్టపల్లిలో ప్రారంభమైన నైతిక విద్యా ఉద్యమం
నారా భువనేశ్వరి చేతుల మీదుగా విలువల బడి ఆవిష్కరణ
చదువుతో పాటు సామాజిక బాధ్యత నేర్పే ప్రయత్నం
జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
కుప్పం మోడల్ ను రాష్ట్రమంతా అమలు చేయాలని పిలుపు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
కుప్పం నియోజకవర్గంలో విద్యకు కొత్త దిశను చూపిస్తూ, విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యత, సేవా భావాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో విలువల బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమాజ క్రాంతి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ కార్యక్రమాన్ని ఇటీవల నారా భువనేశ్వరి సామగుట్టపల్లిలోని జడ్పీ ప్రాథమికోన్నత పాఠశాలలో అధికారికంగా ప్రారంభించారు. విద్యార్థులను కేవలం అక్షరాస్యులుగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ల సదస్సులు గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖంగా ప్రస్తావించారు. కుప్పం తరహా మోడల్ ను రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు.
ప్రస్తుత కాలంలో విద్యార్థులు చదువులో ముందుకు వెళ్లినా, నైతిక విలువలు, మానవీయ సంబంధాలు, సామాజిక బాధ్యతల విషయంలో వెనుకబడుతున్న పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్న నారా భువనేశ్వరి, ఈ లోటును పూరించేందుకే విలువల బడి కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని తెలిపారు. దేశ భవిష్యత్తు పూర్తిగా విద్యార్థుల చేతుల్లోనే ఉందని, అలాంటి పిల్లలకు చిన్నతనం నుంచే విలువలు నేర్పితేనే సమాజం సుస్థిరంగా ముందుకు సాగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. సామగుట్టపల్లిలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో ముఖాముఖి సంభాషించిన నారా భువనేశ్వరి, చదువు అనేది ఉద్యోగానికి మాత్రమే పరిమితం కాకూడదని, మంచి మనిషిగా ఎదగడానికి దోహదపడాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల గౌరవం, సమాజంలో బాధ్యతాయుత ప్రవర్తన, క్రమశిక్షణ, సేవా భావం వంటి అంశాలను పిల్లలు చిన్ననాటినుంచే అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. పిల్లలలో ఈ విలువలు బలంగా నాటితేనే రేపటి భారతదేశం బలంగా నిలుస్తుందన్నారు. సమాజ క్రాంతి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సాగుతున్న విలువల బడి కార్యక్రమం కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలను కేంద్రంగా చేసుకుని అమలవుతోంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నైతిక విలువలు, సామాజిక స్పృహ, సేవా దృక్పథం, బాధ్యతాయుత జీవన విధానం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. పాఠ్యపుస్తకాలతో పాటు జీవన పాఠాలు నేర్పడమే దీని ప్రత్యేకతగా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ, తల్లిదండ్రుల పాత్ర పిల్లల జీవితంలో అత్యంత కీలకమని పేర్కొన్నారు. పిల్లలకు విలువలు నేర్పే బాధ్యత కేవలం పాఠశాలలదే కాకుండా కుటుంబానిదని స్పష్టం చేశారు. పిల్లల ముందు తల్లిదండ్రులే ఆదర్శంగా నిలవాలని, మంచి ప్రవర్తన ద్వారానే పిల్లల్లో మార్పు తీసుకురావచ్చని తెలిపారు. అలాగే చెడు అలవాట్లు, వ్యసనాల నుంచి పిల్లలను దూరంగా ఉంచడంలో సమాజం మొత్తం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు.
విలువల బడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే కథలు, సంఘటనలు, సామాజిక అనుభవాలను ఉదాహరణలుగా చెబుతూ సెషన్లు నిర్వహిస్తున్నారు. దేశానికి, సమాజానికి సేవ చేసిన మహానుభావుల జీవితాల నుంచి పాఠాలు నేర్పిస్తూ, విద్యార్థుల్లో దేశభక్తి, సామాజిక స్పృహను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన జీవన విధానం ఉంటేనే వ్యక్తిగతంగా, సామాజికంగా ఎదుగుదల సాధ్యమవుతుందన్న భావనను పిల్లల్లో నాటుతున్నారు. కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న దీర్ఘకాల లక్ష్యంలో విలువల బడి ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో వచ్చిన మార్పును గమనిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదువుతో పాటు విలువలు నేర్పితేనే సమాజానికి సరైన దిశ చూపగల పౌరులు తయారవుతారన్న నమ్మకాన్ని ఈ కార్యక్రమం మరింత బలపరుస్తోంది. విద్య, విలువలు, బాధ్యత అనే మూడు స్తంభాలపై నిలిచిన విలువల బడి కార్యక్రమం కుప్పం నుంచే ప్రారంభమై, రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా అమలవుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక కార్యక్రమం కాకుండా, భావి తరాల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక సామాజిక ఉద్యమంగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

