6, డిసెంబర్ 2025, శనివారం

తిరుపతిలో స్క్రాప్ పేరుతో మరో బోగస్ జీఎస్టీ దందా…

కాగితాలమీద కోట్లు తిరిగిన చీకటి కథ
 రద్దైన జీఎస్టీ నంబరుతో కోట్ల లావాదేవీలు… 
 స్టార్ ఇంజినీరింగ్ పేరు వెనక దాగిన దొంగలు
రాయలసీమను కలవరపెట్టిన మరో పన్నుమోసం 

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు/తిరుపతి.

  చిత్తూరులో స్క్రాప్ పేరుతో భారీ ఎత్తున జరిగిన జిఎస్ టీ కుంభకోణ విషయంలో విచారణ జరుగుతున్న దశలో అదే తరహాలో తిరుపతిలో జరిగిన మరో బోగస్ జీఎస్టీ దందా వెలుగులోకి వచ్చింది. వివరాలను పరిశీలిస్తే ఎవరైనా ఆశ్చర్యముతో ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే. తిరుపతి శ్రీనగర్ కాలనీలో ఒక చిన్న బోర్డు  ఇంజినీరింగ్ వర్క్స్ అని ఉంటుంది. చూసిన వారికి ఎవరికైనా ఇది ఇద్దరు కూలీలతో నడిచే ఒక చిన్న సంస్థ అనిపిస్తుంది. కానీ దాని వెనక దాగిన కథ గుండె దడపెడుతుంది. ఈ సంస్థ మొదట ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్నప్పుడు సాధారణంగా వెల్డింగ్ వర్క్ అని ఉంది. ఇలాంటి పనులు చేసే చోట పెద్దగా నగదు లావాదేవీలు ఉండవు.  అదే సంస్థ కాగితాల్లో కనిపించిన పనిని చూస్తే మతి పోతుంది. నెలలు మూడు గడవక ముందే 45 కోట్లకు పైగా సరుకు అమ్మినట్లు పేర్కొంది. అది కూడా చిన్నచిన్న వస్తువులు కాదు, భారమైన ఇనుము చెత్త, ప్లాస్టిక్ చెత్త, రబ్బరు చెత్త. ఈ రకమైన సరుకును నిల్వచేయడానికి, తరలించడానికి పెద్ద బండారాలు, లారీలు, బరువుల కొలతలు కావాలి. కానీ చిరునామా మాత్రం చిన్న ఇంటి గుమ్మం. ఇంత పెద్ద సరుకు ఎక్కడ దాచారు, ఎక్కడ నుంచి తెచ్చారు, ఎక్కడికి పంపారు అన్న ప్రశ్నలకు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు.

ఇంకా విచిత్రం ఏమిటంటే, ఈ సంస్థ జీఎస్టీ నంబరు ప్రభుత్వం వలన రద్దైన తర్వాత కూడా సరుకు అమ్మకాలు కొనసాగినట్లు కాగితాల్లో ఉంది. రద్దయిన జీఎస్టీ నంబరుతో ఒక నెల కాదు, రెండు కాదు... వరుసగా మూడు నెలలు వేల సంఖ్యలో పత్రాలు నిలిచాయి. రద్దయిన నంబరుతో ఇలాంటి లావాదేవీలు చేయడం చట్టవ్యతిరేకం. అయినా ఈ వ్యవహారం బహిర్గతమైన తీరు చూస్తే ఇది ముందే పక్కాగా పన్నుకున్న ముఠా పని అని తేలిపోతోంది. మరొక ప్రధాన అంశం పరిశీలిస్తే విషయం ఇంకా స్పష్టమవుతుంది. ఈ సంస్థ అమ్మినంత సరుకు మొత్తం ఒకే కొనుగోలుదారుని దగ్గరికి వెళ్లినట్లు పత్రాలు చెబుతున్నాయి. వ్యాపారం అంటే బహుళ కొనుగోలుదారులు ఉంటారు. కానీ ఇక్కడ ఒక్కరే కొనుగోలుదారు. ఇది కాగితాల మీద మాత్రమే జరిగిందని ఎవరికైనా సులభంగా అర్థం అవుతుంది.


 సరుకు ఏమాత్రం కదల్లేదు, కానీ పన్ను రాయితీలు కోట్లలో 

ఈ వ్యవహారం లోతుగా తొంగిచూస్తే ఇది చిత్తూరు, కడప, అనంతపురం మీదుగా బెంగళూరువరకు విస్తరించిన మహా మోసం అని అర్థమవుతుంది. ఇనుము చెత్త, రబ్బరు చెత్త పేరుతో కాగితాలు తయారు చేస్తే సరిపోతుంది. అసలు సరుకు లేకపోయినా సమస్య రాదు. ముఠాలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పనులు చేస్తాయి. ఎందుకంటే చెత్తకు వాస్తవ కొలతలు ఉండవు, నాణ్యత పరిశీలన ఉండదు, తనిఖీలు కఠినంగా ఉండవు. అందుకే ఇది మోసగాళ్లకు స్వర్గం. ఈ సంస్థ కూడా అలానే చేసింది. బయటికి కోట్ల విలువ చూపించినా లోపల గోదాం లేదు, రవాణా ఆధారాలు లేవు, గేటు వద్ద లారీ నంబర్లు కూడా లేవు. సరుకు కదలకపోయినా కాగితాలు మాత్రం పరిగెత్తాయి. ఆ కాగితాలను కొనుగోలుదారు తన వద్ద చూపించి పన్ను రాయితీలు పొందాడు. అసలు పన్ను మాత్రం ప్రభుత్వానికి చేరలేదు. ఇలా కాగితాల ద్వారా పన్ను రాయితీలు మూడో వ్యక్తుల వద్దకు చేరుతాయి. ముఠా మధ్యలో డబ్బు తీసుకుంటుంది. ఈ స్టార్ ఇంజినీరింగ్ అనే బోగస్ దుకాణం కూడా పెట్టుబడిదారులే తీసుకున్న పద్దతిలో ముందుగా కొద్దిరోజులు నిశ్శబ్దంగా ఉండి, ఒకరోజు అకస్మాత్తుగా ముంచెత్తే విధంగా పెద్ద మొత్తంలో కాగితాలు తయారు చేసింది. నెలల వ్యవధిలోనే నూరు, రెండువందల కాదు, వెయ్యికి పైగా సరుకు చలనం పత్రాలు రూపొందించాయి. ఇలాంటి రికార్డు పెట్టే కంపెనీ చిరునామాలో ఉండే నీడే కూడా కనిపించలేదు.

ఈ దందా ఒంటరిది కాదు. ఇది పెద్ద గొలుసులో ఒక ముక్క మాత్రమే. చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో గత ఏడాది నమోదు చేసిన మరో మూడు చెత్త వ్యాపార సంస్థలు కూడా ఇదే పద్దతిలో పనిచేశాయి. ఒకే కొనుగోలుదారుని పేరు, ఒకే కొద్ది నెలల్లో పెద్ద మొత్తంలో లావాదేవీలు, ఒకే రకమైన చెత్త సరుకు, బరువుల మీద ఏ ఆధారమూ లేకపోవడం వంటి ఒకే పంథాలో జరిగాయి. ఇలాంటి సంస్థలు రాయలసీమలో అనుమానాస్పదంగా పెరుగుతున్నాయి. ఇవి అన్నీ కలిపితే ఒకే తాడు కనిపిస్తుంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో పేరుకే చెత్త దుకాణాలు ప్రారంభించి, తీరా బెంగళూరు పెద్దవాళ్లకు పన్ను రాయితీ పత్రాలు చేరుస్తున్న ముఠా వలయం. ఈ ముఠాలో మొదటి దశలో చిన్న చెత్త దుకాణాలు నమోదు చేస్తారు. రెండో దశలో అవి స్లీపింగ్ నంబర్లుగా పక్కకు పెట్టి, ప్రభుత్వ దృష్టి తప్పేంతవరకు నిశ్శబ్దం. మూడో దశలో అకస్మాత్తుగా కోట్లు సమానంగా కాగితాలమీద అమ్మకాలు చేయడం. నాలుగో దశలో రాయితీలు పక్కదారి ప్రయాణం. ఐదో దశలో కంపెనీ మూతపడిపోవడం. ఆ ఇంజినీరింగ్ వర్క్స్ కూడా ఇదే పద్దతిలో నడిచింది. చిరునామాలో పనివాళ్లు కూడా లేని చోట మూడు నెలల్లో 45 కోట్ల చెత్త వ్యాపారం ఎలా జరుగుతుంది. దీనికి ఒకే జవాబు, సరుకు అసలే లేదు. కాగితాలు మాత్రమే ఉన్నాయి. ఈ ముఠా పెరుగుతున్న తీరు చూస్తే చిత్తూరు, బెంగళూరు మార్గం ఇప్పుడు పెద్ద పన్ను మోసం అడ్డాగా మారిపోయిందని అర్ధమవుతోంది. ఈ దందాకు వెనకెవరు ఉన్నారో అధికారులు ఇప్పుడే తవ్వకాలు మొదలుపెట్టారు. కానీ ఈ నెట్వర్క్ మరింత పెద్దది అనేది పత్రాలు స్పష్టంగా చెబుతున్నాయి.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *