వస్తువుల్లేవు… బిల్లులే బిల్డప్!
పన్ను మినహాయింపు లోపానికి బలి అయిన పేదలు
నకిలీ బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం
జిల్లాలో జీఎస్టీ దందా జరిగిన తీరుతెన్నులు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో చిన్నగా మొదలైన ఒక మోసం… ఇప్పుడు దేశవ్యాప్తంగా పన్ను శాఖనే తలపట్టుకునేలా చేసింది. రోజూ కూలి కోసం తిరిగే పేదల ఆధార్, పాన్ కార్డులు ఏ రూపంలో దుర్వినియోగం అయ్యాయో బయటకు వచ్చిన వివరాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. అసలు వస్తువుల్లేవు… అయినా కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్టుగా చూపించి ప్రభుత్వానికి రావలసిన పన్ను మొత్తాన్ని పూర్తిగా తినేశారు.
ఆరంభం ఎంత చిన్నదో, కుంభకోణం అంత పెద్దదైంది. పది వేల రూపాయలు ఇస్తామని అమాయకులను నమ్మించి వారి ఆధార్, పాన్ కార్డులు సేకరించడం ఈ దందాకు మొదటి అడుగు. ఆ పత్రాలతో డిజిలాకర్‌లో ప్రవేశించి నకిలీ మొబైల్ నంబర్లు, నకిలీ మెయిల్‌లతో వందల సంఖ్యలో వ్యాపార నమోదు వివరాలు తెరిచారు. రిజిస్ట్రేషన్‌లో పేదల పేరు కనిపించినా… ఆ వ్యాపారం ఎక్కడ? ఏ పనికి? వారి పేరుతో ఏ లావాదేవీలు జరుగుతున్నాయో బాధితులకు మాత్రం తెలియదు. ఇక్కడి నుంచే అసలు దోపిడీ మొదలైంది. ఒక్క వస్తువూ కొనకపోయినా వంద కోట్లు ఖర్చు పెట్టాం అని నకిలీ కొనుగోలు పత్రాలు సృష్టించారు. ఆ కొనుగోలుపై పన్ను చెల్లించాం అని పత్రాల్లో చూపించి… నిజంగా మాత్రం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఇలా పత్రాల్లోనే పన్ను చెల్లించినట్టు చూపించి తాము పొందిన హక్కును పన్ను మినహాయింపు ప్రయోజనంగా వాడుకున్నారు.
తర్వాత అదే పత్రాలను మరో కంపెనీకి అమ్మినట్టుగా చూపిస్తారు. ఆ కంపెనీ మళ్లీ తదుపరి కంపెనీకి అమ్మినట్టుగా సృష్టిస్తుంది. ఈ ప్రక్రియ నాలుగు,అయిదు దశల్లో తిరుగుతూ ఒకే నకిలీ పత్రం లక్షల్లో కాదు… కోట్లలో లావాదేవీ జరిగినట్టుగా మారిపోతుంది. ప్రతి దశలో పన్ను మినహాయింపు హక్కును వాడేసుకుంటూ అసలు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని మింగేశారు. ఈ నకిలీ పత్రాలను కొనేవాళ్లు కూడా చిన్నవాళ్లు కాదు. పెద్ద వ్యాపార సంస్థలే. వారు నిజంగా చెల్లించాల్సిన పన్నును ఈ నకిలీ పత్రాల ద్వారా సున్నాకు తగ్గించుకున్నారు. ఇలా రాష్ట్ర ఖజానాకు రావలసిన డబ్బు కేటుగాళ్ల గ్యాంగ్‌కు వరపుమొత్తంగా చేరింది. రవాణా వివరాలు కూడా అంతా నకిలీయే. లేని వాహనాల నంబర్లు, జరగని రవాణాకు పత్రాలు, లేనిపోని గిడ్డంగుల చిరునామాలు… అన్నీ పచ్చి అబద్ధాలే. అమ్మకాలు జరగకపోయినా బ్యాంకు ఖాతాల్లో కోట్లు ఎలా తిరిగాయి? ఇదీ మరో జాగ్రత్తగా వేసిన గుట్టు. పది కంపెనీల పేర్లతో వచ్చిన డబ్బులను అదే బ్యాంకులో తిరుగుతూ మళ్లీ మోసగాళ్ల చేతుల్లోకే చేరేలా చేశారు. చివరికి కంపెనీలు మూసేశారు, డైరెక్టర్లు మాయం అయ్యారు… పేరు మాత్రం ఆ పేద బాధితుడిదే.
అబ్బు ఎంటర్‌ప్రైజెస్, వెంకటేశ్వర ట్రేడర్స్, అల్ ఫత్ ట్రేడర్స్ వంటి పేర్లు బయటకు పెద్దగా కనిపించినా… వాస్తవానికి ఇవన్నీ కాగితాలపైనే ఉన్న దుకాణాలు. ఒక్క గది కూడా లేని ఈ పేర్లతో మూడు రాష్ట్రాల్లో చిత్తూరు, హైదరాబాదు, బెంగళూరు ప్రాంతాల్లో మోసపు గొలుసును నిర్మించారు. కుంభకోణం పగిలిన తర్వాత అసలు విషాదం మొదలైంది. పేదల పేర్లకు కోట్ల రూపాయల పన్ను బకాయిల నోటీసులు రావడం చూసి బాధితులు హడలిపోయారు. తామెప్పుడూ వినని కంపెనీల పేర్లు, తామెప్పుడూ చూడని లావాదేవీలు. ఇవన్నీ తమ పేరున జరిగినట్టు నోటీసుల్లో రావడం ద్వారా అసలు దోపిడీ బహిర్గతమైంది. పోర్టల్‌లో ఉన్న భద్రతా లోపాలు, డిజిలాకర్‌లోని నిర్లక్ష్యం, బ్యాంకుల ధృవీకరణ విధానాల్లో ఉన్న బలహీనతలు అన్ని కలిసి ఈ గ్యాంగ్‌కు చక్కని అవకాశం ఇచ్చాయి.
ప్రస్తుతం పన్ను శాఖ, బుద్ధి విభాగం, కేంద్ర సంస్థలు అన్నీ కలిసి చిరునామాలు, పత్రాలు, బ్యాంక్ లావాదేవీలు, ఉపయోగించిన పరికరాలను పరిశీలిస్తున్నాయి. ఈ దందాకు 40 నుండి50 మందితో ఉన్న పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్టు అనుమానం. చిత్తూరు జిల్లాలోనే 450 మందికి పైగా అమాయకుల పత్రాలను దుర్వినియోగం చేశారన్న విషయం బయటపడటం కలచివేస్తోంది. ఈ కుంభకోణంలో ముఖ్య విషయం ఒక్కటే, వస్తువుల్లేవు… అయినా బిల్లులు ఉన్నాయి. బిల్లులున్నాయి కాబట్టి పన్ను మినహాయింపు ఉంది. ఆ మినహాయింపుని వాడుకొని కోట్ల రూపాయలు మింగేశారు. ఇది కేవలం మోసం కాదు… దేశ ఆర్థిక వ్యవస్థను లోపల్నుంచే బలహీనపరచే ప్రమాదకర నెట్‌వర్క్.

