ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏనుగుల సంచారంపై అటవీశాఖ నిఘా
అడవి, గ్రామాల మధ్య రక్షణ కవచంగా నిలుస్తున్న అటవీ శాఖ
మార్గాల మ్యాపింగ్ నుండి ఏఐ లైట్ల దాకా టెక్నాలజీ ఆధారిత అడవి రక్షణ వ్యవస్థ
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరు జిల్లా అడవులు శతాబ్దాలుగా ఏనుగుల గమ్యస్థానాలు. కానీ గత దశాబ్దంలో పెరిగిన వ్యవసాయ విస్తరణ, గ్రామాల పెరుగుదలతో ఏనుగుల సహజ మార్గాలు మారిపోవడంతో సంఘర్షణలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు బహుళస్థాయి వ్యూహంతో, పాత తరహా పహారాలకు ఆధునిక టెక్నాలజీని జోడించి ఒక సమగ్ర పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించారు. ఏనుగుల కదలికలను ముందుగానే గుర్తించడం కోసం మొదటగా శాఖ మొత్తం జిల్లాలోని 68 ఏనుగుల ప్రధాన సంచార మార్గాలను మ్యాప్ చేసింది. పొలాల అంచులు, కొండ దిగువలు ప్రతిచోట డ్రోన్లను వినియోగించి ప్రత్యక్ష నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్లు అందించే రియల్‌టైమ్ ఫుటేజ్ ఆధారంగా ఏనుగుల దిశ, వేగం, గుంపుల పరిమాణం వెంటనే కంట్రోల్ రూమ్‌కు చేరుతుండడంతో గ్రామాలు ముందుగానే అప్రమత్తమవుతున్నాయి. అదనంగా, గ్రామాల చుట్టుపక్కల ప్రత్యేకంగా అమర్చిన ఏఐ ఆధారిత అలర్ట్ లైట్లు ఏనుగు సమీపంలోకి రాగానే స్వయంగా స్పందించి విచిత్రమైన శబ్దాలు, గాలిలో ఎగిరే బుల్లెట్ పేలుళ్ల తరహా శబ్దాలను విడుదల చేసి ఏనుగులను అడవివైపు మళ్లిస్తున్నాయి. ఈ వ్యవస్థ గత రెండు నెలల్లో పలుమార్లు పెద్ద ప్రాణనష్టం తప్పించిందని అధికారులు తెలిపారు.
*247 మంది సిబ్బందితో రాత్రింబవళ్ళు నిఘా*
అటవీశాఖ ఏర్పాటు చేసిన పర్యవేక్షణ వ్యవస్థలో అత్యంత కీలకం మానవ వనరు. అటవీ శాఖకు చెందిన 135 మంది, మరో 112 ఔట్సొర్సింగ్ సిబ్బంది ఏనుగుల కదలికలను నిరంతరం గమనిస్తున్నారు. రాత్రిపూట పరిస్థితి అత్యంత ప్రమాదకరం. ఈ నేపథ్యంలో శాఖ అన్ని బృందాలకు నైట్ విజన్ పరికరాలు, హెడ్ల్యాంపులు, హీట్ సెన్సార్ డివైసులు అందించింది. చిన్న చిన్న కందకాల నుంచి పంట పొలాల అంచుల వరకూ రాత్రంతా పర్యవేక్షణ చేస్తూ, ఏనుగుల కదలికలకు వెంటనే స్పందించేలా సిద్ధంగా ఉన్నారు. ప్రతి రోజు ఉదయం 9:30 గంటలకు జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాసులు స్వయంగా బృందాలతో మాట్లాడి గత 12 గంటల ఫీల్డ్ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఏ ఏ గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయో, ఏ ప్రాంతాల్లో అలర్ట్ పెంచాలనే విషయాలను తక్షణమే నిర్ణయిస్తున్నారు. ఏనుగు గుంపు ఒక గ్రామం వైపు కదులుతున్నట్లు సమాచారం వచ్చిన వెంటనే సమీప బృందం అక్కడికి చేరి ఈఐ లైట్లను యాక్టివేట్ చేయడం, డ్రోన్లు ఎగరవేయడం, గ్రామ పెద్దలతో సమన్వయం చేసి ప్రజలను దూరంగా పంపడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఏనుగుల దాడులు తగ్గడం వెనుక ఇదే రాత్రింబవళ్ళు సంచరిస్తున్న బృందాల నిబద్ధత ముఖ్య కారణం.
*బురదలో చిక్కుకున్న ఏనుగును రక్షించిన అధికారులు*
యాదగిరి మండలంలో బురదలో చిక్కుకున్న ఏనుగు ఘటన చిత్తూరు అటవీశాఖ చర్యలకి మరో ప్రతీక. నీరు తాగడానికి వచ్చిన ఏనుగు అడుగు జారి లోతైన బురదలో ఇరుక్కుపోయినప్పుడు దగ్గర ప్రాంత గ్రామస్తులు సమాచారం ఇవ్వగానే అటవీశాఖ బృందం ఘటనాస్థలానికి చేరింది. మొదట మానవశక్తితో బయటకు తీయడం అసాధ్యమని అంచనా వేసి, వెంటనే తిరుపతి నుండి శిక్షణ పొందిన కుంకి ఏనుగు ప్రసాద్ ను తీసుకువచ్చారు. గంటల పాటు సాగిన రక్షణ చర్యలో ప్రసాద్ తన శక్తితో చిక్కుకున్న ఏనుగును పైకి లాగగానే అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే దానికి అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి స్థిరపడిన తరువాత, మరింత చికిత్స కోసం తిరుపతి జూకు తరలించారు. ఈ రక్షణ చర్యలో పాల్గొన్న సిబ్బంది బురదలో మునిగిపోయే ప్రమాదాన్ని కూడా తీసుకుని ఏనుగును తప్పక కాపాడాలన్న తపనతో పనిచేశారు. ఈ ప్రక్రియ అటవీశాఖ యొక్క మానవత్వం, నిబద్ధత, మరియు వృత్తి పరమైన ధైర్యానికి నిదర్శనంగా నిలిచింది.
గంగ 5 ఏఐ నిఘా కెమరా
గంగ 6 డ్రోన్ లతో పర్యవేక్షణ
గంగ 7 రాత్రి ఏనుగును వెంబడిస్తున్న సిబ్బంది
గంగ 8 ఏనుగుల సంచారం

