13, డిసెంబర్ 2025, శనివారం

కుప్పం నియోజకవర్గ సాగునీటికి జలకళ

పాలారు నదిపై రూ. 53.55 కోట్లతో చెక్ డ్యాముల నిర్వహణ 

ఆమోదము తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం 

కుప్పం నుండి వీకోట వరకు పెరగనున్న భూగర్భ జలాలు 
16,544 ఎకరాల భూములకు తీరనున్న సాగునీటి సమస్య

( చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ ) 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సాగునీటి భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుప్పం పరిధిలోని పాలారు నదిపై చెక్‌డ్యామ్‌ల పునర్నిర్మాణం, పునరుద్ధరణ  నిర్వహణ పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో వర్షాలపై ఆధారపడే కుప్పం ప్రాంత వ్యవసాయానికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. నీటి వనరుల శాఖ ప్రతిపాదనల నేపధ్యంలో పాలారు నదిపై 17 చెక్‌డ్యామ్‌ల పునర్నిర్మాణానికి రూ.53.55 కోట్లకు ప్రభుత్వం పరిపాలనా ఆమోదం ఇచ్చింది. దీంతో దశాబ్దాల క్రితం నిర్మితమై, కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన ఈ చెక్‌డ్యామ్‌లు తిరిగి ఆధునీకరణతో ప్రాణం పోసుకోనున్నాయి. అదనంగా, ఇదే నదిపై ఉన్న మరికొన్ని చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేపట్టేందుకు అదనపు నిధులను కూడా ప్రభుత్వం కేటాయించింది. దీంతో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది.ముఖ్యంగా శాంతిపురం, కుప్పం, రామకుప్పం, వి.కోట మండలాల పరిధిలోని చెక్‌డ్యామ్‌లను కేంద్రంగా చేసుకొని ఈ ప్రాజెక్టులు అమలుకానున్నాయి. ఈ నాలుగు మండలాలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతాలు కావడంతో, నీటి లభ్యత పెరగడం రైతులకు ఎంతో మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి సాగునీటి భద్రతను శాశ్వతంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పాలేరు నదిపై చెక్‌ డ్యాంల నిర్మాణం, పునర్నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణకు సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం కుప్పం ప్రాంత రైతులకు వరంలా మారనుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో చేపట్టనున్న 506 అభివృద్ధి పనులకు రూ. 9,500 కోట్లకు ఆమోదం తెలుపగా, అందులో కుప్పం నియోజకవర్గంలోని పాలేరు నదిపై చేపట్టే నీటిపారుదల పనులు ముఖ్య భాగంగా నిలిచాయి. పాలేరు ప్రవాహాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని సాగునీటి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఈ పనులను ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోంది. పాలేరు నదిపై ఇప్పటికే ఉన్న చెక్‌ డ్యాంల నిర్వహణకు అనుమతులు ఇవ్వడం ద్వారా, వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాల మట్టాన్ని పెంచే అవకాశం ఏర్పడనుంది. ముఖ్యంగా కుప్పం, శాంతిపురం, రామకుప్పం, వి.కోట మండలాల పరిధిలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం కావడంతో, ఈ నీటి వసతులు రైతుల ఆశలకు ఊపిరిపోస్తున్నాయి. ఇదే నదిపై గత జూన్ నెలలోనే కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలేరు నదిపై 17 చెక్‌ డ్యాంల పునర్నిర్మాణానికి రూ. 53.55 కోట్లకు పరిపాలనా ఆమోదం లభించింది. అదనంగా, మరో 4 చెక్‌ డ్యాంల మరమ్మతులకు రూ. 10.24 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నిర్మాణాలు తిరిగి ప్రాణం పోసుకుంటే, సాగునీటి సమస్యలు గణనీయంగా తగ్గే పరిస్థితి ఏర్పడనుంది. అంతేకాకుండా స్వర్ణ రోడ్ మ్యాప్ టు కుప్పం 2029 కార్యక్రమంలో భాగంగా గుడుపల్లె, శాంతిపురం, కుప్పం మండలాల్లోని 51 మైనర్ ఇరిగేషన్ చెరువుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు రూ. 14.22 కోట్లకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. చెరువుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, వేసవిలో కూడా వ్యవసాయానికి తగినంత నీరు అందే అవకాశం ఉంది. ఈ సమగ్ర జలవనరుల అభివృద్ధి పనుల ద్వారా దాదాపు 16,544.76 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. వర్షాలపై ఆధారపడే కుప్పం ప్రాంత వ్యవసాయానికి ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు. చెక్‌ డ్యాంలు, చెరువుల పునరుద్ధరణతో పాటు భూగర్భ జలాల పెంపు జరగడం వల్ల తాగునీటి సమస్య కూడా కొంతమేర తీరే అవకాశం ఉంది. పాలేరు నదిపై చేపట్టనున్న ఈ పనులు కేవలం నిర్మాణాలకే పరిమితం కాకుండా, కుప్పం నియోజకవర్గ భవిష్యత్‌ను మార్చే దిశగా కీలక పాత్ర పోషించనున్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, కుప్పం ప్రాంతంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ చర్య ఎంతగానో దోహదపడుతుందని ప్రజలు భావిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *