30, డిసెంబర్ 2025, మంగళవారం

2025లో నేరాలపై ఉక్కుపాదం

చిత్తూరు జిల్లాలో 26 శాతం తగ్గిన నేరాలు

మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణలో కీలక పురోగతి

సాంకేతికత, కమ్యూనిటీ పోలీసింగ్‌తో శాంతి భద్రతలు పటిష్టం

విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ తుషార్ దూడి వెల్లడి


చిత్తూరు, డిసెంబర్ 30 (ఆంధ్రప్రభ బ్యూరో) :
చిత్తూరు జిల్లాలో 2025వ సంవత్సరంలో నేరాల నియంత్రణలో పోలీసులు గణనీయమైన ఫలితాలు సాధించారని జిల్లా పోలీసు అధికారి తుషార్ దూడి వెల్లడించారు. మంగళవారం చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన 2025 సంవత్సరంలో జిల్లా పోలీసు శాఖ చేపట్టిన కార్యాచరణ, నేరాల అదుపులో తీసుకున్న చర్యలు, సాధించిన ఫలితాలను వివరించారు. గత ఏడాది గణాంకాలతో పోల్చి చూపుతూ వివరించారు. జిల్లాలో నమోదైన మొత్తం నేరాలు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గినట్లు ఎస్పీ వెల్లడించారు. 2024 సంవత్సరంలో జిల్లాలో మొత్తం 7,034 నేరాలు నమోదు కాగా, 2025లో అవి 5,216కు తగ్గాయని తెలిపారు. ఇది సుమారు 26 శాతం నేరాల తగ్గుదలగా పేర్కొన్నారు. ఈ ఫలితానికి ప్రధాన కారణాలు కమ్యూనిటీ పోలీసింగ్‌ను పటిష్టం చేయడం, ప్రజల సహకారంతో పనిచేయడం, విజిబుల్ పోలీసింగ్‌ను పెంచడం, నేరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడమేనని ఎస్పీ స్పష్టం చేశారు.

చిత్తూరు జిల్లా పోలీసు వ్యవస్థ ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలపై ముందుగానే స్పందించడం, సమస్యలను ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ సామరస్యంగా పరిష్కరించడం వల్ల జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి స్థిరంగా కొనసాగుతోందన్నారు. ముఖ్యంగా సున్నితమైన అంశాల్లో విజిబుల్ పోలీసింగ్, ప్రివెంటివ్ పోలీసింగ్ కీలక పాత్ర పోషించిందన్నారు. మహిళల భద్రతకు జిల్లా పోలీసులు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని ఎస్పీ వివరించారు. మహిళలు, విద్యార్థినీలను చట్టపరంగా చైతన్యపరచేందుకు మహిళా పోలీసులతో తరచూ అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. గుడ్ టచ్  బ్యాడ్ టచ్ అంశాలపై పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం ద్వారా బాలికల్లో ధైర్యాన్ని పెంచామని తెలిపారు. అలాగే సైబర్ నేరాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో మహిళల భద్రతకు పెద్దపీట వేసే దిశగా మొత్తం ఆరు శక్తి బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు. వీటిలో చిత్తూరు సబ్ డివిజన్‌కు మూడు బృందాలు, నగరి, కుప్పం, పలమనేరు ప్రాంతాలకు ఒక్కొక్క బృందాన్ని కేటాయించామని తెలిపారు. ఈ బృందాలు మహిళలకు సంబంధించిన ఫిర్యాదులకు తక్షణమే స్పందిస్తూ, అవసరమైన చోట ప్రత్యక్షంగా వెళ్లి రక్షణ కల్పిస్తున్నాయని చెప్పారు. శక్తి యాప్ ద్వారా వచ్చిన కాల్స్‌కు వేగంగా స్పందించడం వల్ల మహిళల్లో పోలీసులపై నమ్మకం పెరిగిందన్నారు.

సైబర్ నేరాల నియంత్రణలో కూడా జిల్లా పోలీసులు సమర్థంగా పనిచేశారని ఎస్పీ తెలిపారు. 2025 సంవత్సరంలో సైబర్ మోసాలకు గురైన బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి, మొత్తం రూ.68 లక్షల 44 వేల 59 రూపాయలను రికవరీ చేసి బాధితులకు అందజేశామని చెప్పారు. అలాగే మొబైల్ ఫోన్లు మిస్సింగ్ లేదా చోరీకి గురైన కేసుల్లో సీఈఐఆర్ వ్యవస్థ ద్వారా మూడు దశల్లో మొత్తం 1,021 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్ల 4 లక్షల 20 వేలుగా అంచనా వేశారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ తుషార్ దూడి వివరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ ధారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. మైనర్ డ్రైవింగ్‌పై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. చిత్తూరు పట్టణంలో మైనర్లు నడుపుతున్న 100 వాహనాలను సీజ్ చేసి, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి రూ.1 లక్ష 3 వేల 500 రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 2,772 మందిని పట్టుకుని ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.2 కోట్ల 77 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు.

నేరాల విభాగాల వారీగా గణాంకాలను కూడా ఎస్పీ వివరించారు. ఆస్తి నేరాలు స్వల్పంగా తగ్గాయని, మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. 2024లో 507గా ఉన్న మహిళలపై నేరాలు 2025లో 443కు తగ్గాయని చెప్పారు. ఆర్థిక నేరాలు, సైబర్ నేరాల్లో కూడా తగ్గుదల నమోదైందన్నారు. అయితే రోడ్డు ప్రమాదాల సంఖ్య స్వల్పంగా పెరిగినప్పటికీ, మరణాల సంఖ్య తగ్గడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు. ప్రాపర్టీ నేరాల్లో రికవరీ శాతం 48 శాతం నుంచి 73 శాతానికి పెరగడం పోలీసుల దర్యాప్తు సామర్థ్యాన్ని చాటుతోందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారని ఎస్పీ తెలిపారు. 2025 సంవత్సరంలో ఐదు కేసులు నమోదు చేసి 12 మంది ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు, మేస్త్రీలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 1,523 కిలోల బరువు గల 57 ఎర్రచందనం దుంగలు, ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు రూ.83.2 లక్షలుగా అంచనా వేసినట్లు తెలిపారు. ముఖ్యమైన కేసుల ఛేదనలో జిల్లా పోలీసులు ప్రత్యేకంగా నిలిచారని ఎస్పీ వివరించారు. బంగారుపాళ్యంలో వృద్ధురాలి హత్య కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడం, చిత్తూరు పట్టణంలో జరిగిన భారీ దొంగతనాల కేసుల్లో కోట్ల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం, అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను అరెస్ట్ చేయడం వంటి కేసులను ప్రస్తావించారు. దారి దోపిడీ, చైన్ స్నాచింగ్, పేకాట, డ్రగ్స్ వ్యాపారం, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో దోషులకు జీవిత ఖైదు, 20 సంవత్సరాల జైలు శిక్షలు పడేలా దర్యాప్తు చేయడంలో జిల్లా పోలీసులు విజయవంతమయ్యారని ఎస్పీ పేర్కొన్నారు. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా కోర్టుల్లో పటిష్టమైన ఆధారాలు సమర్పించామని చెప్పారు. ఇది సమాజంలో భయరహిత వాతావరణాన్ని నెలకొల్పడంలో దోహదపడుతుందన్నారు. మానవతా పోలీసింగ్‌లో భాగంగా జిల్లా పోలీసులు అనేక సందర్భాల్లో ప్రజల ప్రాణాలను కాపాడారని ఎస్పీ తెలిపారు. ఆత్మహత్యకు యత్నించిన మహిళను సకాలంలో గుర్తించి రక్షించడం, నదిలో ప్రమాదవశాత్తు పడిపోయిన వ్యక్తిని ప్రాణాలతో బయటకు తీయడం, మతిస్థిమితం లేని మహిళను గుర్తించి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడం వంటి ఘటనలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ చర్యలు పోలీసుల మానవీయ కోణాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.

డయల్ 112 సేవలపై కూడా ఎస్పీ వివరించారు. 2025 సంవత్సరంలో జిల్లాలో డయల్ 112కు మొత్తం 12,474 కాల్స్ వచ్చాయని తెలిపారు. వాటిలో అత్యవసర పరిస్థితులకు సంబంధించి పోలీసు బృందాలు వేగంగా స్పందించి, అర్బన్ ప్రాంతాల్లో సగటున 5 నుంచి 8 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 17 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. డయల్ 112కు వచ్చిన కాల్స్‌లో అనేక కేసులు నమోదు చేసి నేరాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సాంకేతికత వినియోగంలో చిత్తూరు జిల్లా ముందంజలో ఉందని ఎస్పీ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2,406 సీసీ కెమెరాలు నేరాలను పసిగట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, డ్రోన్లు, ఫాల్కన్ వాహనాలు, మినీ ఫాల్కన్ వంటి ఆధునిక పరికరాలను వినియోగిస్తూ నేర నియంత్రణను మరింత పటిష్టం చేశామని చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా అనేక కేసులను త్వరితగతిన ఛేదించగలిగామని పేర్కొన్నారు. ప్రజల సహకారం లేకుండా పోలీసింగ్ విజయవంతం కాదని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులతో కలిసి పనిచేస్తేనే నేరాలను పూర్తిగా నియంత్రించగలమని, చిత్తూరు జిల్లాను మరింత సురక్షితమైన జిల్లాగా మార్చడం సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2026లోనూ ఇదే ఉత్సాహంతో, మరింత కఠిన చర్యలతో ప్రజల భద్రతకు పోలీసు శాఖ కట్టుబడి ఎస్పీ తుషార్ దూడి స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ డా. తరుణ్ పహ్వా, అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)  ఎస్.ఆర్. రాజశేఖర రాజు, డీఎస్పీ, చిత్తూరు డీఎస్పీ టి. సాయినాథ్,  చిత్తూరు టౌన్ ఇన్స్పెక్టర్  మహేశ్వర, టూ టౌన్ సీఐ నెట్టి కంటయ్య,
ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్  మురళీ మోహన్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్  మనోహర్ తదితరులు పాల్గొన్నారు.




అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *