24, డిసెంబర్ 2025, బుధవారం

హౌసింగ్ నిర్మాణంలో చిత్తూరు జిల్లా టాప్

సొంతింటి కల నెరవేరుస్తూ జిల్లాకు రాష్ట్రంలోనే తొలి స్థానం

జిల్లాకు మరో  25,592 ఇళ్ళు అవసరమని సర్వేలో వెల్లడి 

జిల్లాకు కొత్తగా  2472 పీఎంఏవై ఇల్లు మంజూరు


(ఆంధ్రప్రభ బ్యూరో ,చిత్తూరు)

చిత్తూరు జిల్లా హౌసింగ్ నిర్మాణంలో రాష్ట్రవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం జిల్లా ప్రజలకు గర్వకారణంగా మారింది. సొంత ఇల్లు లేని నిరుపేదల కలను నిజం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పక్కా గృహాల నిర్మాణం చిత్తూరు జిల్లాలో వేగంగా, ఫలప్రదంగా కొనసాగుతోంది. గణాంకాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. జిల్లాకు మంజూరైన ఇళ్లలో ఇప్పటికే 77 శాతం పూర్తవడం విశేషం. జిల్లా మొత్తానికి 72,767 పక్కా గృహాలు మంజూరవ్వగా, ఇప్పటివరకు 53,466 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇందుకు గాను ప్రభుత్వం 1,350 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించగా, ఇప్పటికే 1,033 కోట్ల రూపాయలను వ్యయం చేయడం జరిగింది. ఇంకా 3,387 ఇళ్లు ప్రారంభం కాలేదు. 739 ఇళ్లు పునాది దశలో, 9,642 ఇళ్లు గోడల దశలో, 46 ఇళ్లు పైకప్పు, గోడల దశలో ఉండగా, 1,549 ఇళ్లకు పైకప్పు కూడా పూర్తయ్యింది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 77 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తవడం రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాను ముందంజలో నిలిపింది.


నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే కుప్పం నియోజకవర్గానికి 7,436 ఇళ్లు మంజూరవ్వగా, ఇప్పటివరకు 5,096 ఇళ్లు పూర్తయ్యాయి. 403 ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. చిత్తూరు నియోజకవర్గానికి 9,569 ఇళ్లు మంజూరవ్వగా, 6,218 ఇళ్లు పూర్తయ్యాయి. ప్రారంభం కాని ఇళ్లలో చిత్తూరు నియోజకవర్గమే 1,435 ఇళ్లతో అగ్రస్థానంలో ఉంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి 11,030 ఇళ్లు మంజూరవ్వగా, 8,180 ఇళ్లు పూర్తయ్యాయి. నగరి నియోజకవర్గానికి 5,948 ఇళ్లు మంజూరై 4,326 ఇళ్లు పూర్తయ్యాయి. పలమనేరు నియోజకవర్గానికి 13,018 ఇళ్లు మంజూరవ్వగా, 9,558 ఇళ్లు పూర్తయ్యాయి. పుంగనూరు నియోజకవర్గానికి జిల్లాలోనే అత్యధికంగా 15,637 ఇళ్లు మంజూరవ్వగా, ఇప్పటివరకు 12,008 ఇళ్లు పూర్తయ్యాయి. పూతలపట్టు నియోజకవర్గానికి 10,125 ఇళ్లు మంజూరై 7,973 ఇళ్లు పూర్తయ్యాయి. ప్రారంభం కాని ఇళ్లలో పూతలపట్టు నియోజకవర్గం 102 ఇళ్లతో చివరి స్థానంలో ఉంది. ప్రభుత్వం ఒక్కో పక్కా గృహానికి 1.80 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ పేదల సొంతింటి కలను సాకారం చేస్తోంది. జిల్లాలో అత్యధికంగా పుంగనూరు నియోజకవర్గానికి ఇళ్లు మంజూరవ్వడం, కనిష్టంగా నగరి నియోజకవర్గానికి మంజూరవ్వడం గమనార్హం. 

జిల్లాకు మరో 25,592 ఇళ్ళు అవసరం 

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద చిత్తూరు జిల్లాకు 25,592 ఇళ్లు అవసరమని ప్రాథమిక సర్వేలో తేలింది. ఇందులో కుప్పానికి 6,988, చిత్తూరుకు 671, గంగాధర నెల్లూరుకు 2,319, నగరికి 1,332, పలమనేరుకు 9,651, పుంగనూరుకు 2,726, పూతలపట్టుకు 1,905 ఇళ్లు అవసరమని గుర్తించారు. ఈ అవసరాలకు అనుగుణంగా దశలవారీగా చర్యలు చేపడుతున్నారు. 

చిత్తూరు జిల్లా టాప్ 

హౌసింగ్ ప్రగతిని పరిశీలిస్తే మిగిలిన 26 జిల్లాలతో పోలిస్తే చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉందని హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్. సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఇప్పటివరకు హౌసింగ్ లబ్ధిదారులకు 72,59,450 బస్తాల సిమెంట్, 14,78,420 ఎంపీసీల ఇసుకను సరఫరా చేసినట్లు తెలిపారు. 2024–25 సంవత్సరానికి 1,873 గృహాలు, 2025–26 సంవత్సరానికి 599 గృహాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరయ్యాయని వివరించారు. హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నీటి సరఫరా కోసం ప్రజా ఆరోగ్య శాఖకు 20 కోట్ల రూపాయలు, గ్రామీణ నీటి సరఫరా విభాగానికి 82 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. విద్యుత్ మౌలిక వసతుల కోసం విద్యుత్ శాఖకు అవసరమైన నిధులు విడుదల చేశారు. జిల్లాలోని 1,039 లేఅవుట్లలో 847 లేఅవుట్లకు ఇప్పటికే 102 కోట్ల రూపాయల వ్యయంతో నీటి వసతులు కల్పించారు. మిగిలిన లేఅవుట్లలో పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. సిమెంట్ రోడ్లు, కాలువలు, విద్యుత్ వసతుల కోసం మొత్తం 1,439 కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా చూస్తే, చిత్తూరు జిల్లా హౌసింగ్ నిర్మాణంలో సాధించిన ఈ ఘనత ప్రభుత్వ సంకల్పానికి, అధికారుల కృషికి, ప్రజల సహకారానికి నిదర్శనంగా నిలుస్తోంది. పేదల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ, సొంతింటి కలను నిజం చేస్తూ చిత్తూరు జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా మారుతోంది.


జిల్లాకు కొత్తగా 2472 ఇళ్ళు మంజూరు 

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద చిత్తూరు జిల్లాకు కొత్తగా 2,472 ఇల్లు మంజూరయ్యాయి. చిత్తూరు మున్సిపాలిటీకి 828, కుప్పం మున్సిపాలిటీకి 575, నగరి మున్సిపాలిటీకి 516, పుంగనూరు మున్సిపాలిటీకి 115, పలమనేరు మున్సిపాలిటీకి 114 ఇల్లు మంజూరయ్యాయి. అలాగే బైరెడ్డిపల్లికి 60, గంగవరంకు 85, పలమనేరుకు 60, పెద్దపంగానికి 110 వీకోటకు 9 ఇళ్ళు మంజూరయ్యాయి. మొత్తం మీద పలమనేరు నియోజకవర్గానికి 438 ఇళ్ళు మంజూరు అయ్యాయి. ఈ ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించడానికి ఆలస్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 


గంగ 1 జీడీ నెల్లూరు మండలం నల్లరాళ్ళపల్లిలో నిర్మాణంలో ఉన్న హౌసింగ్ కాలనీ ఇండ్లు 

గంగ 2 పెనుమూరు మండలం మోపిరెడ్డిపల్లెలో ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్న హౌసింగ్ పీడీ సుబ్రహ్మణ్యం


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *