కఠినత్వం, వేగం, విజయాలు పెరిగాయి…
చిత్తూరు గాంధీ రోడ్డు దోపిడీలో పోలీసుల చాకచక్యం
అదే సమయంలో వెంటాడుతున్న వైఫల్యాలు
శాంతిభద్రతల పోరాటంలో ముందడుగు
ప్రమాదాల నిలయంగా మొగలి ఘాట్
అంబేద్కర్ విగ్రహం కాల్చివేత కేసులు దొరకని నిందితులు
చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం – 2025
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగానికి 2025 ఏడాది సాధారణ సంవత్సరంగా కాకుండా ఒక మలుపు తిరిగిన కీలక కాలంగా నిలిచింది. కొత్త నాయకత్వం, నేర నియంత్రణలో కఠిన నిర్ణయాలు, మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి, టెక్నాలజీ వినియోగంలో పురోగతి ఇవన్నీ కలసి జిల్లా పోలీస్ శాఖ పనితీరును కొత్త దిశలో నడిపించాయి. అయితే, ఈ విజయాల మధ్య కొన్ని వైఫల్యాలు, ఆలస్యాలు, నిర్లక్ష్యాలపై వచ్చిన విమర్శలు కూడా అంతే బలంగా వినిపించాయి. 2025లో చిత్తూరు జిల్లా పోలీస్ వ్యవస్థ పనితీరుకు అద్దం పట్టే పలు సంఘటనలు జరిగాయి.
కొత్త ఎస్పీ… కొత్త దిశ
2025లో చిత్తూరు జిల్లా పోలీస్ శాఖలో చోటుచేసుకున్న అతిపెద్ద మార్పు జిల్లా ఎస్పీ మార్పు. సెప్టెంబర్ నెలలో 2018 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి తుషార్ డూడి జిల్లా 68వ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ముందు పనిచేసిన ఎస్పీ మణికంఠ చందోలు బదిలీ కావడంతో జిల్లా పోలీస్ వ్యవస్థ కొత్త నాయకత్వాన్ని చూసింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎస్పీ తుషార్ డూడి తన ప్రాధాన్యతలను స్పష్టంగా ప్రకటించారు. గంజాయి రహిత జిల్లా, మహిళల భద్రత, కమ్యూనిటీ పోలీసింగ్ – ఇవే తన కార్యాచరణలో మూడు స్తంభాలని పేర్కొన్నారు. మాటలకే పరిమితం కాకుండా, ఆచరణలోకి తీసుకురావడానికి తీసుకున్న చర్యలే 2025 పోలీస్ పనితీరుకు పునాది అయ్యాయి.
నేర నియంత్రణలో ఉక్కుపాదం
2025లో జిల్లా పోలీస్ శాఖ నేర నియంత్రణలో గణనీయమైన మార్పులు చేసింది. ముఖ్యంగా డ్రగ్స్, రౌడీయిజం, హైవే నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గంజాయి రవాణాను అడ్డుకునేందుకు 120 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, రాత్రి పగలు తేడా లేకుండా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ చర్యల ఫలితంగా జిల్లాలో గంజాయి నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ పడిందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో, నేరాలు పునరావృతం చేస్తున్న రౌడీ షీటర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించడం సంచలన నిర్ణయంగా మారింది. 153 మందికి పైగా రౌడీ షీటర్లను ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడం ద్వారా భయం కాదు – చట్టం పనిచేస్తుంది అనే సంకేతాన్ని పోలీసులు స్పష్టంగా ఇచ్చారు.
హైవే నేరాలపై మెరుపు దాడులు
2025లో ఆగస్టు నెలలో నగరి సబ్ డివిజన్ పరిధిలో జరిగిన వరుస హైవే దొంగతనాలు ప్రజల్లో భయాందోళనలకు దారి తీశాయి. అయితే పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకుని ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఫలితంగా హైవే రాబరీ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి, లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదన జిల్లా పోలీసుల దర్యాప్తు సామర్థ్యాన్ని చాటింది. 2025లో జిల్లాను ఉలిక్కిపడేలా చేసిన ఘటన మురకంబట్టు గ్యాంగ్ రేప్ కేసు. సెప్టెంబర్ 25న జరిగిన ఈ దారుణ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం పోలీసుల ముందున్న అతిపెద్ద పరీక్షగా మారింది. పోలీసులు ప్రత్యేక బృందాలతో మూడు రాష్ట్రాల్లో వేటాడి నిందితులను అరెస్ట్ చేయడం, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో) కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం ప్రశంసలు పొందింది. ఈ కేసులో చూపిన వేగం, సమన్వయం, దర్యాప్తు తీరును మహిళా సంఘాలు కూడా అభినందించాయి. అలాగే అక్టోబర్‌లో కర్ణాటకకు చెందిన పేరుమోసిన దొంగ హనుమంతప్పను అరెస్ట్ చేసి రూ. 25 లక్షల విలువైన బంగారు నగలను రికవరీ చేయడం జిల్లా పోలీసులకు మరో విజయంగా నిలిచింది.
గాంధీ రోడ్డు దోపిడీ – క్విక్ రెస్పాన్స్‌కు నిదర్శనం
చిత్తూరు నగరంలోని గాంధీ రోడ్డులో పట్టపగలే జరిగిన దోపిడీ ప్రయత్నం నగరాన్ని షాక్‌కు గురిచేసింది. అయితే ఈ ఘటన పోలీస్ వ్యవస్థ వేగాన్ని కూడా చాటింది. సమాచారం అందిన వెంటనే నగరమంతా రెడ్ అలర్ట్ ప్రకటించి, సీసీటీవీ ఫుటేజీ, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిందితులను కొద్ది గంటల్లోనే అరెస్ట్ చేశారు. అపహరించిన సొత్తును పూర్తిగా రికవరీ చేయడంతో ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరిగింది.
ప్రమాదాల మృత్యు పాశం – పలమనేరు ఘాట్
విజయాల మధ్య 2025లో జిల్లాను వెంటాడిన చేదు నిజం రోడ్డు ప్రమాదాలు. ముఖ్యంగా పలమనేరు ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదాలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఒకే నెలలో మూడు ఘోర ప్రమాదాల్లో సుమారు 10 మంది ప్రాణాలు కోల్పోవడం జిల్లాను కలచివేసింది. పోలీసులు స్పీడ్ గన్‌లు, చెక్‌పోస్టులు, రేడియం బోర్డులు, హైవే మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ, భౌగోళిక పరిస్థితులు, డ్రైవర్ల నిర్లక్ష్యం, రాత్రి సమయాల్లో వెలుతురు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇక్కడ పోలీస్ చర్యలతో పాటు రహదారి అభివృద్ధి, వాహన యజమానుల బాధ్యత కూడా అవసరమనే అభిప్రాయం వినిపిస్తోంది.
క్రమశిక్షణ… కానీ ప్రశ్నలు
2025లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కొందరు ఎస్సైలు, కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం పోలీస్ శాఖలో క్రమశిక్షణకు నిదర్శనంగా నిలిచింది. అదే సమయంలో, కొన్ని మారుమూల పోలీస్ స్టేషన్లలో రాజకీయ ఒత్తిళ్లు ఇంకా కొనసాగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
అవార్డులు – ప్రోత్సాహం
క్లిష్ట కేసులు ఛేదించిన అధికారులకు నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందించడం పోలీస్ బృందంలో ఉత్సాహాన్ని పెంచింది. డిసెంబర్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 139 మంది కానిస్టేబుళ్లకు ఇచ్చిన దిశానిర్దేశం భవిష్యత్ పోలీసింగ్‌కు పునాది వేసింది.
అంబేద్కర్ విగ్రహం కాల్చివేత – పెద్ద మచ్చ
ఈ అన్ని విజయాల మధ్య వెదురుకుప్పం మండలంలో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం కాల్చివేత కేసు పోలీస్ శాఖపై పెద్ద మచ్చగా మిగిలింది. నెలలు గడిచినా నిందితులను అరెస్ట్ చేయలేకపోవడం దళిత సంఘాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. “నేరస్తులపై కఠిన చర్యలు ఎక్కడ?” అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లభించలేదు. ఇది 2025 పోలీస్ పనితీరులో అత్యంత విమర్శనీయ అంశంగా నిలిచింది.
ముగింపు
2025లో చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం నేర నియంత్రణలో, మహిళా భద్రతలో, దర్యాప్తు వేగంలో స్పష్టమైన పురోగతి సాధించింది. గాంధీ రోడ్డులో దోపిడీ కేసు ఛేదన, మురకంబట్టు గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తు ఇందుకు నిదర్శనాలు. అదే సమయంలో పలమనేరు ఘాట్ ప్రమాదాలు, అంబేద్కర్ విగ్రహం కేసులో జాప్యం లాంటి అంశాలు పోలీస్ వ్యవస్థ ముందున్న సవాళ్లను గుర్తు చేస్తున్నాయి. 2025 ఒక పాఠం అయితే, 2026 ఆ పాఠాన్ని ఆచరణలో పెట్టే సంవత్సరం కావాల్సిన అవసరం ఉందన్నది ప్రజల ఆశ.
గంగ 2 జిల్లా నూతన పోలీసు బాస్ తుషార్ దూడి
గంగ 3 మొగిలి ఘాట్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం
గంగ 4 చిత్తూరు గాంధీ రోడ్ లో వికటించిన దోపిడీ
గంగ 5 అత్యాచార నిందితులను రోడ్డుపై నడిపిస్తున్న పోలీసులు
గంగ 6 వెదురుకుప్పంలో అంబేద్కర్ విగ్రహం కాల్చివేత

