1, డిసెంబర్ 2025, సోమవారం

చిరుత పులుల దాడులతో వణుకుతున్న ఐరాల, తవణంపల్లి గ్రామాలు

నెల రోజులలో వరుసగా నాలుగు గ్రామాలలో ఆవులపై దాడి

 రెండు రోజుల కిందట పుత్రమద్ది గ్రామంలో మహిళపై రెడ్ చిరుత పులి పిల్లల దాడి

 అడవికి కూతవేటు దూరంలో ఉన్న పుత్రమద్ది గ్రామంలో రెండుసార్లు దాడులు 

ప్రాణాలు నారి చేతుల్లో పట్టుకుని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్న గ్రామస్తులు

*చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.*

చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం, తవణంపల్లి మండలాలు చిరుత పులుల సంచారంతో గత నెలరోజులుగా భయంతో వణికిపోతున్నాయి. పశువులపై వరుసగా జరిగే దాడులు, తాజాగా ఒక మహిళపై కూడా దూకుడు చూపించడం గ్రామాల్లో ఆందోళనను మరింతగా పెంచింది. అడవికి ఆనుకుని ఉన్న పుత్రమద్ది గ్రామం పరిసరాలు ఇప్పుడు భయం, అనిశ్చితి, అప్రమత్తతల ముసుగులో కూరుకుపోయాయి. గ్రామస్తులు వ్యవసాయ పనులకు వెళ్లడం కూడా మానుకుంటున్నారు. ఉన్న పశువులను పులుల భయంతో అమ్ముకుంటున్నారు. పొద్దుపోతే గ్రామ భయముతో వణికి పోతుంది. ఎక్కడ చిరుత పులి, వాటి పిల్లలు దాడి చేస్తాయోనని భయంతో వలికి పోతున్నారు.

మొదట మూడు వేర్వేరు గ్రామాల్లో చిరుత పులి దాడి చేసి మూడు ఆవులను చంపింది. కొద్ది కాలంలోనే తవణంపల్లి మండలం వెంగంపల్లిలో మరో ఆవును మృగం పొట్టన పెట్టుకోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లారు. నెల క్రితం పుత్రమద్దిలో ఒక ఆవును చంపిన చిరుత, వారం తిరగక ముందే కాణిపాకం సమీపంలోని పండ్రంపల్లిలో మరో ఆవు దూడపై దాడి చేసింది. గత నెల 13న ఐరాల మండలం గుండ్లపల్లిలో మరో ఘటన చోటుచేసుకోగా, ఈ నెల 15న తవణంపల్లిలో ఆవు మృతి చెందింది. ప్రజలు కొంత ఊరట పడతారేమో అనుకునేలోపే రెండు రోజుల కిందట పుత్రమద్దిలో ఓ మహిళపై రెండు చిరుత పులి పిల్లలు దాడి చేయడంతో గ్రామం ఒక్కసారిగా కుదేలైంది. పశువులను మేపుతున్న ఆమెకు దగ్గర్లో తాగునీటి కోసం పొలాల్లోకి వచ్చిన పిల్ల చిరుతలు కనిపించాయి. మహిళ భయంతో అలికిడి చేసిన వెంటనే అవి దూకి గోర్లతో ఆమెను దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యింది. ఈ సంఘటనతో గ్రామంలో భయం మరింతగా పెరిగింది. ఈ విషయాన్ని గ్రామస్తులు వెంటనే అటవీశాఖకు తెలియజేయగా సోమవారం డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కిషోర్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లావణ్య సిబ్బందితో దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ కనిపించిన పాద ముద్రలు, మరికొన్ని ఆనవాళ్లను సేకరించి రెండు చిరుత పులి పిల్లలు సంచరించినట్లు గుర్తించారు. ఇటీవల పశువులపై జరిగిన వరుస దాడులన్నింటినీ కూడా అధికారులు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు రేంజ్ ఆఫీసర్ కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు.

పుత్రమద్ది గ్రామం అడవికి కూత వేటు దూరంలో ఉండటమే ఈ తరహా దాడులకు ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు. గ్రామం చుట్టూ దట్టంగా ఉన్న మామిడి తోటలు చిరుతలకు దాచుకోవడానికి అనువైన ప్రదేశాలుగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకసారి ఆవును చంపిన చిరుత, ఇప్పుడు పిల్లలతో కలిసి మళ్లీ మహిళపై దాడి చేయడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. రాత్రిళ్ళు బయటకు రావడం లేదు. పొలాలకెళ్లడానికే రైతులు జంకుతున్నారు. గ్రామమంతా ఏ నిమిషాన చిరుత గ్రామంలోకి దిగుతుందో? అన్న భయంతో ఉలిక్కిపడుతోంది. గ్రామాన్ని ఆనుకుని ఉన్న అడవిలో కనీసం రెండు చిరుత పులులు ఉన్నట్లు అటవీ సిబ్బంది అంచనా వేస్తున్నారు. చిరుత ఒకేసారి రెండు నుంచి నాలుగు పిల్లలను పెట్టే అవకాశం ఉండటంతో ఇంకా రెండు పిల్లలు కూడా అడవిలోనే ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, గత పది రోజుల క్రితం అటవీ పనివారికి చెందిన నాలుగు కుక్కలను కూడా చిరుత పులి చంపిందని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా చిరుత పులి, పిల్లల గురించి, వాటి సంచారంపై చర్చే. ప్రజలు తీవ్ర భయంలో చిక్కుకుని జీవనం సాగిస్తున్నారు. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని, చిరుత పులులను మరియు వాటి పిల్లలను బంధించి ప్రజల ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు. నెలరోజులుగా దాడులు ఆగకపోవడం, పశువుల నష్టం, మహిళపై దాడి అన్ని కలసి ఐరాల, తవణంపల్లి అడవి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయంతో  బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. 

గంగ 2 పుత్రమద్దిలో చిరుత పులి పిల్లల దాడి ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు 
గంగ 3 చిరుత పులి ఫైల్



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *