21, డిసెంబర్ 2025, ఆదివారం

రెండు పోలియో చుక్కలు – నిండు నూరేళ్ళ జీవితం

నిర్లక్ష్యం అయితే పిల్లలకు జీవితాంతం శాపమే!
నేటి నుంచి పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం 

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.

పోలియో… పేరు చిన్నదే అయినా ప్రభావం మాత్రం భయంకరం. ఇది చిన్నారుల జీవితాన్ని మలుపు తిప్పే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. పోలియో వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత నేరుగా నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు దీని బారిన పడే అవకాశం ఎక్కువ. ఒకసారి వైరస్ ప్రభావం చూపితే కొన్ని గంటల్లోనే పక్షవాతం రావచ్చు. చేతులు, కాళ్లు పనిచేయకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తీవ్ర సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. దీనికోసం ప్రత్యేకంగా చికిత్స చేసే మందు ఇప్పటివరకు లేదు. అందుకే పోలియో విషయంలో నివారణే ఏకైక మార్గంగా మారింది.


పోలియో సోకినప్పుడు వెన్నెముకలోని నరాలు దెబ్బతింటాయి. దీని ప్రభావంతో పిల్లలు జీవితాంతం అంగవైకల్యంతో జీవించాల్సి వస్తుంది. చదువు, ఆట, ఉద్యోగం, సాధారణ జీవితం అన్నీ దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి ఒక్క కుటుంబానికే కాదు, సమాజానికే భారంగా మారుతుంది. అందుకే చిన్న వయస్సులోనే పోలియో చుక్కలు వేయించడం ద్వారా పిల్లలను శాశ్వత అంగవైకల్యం నుంచి కాపాడవచ్చు. పోలియో వ్యాధికి చికిత్స లేదు. ఒకసారి పక్షవాతం వస్తే దానిని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. అందుకే ముందస్తు జాగ్రత్తగా పోలియో చుక్కలు వేయించడమే ఏకైక రక్షణ. పల్స్ పోలియో చుక్కలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వైరస్‌ను ఎదుర్కొనేలా చేస్తాయి. ఇవి పిల్లలకు ఎలాంటి హానీ చేయవు. జలుబు, దగ్గు, తేలికపాటి జ్వరం ఉన్నా కూడా నిర్భయంగా పోలియో చుక్కలు వేయించవచ్చు. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని వైద్య నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. పోలియో వైరస్ సాధారణంగా అపరిశుభ్రమైన నీరు, ఆహారం లేదా మలం ద్వారా వ్యాపిస్తుంది. ఒక బిడ్డకు చుక్కలు వేయించకపోతే, అతని ద్వారా వైరస్ ఇతర పిల్లలకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అందుకే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఒకే రోజు, ఒకే సమయంలో పిల్లలందరికీ చుక్కలు వేయడం ద్వారా వైరస్ వ్యాప్తి గొలుసును కట్ చేయవచ్చును. ఇది కేవలం వ్యక్తిగత రక్షణ కాదు, సామూహిక బాధ్యత కూడా. భారతదేశం పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందినప్పటికీ, మన చుట్టుపక్కల కొన్ని దేశాల్లో ఇప్పటికీ పోలియో కేసులు నమోదవుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలు, వలసల కారణంగా వైరస్ మళ్లీ దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఏడాది ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉంటుంది. ఒక తరం నిర్లక్ష్యం చేస్తే, మరో తరం జీవితాంతం మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నది వైద్య నిపుణుల హెచ్చరిక.


నేటి నుంచి జిల్లాలో మహా పల్స్ పోలియో డ్రైవ్

చిత్తూరు జిల్లాలో ఆదివారం నుంచి 23 వరకు మూడు రోజుల పాటు పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని 31 మండలాల్లో ఉన్న సుమారు 2,21,502 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా ఈ కార్యాచరణ రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,415 పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 1,240, పట్టణ ప్రాంతాల్లో 175 బూత్‌లు ఉన్నాయి. ప్రయాణంలో ఉన్న పిల్లల కోసం 37 కేంద్రాలను బస్టాండ్, రైల్వే స్టషన్లో  ఏర్పాటు చేశారు.  మారుమూల ప్రాంతాల్లోని పిల్లల కోసం 70 మొబైల్ టీమ్స్‌ను సిద్ధం చేశారు. ఈ బృహత్తర కార్యక్రమం కోసం 5,800 మంది వ్యాక్సినేటర్లు, 1,530 మంది ఆశా కార్యకర్తలు, 540 మంది ఏఎన్ఎంలు, 2,420 మంది అంగన్వాడీ కార్యకర్తలు విధుల్లో పాల్గొంటున్నారు. పోలియో చుక్కల పంపిణీకి జిల్లాకు 2,94,600 ఓపీవీ డోసులు, 14,730 వ్యాక్సిన్ వాయిల్స్ సిద్ధంగా ఉంచారు. కార్యక్రమ పర్యవేక్షణ కోసం 142 రూట్ సూపర్‌వైజర్లు, 8 మంది కోర్ గ్రూప్ అధికారులు నియమితులయ్యారు. మొదటి రోజు బూత్‌లలో చుక్కలు వేసిన అనంతరం, రెండో మరియు మూడో రోజుల్లో 2,830 బృందాలు జిల్లాలోని 4,92,497 ఇళ్లను సందర్శించి మిగిలిపోయిన పిల్లలకు ఇంటింటా వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 70 వాహనాల ద్వారా మైక్ అనౌన్స్‌మెంట్‌లు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగనుంది.

తల్లిదండ్రుల బాధ్యత

రెండు చుక్కలు – నిండు జీవితం అనేది నినాదం మాత్రమే కాదు, ప్రతి బిడ్డకు ఉన్న హక్కు. మీ చిన్న నిర్లక్ష్యం ఒక చిన్నారి జీవితాన్ని శాశ్వత అంధకారంలోకి నెట్టవచ్చు. డిసెంబర్ 21 నుంచి 23 వరకు మీ ఐదేళ్లలోపు పిల్లలను తప్పనిసరిగా సమీప పోలియో బూత్‌కు తీసుకెళ్లి చుక్కలు వేయించండి. చిత్తూరు జిల్లాను, మన భవిష్యత్తును పోలియో రహితంగా ఉంచుదాం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *