10, డిసెంబర్ 2025, బుధవారం

చిత్తూరు జిల్లాలో క్యాన్సర్ కరాళ నృత్యం

మూడునెలల్లో మూడు లక్షల మందికి స్క్రీనింగ్

వేలల్లో కేసులు నిర్ధారణ… వైద్యశాఖను కుదిపేసిన గణాంకాలు

స్క్రీనింగ్‌లో బయటపడిన ఆందోళనకర వాస్తవాలు

*చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ* 

చిత్తూరు జిల్లాలో క్యాన్సర్ వ్యాప్తి భయానకస్థాయికి చేరుకుంటోందన్న సంకేతాలు వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించిన ఆరోగ్య శాఖ, మొత్తం 2,99,610 మంది ప్రజలకు పరీక్షలు చేసింది. ఈ విస్తృత స్థాయి పరీక్షల్లో వచ్చిన ఫలితాలు జిల్లా వైద్యవర్గాలను, పాలకవర్గాలను ఉలిక్కిపడేలా చేశాయి. స్క్రీనింగ్‌కు హాజరైన వారిలో 5,802 మందికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్థారణ కావడం జిల్లాలో ఈ వ్యాధి ఎంత వేగంగా వ్యాపిస్తోందో మరోసారి స్పష్టంగా చెప్పింది.

ప్రజల్లో సాధారణంగా కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం, ప్రమాదకర అలవాట్లను విడనాడకపోవడం, జీవనశైలి మార్పులు, కాలుష్యం, తక్కువ ఆరోగ్య సదుపాయాలు వంటి అంశాలు కూడా ఈ వ్యాధి పెరుగుదలకు కారణమవుతున్నాయన్న అభిప్రాయం వైద్యుల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో చిన్న చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకు, సామాన్య కార్మికుల నుంచి ఉద్యోగస్తుల వరకు ఎవరినీ విడిచిపెట్టకుండా ఈ వ్యాధి పట్టు విస్తరిస్తోందని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

*నోటి క్యాన్సర్ కేసులు అధికం*

జిల్లాలో గుర్తించిన క్యాన్సర్ కేసుల్లో అత్యధికంగా నోటి క్యాన్సర్ ఉండటం వాస్తవానికి ఆశ్చర్యకరమే కాక భయంకర విషయం కూడా. మొత్తం 5,802 కేసుల్లో 2,873 మందికి నోటి క్యాన్సర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. గుట్కా, ఖైనీ, జర్దా, పొగాకు నమలడం, పొగ త్రాగడం వంటి అలవాట్లే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ప్రత్యేకించి యువతలో గుట్కా, పాన్ మసాలా వినియోగం పెరిగిపోవడం వల్ల ఈ కేసులు కూడా పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గ్రామాల్లో అవగాహన లేకపోవడం, నోటి పరిశుభ్రత లోపించడం, చిన్న పుండ్లను కూడా పట్టించుకోకపోవడంతో  ee ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయి. స్థానిక ఆరోగ్య విభాగం ఇప్పటికే మండలాల వారీగా ప్రత్యేక బృందాలను పంపించి అలవాట్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి చర్యలు ప్రారంభించింది. నోటి క్యాన్సర్ ఎక్కువగా ముందస్తు హెచ్చరికలే ఇస్తుందని, కానీ ప్రజలు వాటిని పట్టించుకోరని వైద్యులు అంటున్నారు.

*మహిళల్లో బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్లు అధికం*

జిల్లాలో మహిళల ఆరోగ్య పరిస్థితిపై కూడా ఈ స్క్రీనింగ్ ఫలితాలు పెద్ద సవాలు లేవనెత్తాయి. మొత్తం కేసుల్లో 873 మందికి బ్రెస్ట్ క్యాన్సర్, 2,056 మందికి గర్భాశయ (సర్వికల్) క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడైంది. ఈ సంఖ్యలు జిల్లాలో మహిళల ఆరోగ్యంపై తక్షణ చర్యలు అవసరమని సూచిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు సకాలంలో పరీక్షలు చేయించుకోవడాన్ని సాధారణంగా నిర్లక్ష్యం చేస్తారు. సిగ్గు, సమయం లేకపోవడం, వైద్య సేవల దూరం, ఆర్థిక సమస్యలు కలిసి   మహిళలను పరీక్షల నుంచి దూరం చేస్తున్నాయి. సర్వికల్ క్యాన్సర్‌కి ప్రధాన కారణమైన హెచ్‌పీవీ వైరస్‌ గురించి ప్రజల్లో పెద్దగా అవగాహన లేదు. ప్రారంభ దశల్లో ఇది లక్షణాలు చూపకపోవడం వల్ల చాలా మంది ఆలస్యంగా ఆసుపత్రులకు చేరతారు. బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో కూడా స్వీయ పరిశీలన, వార్షిక పరీక్షలపై అవగాహన లోపించడమే కేసుల పెరుగుదలకు ముఖ్య కారణంగా వైద్య బృందాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మహిళల కోసం ప్రత్యేక స్ర్కీనింగ్ వాహనాలను మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఇంటింటికీ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచనలో ఉంది. 

*జిల్లా ప్రజలకు, అధికారులకు హెచ్చరిక*

జిల్లా వ్యాప్తంగా నమోదైన ఈ గణాంకాలు ప్రజలకు, అధికార యంత్రాంగానికి ఒక స్పష్టమైన హెచ్చరికగా నిలిచాయి. క్యాన్సర్‌ను నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముందస్తు పరీక్షలు, ప్రమాదకర అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం వలన మాత్రమే క్యాన్సర్‌కు పెరుగుతున్న ప్రభావాన్ని తగ్గించగలవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో క్యాన్సర్ కేసుల పెరుగుదలపై రాబోయే రోజుల్లో జిల్లా యంత్రాంగం ఏ చర్యలు తీసుకుంటుందో ఆసక్తిగా మారింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *