శృతిమించుతున్న తుక్కు ఇనుము ముఠా ఆగడాలు
తుక్కు ఇనుము తమకే అమ్మాలని బెదిరింపులు
అధికారులు, వ్యాపారులపై వరుస దాడులు…
నకిలీ జిఎస్టి అధికారుల రూపంలో దందాలు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు తుక్కు ఇనుము వ్యాపార రంగం భయంతో వణికిపోతుంది. ఒక దందా గుంపు ఆధిపత్యం సంపాదించుకునేందుకు పన్నుల పేరుతో, లారీ తనిఖీ పేరుతో, వ్యాపార నియంత్రణ పేరుతో రెచ్చిపోతోంది. అధికారుల నుంచి వికలాంగ వ్యాపారుల వరకు ఎవరినీ వదలకుండా దౌర్జన్యం చేస్తోంది. గత సంవత్సరం డిసెంబర్ 20న వస్తు సేవల పన్ను (జీఎస్‌టి) అధికారిని బెదిరించిన కేసు ఇంకా సాగుతుండగానే, రెండు రోజుల కిందట తిరుపతి పట్టణంలో తుక్కు ఇనుము తమకే అందాలని ఒక వికలాంగ వ్యాపారిని బెదిరించారు. తుక్కు ఇనుమును వేరే వాళ్లకు అమ్ముతున్నందున పెళ్ళకూరు నుంచి శ్రీకాళహస్తికి వస్తున్న లారీని అడ్డగించి జిఎస్టి అధికారులమని డ్రైవర్ మీద దౌర్జన్యం చేసి అనుమతి పత్రాలు సెల్ ఫోను లాక్కున్నారు. లారీని స్వాధీనం చేసుకుని పోలీసుల సహకారంతో జిఎస్టి అధికారులకు అప్పగించారు. వరుస సంఘటనలతో తుక్కు ఇనుము వ్యాపారస్తులు, జీఎస్టీ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
గత సంవత్సరం డిసెంబర్ 20న హరి ప్రసాద్ అనే జీఎస్టీ అధికారిపై జరిగిన బెదిరింపు జిల్లా మొత్తాన్ని కలిచివేసింది. ఆ రోజు ఉదయం తూకివాకం బైపాస్ వద్ద స్క్రాప్ తరలిస్తున్న వాహనాన్ని తనిఖీ చేసిన ఆయన పన్ను ఎగవేత నిర్ధారణ కావడంతో కంపెనీకి పన్ను నోటీసు జారీ చేశారు. ఇందుకు స్పందించిన వాహన యజమానులు సాయంత్రం 4.26 గంటలకు హరి ప్రసాద్ ఫోన్‌కి కాల్ చేసి మా వాహనం పట్టుకుంటవా? వాహనాన్ని విడిచిపెడుతావా లేక నీ ప్రాణం తీయమంటావా అంటూ బెదిరించారు. పెనుమల్లి గ్రామంలోని అగర్వాల్ ఫ్యాక్టరీ వద్ద దాచిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని గాజుల మండలం పోలీసులు చిత్తూరుకు చెందిన ఇద్దరిపై కేసును నమోదు చేశారు. ప్రభుత్వ అధికారిని విధుల్లో అడ్డుకోవడం మాత్రమే కాకుండా ప్రాణాలు తీస్తామని బెదిరించడం చూస్తే ఈ ముఠా ఎంత బలంగా ఉందో అర్థం అవుతుంది.
ఈ సంఘటనకు ఏడాది గడువు పూర్తికాకముందే, రెండు రోజుల కిందట తిరుపతిలో మరో భయానక దృశ్యం వెలుగులోకి వచ్చింది. చిన్న ఇనుము తుక్కు దుకాణం నడుపుతూ కుటుంబాన్ని గడుపుతున్న వికలాంగ వ్యక్తిని ఒక గుంపు సభ్యులు కలిసి పలుమార్లు బెదిరించిన విషయం బయటపడింది. అతను తుక్కు ఇనుమును ఇతరులకు అమ్మడాన్ని జీర్ణించుకోని చిత్తూరు ముఠా కోపంతో మేం చెప్పిన రేటుకే అమ్మాలి, మాకే అమ్మాలి, మా మాట వినకపోతే దుకాణం మూసేస్తామని తిడుతూ గంటపాటు వేధించినట్లు బాధితుడు తెలిపాడు. స్వయంగా కాళ్లు బలహీనంగా ఉన్న వ్యక్తిని కూడా వదల్లేక దౌర్జన్యంతో అణగదొక్కే ప్రయత్నం చేసింది. దీంతో స్థానిక తుక్కు వ్యాపారులు వికలాంగుడినే వదలని వారు మిగతా వారిని ఎట్లా వదులుతారు? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా రెండు రోజుల కిందటనే కావలి, పెళ్లకూరు రోడ్డులో మరొక తీవ్రమైన ఘటన చోటు చేసుకుంది. కావలికి చెందిన ఒక తుక్కు వ్యాపారి లారీని శ్రీకాళహస్తి సమీపంలోని ఎంఎస్ అగర్వాల్ ఉక్కు శుద్ధి కేంద్రానికి తుక్కు ఇనుము తీసుకెళ్తుండగా, కారులో వచ్చిన వ్యక్తులు దానిని అడ్డుకున్నారు. తాము పోలీసులమని, కారులో వస్తు సేవల పన్ను విభాగం అధికారులు కారులో ఉన్నారని అనుమతి పత్రాలు ఇవ్వాలని అడిగారు. డ్రైవర్ అందజేయగానే అవి తిరిగి ఇవ్వకుండా అతనిని కొట్టి గాయపరిచారు. అతని మొబైల్ లాక్కుని ఇది చట్టపరమైన స్వాధీనం, మేం పన్ను అధికారులకు అప్పగిస్తాం అంటూ లారీని తీసుకుని వెళ్లిపోయారు..ఆ లారీని పెళ్లకూరు పోలీసులకు అప్పగించగా, వారు తిరిగి జీఎస్టీ అధికారులకు అప్పగించారు. తక్కువ ధరకే తుక్కు తామే కొనాలని ఆశతో, తుక్కు వ్యాపారం తాము మాత్రమే చేయాలని ఇలాంటి నకిలీ పోలీసు చర్యలూ కూడా చేస్తున్నట్లు వ్యాపారులు వెల్లడిస్తున్నారు.
గత సంవత్సరం జరిగిన పన్ను బెదిరింపు కేసు, ఈనెల తిరుపతి వికలాంగ వ్యాపారి బెదిరింపు, కావలి, శ్రీకాళహస్తి లారీ అపహరణ ఈ మూడు సంఘటనల్లోనూ చిత్తూరుకు చెందిన ఇనుము తొక్కు ముఠా ప్రమేయం ఉన్నట్లు జిఎస్టి అధికారులు అభిప్రాయపడుతున్నారు. వ్యాపారులపై అణచివేత, దౌర్జన్యం, బలవంతపు రేట్ల విధానం, అధికారుల మీద దౌర్జన్యం, పోలీసు పన్ను శాఖ పేర్లతో దోపిడీకి పాల్పడుతున్న ఈ ముఠాను కట్టడి చేయడంలో జిఎస్టి అధికారులు కానీ పోలీసులు కానీ విఫలమయ్యారని తెలుస్తోంది. కొందరు జీఎస్టీ, పోలీసు అధికారులు వీరికి అండగా నిలుస్తున్నట్లు సమాచారం. మూడు కేసులూ వేర్వేరు రోజుల్లో జరిగినా, దౌర్జన్యం శైలి, నడత, బెదిరింపు భాష అన్నీ ఒకే బలం ఉన్న ముఠా దందాను నడుపుతున్నారన్న సంకేతాన్ని ఇస్తున్నాయి. వ్యాపారవర్గాల్లో భయం అలుముకుంది. తమ తుక్కు ధరను తాము నిర్ణయించుకోలేని పరిస్థితి, ఏ ముఠాకు తప్ప ఎవరికి అమ్మినా బెదిరింపులు తప్పని పరిస్థితి ఏర్పడింది. సంఘటనలన్నీ పోలీసులు దర్యాప్తు చేస్తూనే ఉన్నప్పటికీ, ముఠా ఆగడాలు మాత్ర ఆగడం లేదు… రేపు ఎవరిని టార్గెట్ చేస్తారోనని వ్యాపారస్తులు, అధికారులు భయపడుతున్నారు.

