ఉపాధికి కొత్త గ్యారంటీ వీబీ–జీ రామ్ జీ చట్టం
పని దినాలను 100 నుండి 125 రోజులకు పెంపు
పని కల్పించకపోతే కూలీలకు నిరుద్యోగ భృతి చెల్లింపు
వ్యవసాయ సీజన్ లో ఉపాధి పనులు నిలిపివేత
చెరువుల, కుంటల అభివృద్ధి ద్వారా నీటి భద్రత
కృత్రిమ మేధ వినియోగంతో అవకతవకలకు అడ్డుకట్ట
*(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)*
దేశ గ్రామీణ ఉపాధి వ్యవస్థలో మైలురాయిగా భావిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం కొత్త రూపం ఇచ్చింది. దాదాపు రెండు దశాబ్దాలుగా గ్రామీణ పేదల జీవనాధారంగా కొనసాగిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) అనే కొత్త చట్టాన్ని కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. సంక్షిప్తంగా వీబీ–జీ రామ్ జీ గా పిలుస్తున్న ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపగా, తాజాగా ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో ఇది చట్టంగా మారింది. దీంతో గ్రామీణ ఉపాధి పథకానికి పేరు మాత్రమే కాదు, లక్ష్యాలు, అమలు విధానం, బాధ్యతలలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
దేశంలో కోట్లాది మంది గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకం అమలులో సంవత్సరాలుగా అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. పనులు చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టించడం, కూలీల స్థానంలో యంత్రాలతో పనులు చేయించి బిల్లులు చూపించడం, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి నిధులను స్వాహా చేయడం వంటి ఆరోపణలు తరచూ వెలుగులోకి వచ్చాయి. ఒకప్పుడు సైకిల్‌పై తిరిగిన ఫీల్డ్ అసిస్టెంట్లు నేడు కార్లలో తిరుగుతున్నారన్న వ్యాఖ్యలు ఈ పథకంలో చోటుచేసుకున్న దోపిడీకి ప్రతీకగా మారాయి. ఈ నేపథ్యాన్నే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టానికి కారణంగా చూపిస్తోంది. వీబీ–జీ రామ్ జీ చట్టం ద్వారా గ్రామీణ ఉపాధి వ్యవస్థను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చుతున్నామని కేంద్రం చెబుతోంది. ముఖ్యంగా ఉపాధి హామీ పని దినాలను ఇప్పటివరకు ఉన్న 100 రోజుల నుంచి 125 రోజుల వరకు పెంచడం ద్వారా గ్రామీణ కూలీల ఆదాయాన్ని గణనీయంగా పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ప్రకటించింది. గ్రామాల్లో పని చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి కూలీకి సంవత్సరంలో 125 రోజుల ఉపాధి హామీ ఇవ్వడం ఈ చట్టంలోని ప్రధాన అంశం. నిర్ణీత సమయంలో పని కల్పించలేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ భృతి చెల్లించాల్సిందేనని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు.
పాత పథకంతో పోలిస్తే కొత్త చట్టం కేవలం కూలీ పనులకే పరిమితం కాదని కేంద్రం వివరిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైన నిల్వ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌ల భవనాలు, కంపోస్ట్ తయారీ కేంద్రాలు, గ్రామీణ రహదారులు, తాగునీటి వసతులు వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఈ పథకంలో పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించింది. నీటి భద్రత, గ్రామీణ ప్రధాన మౌలిక వసతులు, జీవనోపాధి మౌలిక వసతులు, వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించే పనులు అనే నాలుగు కీలక అంశాలపై దృష్టి సారించినట్లు కేంద్రం తన వివరణలో పేర్కొంది.
*అవినీతికి అడ్డుకట్ట వేయడానికే కొత్త చట్టం!*
అవినీతికి అడ్డుకట్ట వేయడమే కొత్త చట్టం లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తోంది. ఇందుకోసం ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించనున్నారు. డిజిటల్ హాజరు, కూలీల ఖాతాల్లో నేరుగా వేతనాల జమ, జీపీఎస్ ఆధారిత పనుల పర్యవేక్షణ, మొబైల్ యాప్‌ల ద్వారా ఫీల్డ్ మానిటరింగ్, కృత్రిమ మేధ ఆధారిత మోసాల గుర్తింపు వ్యవస్థలను అమలు చేయనున్నారు. పథకం అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త స్టీరింగ్ కమిటీ పర్యవేక్షణ ఉంటుందని, గ్రామ పంచాయతీల అధికారాలను కూడా విస్తరించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించిన మరో కీలక మార్పు నిధుల భారం విషయంలో జరిగింది. ఇప్పటివరకు ఉపాధి హామీ పథకానికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చేది. కొత్త చట్టం ప్రకారం పథకం వ్యయాన్ని కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం భరించాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత ప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నిష్పత్తి 90:10గా అమలు చేస్తారు. రాష్ట్రాలు నేరుగా నిధులు పెట్టాల్సి రావడంతో పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత మరింత పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై అవినీతి జరిగినా, అమలు సరిగా లేకపోయినా రాష్ట్రాలపై ప్రజల ప్రశ్నలు మరింత గట్టిగా ఉంటాయని చెబుతున్నారు.
*వ్యవసాయ సోదరులు పనులు నిలిపివేత*
రైతుల కోణంలో ఈ పథకంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. వ్యవసాయ సీజన్‌లో కూలీల కొరత తలెత్తకుండా చూడటానికి 60 రోజుల పాటు ఉపాధి పనులను నిలిపివేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఇవ్వడం రైతులకు కొంత ఊరటనిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని ద్వారా కూలీ రేట్ల కృత్రిమ పెంపును అడ్డుకుని, పంట ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించవచ్చని కేంద్రం వాదిస్తోంది. చెరువులు, కుంటల పునరుద్ధరణ, నీటి వనరుల అభివృద్ధి ద్వారా వ్యవసాయానికి అవసరమైన నీటి భద్రత కల్పించవచ్చన్నది ప్రభుత్వ అంచనా. అయితే రైతు సంఘాలు మాత్రం ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వ్యవసాయ ఆధారిత జీవనోపాధిని మరింత బలోపేతం చేసే విధంగా పథకాన్ని రూపొందించాల్సిందన్న డిమాండ్‌ను కేంద్రం పూర్తిగా పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామీణ ఉపాధి పథకం ద్వారా వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక లాభాలు చేకూర్చే విధానాలు ఇంకా స్పష్టంగా కనిపించడం లేదన్నది రైతు సంఘాల అభిప్రాయం.
*ప్రతిపక్షాల అభ్యంతరాలు*
ప్రతిపక్షాలు మాత్రం ఈ పథకంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధి హామీ పథకం పేరును మార్చడమే కాకుండా, దాని అసలు ఆత్మను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తున్నాయి. కేంద్రం తన ఆర్థిక భారాన్ని రాష్ట్రాలపైకి నెట్టేందుకు ఈ మార్పులు తీసుకొచ్చిందని విమర్శిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ఉపాధి వ్యవస్థను ఆధునికీకరిస్తున్నామని, ఇది ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కంటే మెరుగైన పథకమని ధీమాగా చెబుతోంది. వీబీ–జీ రామ్ జీ చట్టం గ్రామీణ ఉపాధి వ్యవస్థకు నిజంగా కొత్త దిశ చూపుతుందన్న ఆశ బావ వ్యక్తమవుతోంది. L పేరు మారిన పాత పథకమే అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అవినీతి తగ్గి, నిజమైన కూలీలకు ఉపాధి, రైతులకు అవసరమైన మౌలిక వసతులు అందితే ఇది గ్రామీణ భారతానికి మలుపు కావచ్చు. లేకపోతే పేరు కొత్త… చట్టం కొత్త… సమస్యలు పాతవే అన్న విమర్శలు మరింత బలపడే అవకాశముంది. గ్రామీణ పేదల భవితవ్యం ఈ కొత్త చట్టం అమలుపైనే ఆధారపడి ఉందన్నది స్పష్టమైన నిజం.

