ఇసుకను దిగుమతి చేసుకొని ఇనుముగా చూపించారు
బోగస్ జీఎస్టీ రిటర్న్ ను ఫైల్ చేసి, కోట్లు కొట్టేశారు
హవాలా రూపంలో విదేశాలకు డబ్బు తరలించారు
ఇదీ చిత్తూరు తొక్కు ఇనుము మాఫియా విశ్వరూపం
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
రాష్ట్రంలో అత్యంత పన్ను ఆదాయం వచ్చే ప్రాంతాల్లో చిత్తూరు డివిజన్ ఒకటి. ఇక్కడ బిజినెస్ అనగానే దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయ వ్యాపారాలు, నిజాయితీతో కష్టపడి లాభాలిచ్చే రంగాలు మనకు గుర్తొస్తాయి. కానీ అదే నేలలో, పన్ను చట్టాలపై చీకట్లో నడిచే ముఠా ఒకటి గూడు కట్టుకుంది. దుబాయ్ నుంచి ఇసుక, కాగితపు పెట్టెలు తెచ్చి వాటిని “ఇనుము తుక్కు”గా బిల్లుల్లో మార్చి, కోట్లు దోచుకున్న ఈ దందా ఇప్పుడు నీళ్లలో ముంచిన గడపలా వెలుగులోకి వచ్చింది. అసలు ఈ కుంభకోణం పరిమాణం అంత తక్కువేమీ కాదు, పదుల కోట్లు ఇన్‌పుట్ పన్ను రాయితీగా దోచుకుంటే, ఇంకొన్ని కోట్లు నల్లధనంగా విదేశాలకు పంపారు. చిత్తూరు నేలపై ఇటువంటి దందా నడవడం, సామాన్య వ్యాపారులే కాక ప్రభుత్వాన్ని కూడా మోసం చేయడం ప్రజాస్వామ్యానికి గుద్దు పెట్టడమే.
ఈ దందా మొదటి దశలో దుబాయ్ నుంచి చవకసరకులు, ఇసుక, కార్డుబోర్డు పెట్టెలు, పనికిరాని వ్యర్థాలను కిలోకు రెండు రూపాయలకు తెచ్చేవారు. కంటైనర్ ఐనా, లారీ ఐనా వీటిలో ఉందేదీ విలువేలేని వ్యర్ధాలే. కానీ, భారత దేశంలోకి అడుగుపెట్టే సరికి, అదే సరుకు ఇనుము తుక్కు దిగుమతిగా రూపాంతరం చెందింది. బిల్లుల్లో కిలోకు వంద రూపాయలు చూపించారు. ఇంత పెద్ద వ్యత్యాసం సాధారణ మనిషికి కూడా అనుమానం రప్పిస్తుంది, కానీ ఈ దందాలో మాత్రం జిఎస్టి అధికారులకు అనుమానం అస్సలు రాలేదు. వచ్చినా, నోట్ల కట్టలు వాటికీ సమాధానం చెప్పాయి. దీంతో పేపర్ల మీద దిగుమతి అయింది, ఇది రవాణా అయింది, ఇది ఇనుము తుక్కు ఇనుముగా చూపించారు. కాగితాల మీదే పుట్టిన బిల్లులు, ప్రింటర్‌లోనే తయారైన రవాణా రసీదులు, గోదాముకు రాని సరుకును పెద్ద పర్వతాల్లా చూపించే బిల్లులు తయారయ్యాయి. కంపెనీలు ఉండే ప్రాంతాల్లో గోదాములు మాత్రం ఖాళీగానే ఉన్నాయి. కానీ పుస్తకాలలో మాత్రం వేల టన్నుల ఇనుము తుక్కు నిల్వగా చూపించారు.
నకిలీ సంస్థల నాటకం, హవాలా రూపంలో ..
ఈ ముఠా అసలు సత్తా నకిలీ సంస్థలను నడపడమే. చిరునామాలు ఒకటే. యజమానులు ఒకడే. సిబ్బంది ఎవరూ లేరు. గోదాము లేదు. స్టాక్ లేదు. కానీ కాగితాల మీదే కోట్లు తిరిగాయి. ఈ కంపెనీలకు ఇనుము తుక్కు అమ్మినట్లు పత్రాలు తయారయ్యాయి. వీటిని పన్ను శాఖ మోసగించడానికి, ఇన్‌పుట్ పన్ను రాయితీ (ఐ.టి.సి.) దోచుకోవడానికి వినియోగించారు. అసలు ఇనుము లేదు. అమ్మకం లేదు. రవాణా లేదు. పన్ను మాత్రం తగ్గించుకున్నారు. ఇది కేవలం పన్ను ఎగవేత కాదు, ప్రభుత్వ ఆదాయాన్ని,, ఖజానాను తెలివిగా దోచుకున్న వైనం. ఇక్కడే కుంభకోణంతో పాటు ఈ దందాలో హవాలా పెద్ద పాత్ర పోషించింది. దేశంలో ఎవరైనా నల్లధనం ఉన్నట్టు తెలిస్తే, ఈ ముఠా తక్షణమే వారి దగ్గరకు చేరేది. వంద రూపాయల నల్లధనం ఇస్తే, విదేశాల్లో దానికి సమానంగా దిర్హమ్ ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. వంద రూపాయల్లో ముప్పై రూపాయలు కమిషన్‌గా ఉంచుకుని, మిగతా డబ్బును దుబాయ్‌కి పంపారు. ఇది మనీలాండరింగ్ చట్టానికి సూటిగా విరుద్ధం. పన్ను కుంభకోణం, నకిలీ దిగుమతులు, నకిలీ అమ్మకాలు, హవాలా లావాదేవీలు ఇవి అన్నీ ఈ దందాలో నల్లనెట్‌వర్క్‌గా మారాయి.
అధికారుల అండదండలతో...
సరుకు లేకపోయినా బిల్లులు ఉన్నాయి… గోదాములు లేకపోయినా స్టాక్ ఉంది… కంపెనీ కనిపించకపోయినా లక్షల రూపాయల లావాదేవీలు ఉన్నాయి… ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరూ ప్రశ్నించకపోవడం అంటే అవగాహన లేకపోవడమా, లేక…కుమ్మక్కు కావడమా అన్న సందేహం సర్వత్రా వ్యక్తం అవుతోంది. సక్రమంగా పరిశీలనలు జరిగి ఉంటే, ఈ దందా మొదటి నెలలోనే ఆగిపోయేది. కానీ సంవత్సరాల తరబడి సాగింది అంటే, కొందరు కళ్లుమూసి చూసినట్టు నటించారని అర్థం అవుతోంది.

