19, డిసెంబర్ 2025, శుక్రవారం

నెల్లూరు జిల్లాలో రూ.44.20 కోట్ల జీఎస్టీ దోపిడీ

ఒకే మూట… ఒకే ముఠా… ఒకే స్క్రిప్ట్

చిత్తూరు, నెల్లూరులో నకిలీ బిల్లుల మాఫియా

నెల్లూరు జిల్లాలో  రూ.44.20 కోట్ల జీఎస్టీ దోపిడీ

 (చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ) 

రాష్ట్రంలో ఫేక్ జీఎస్టీ బిల్లుల మాఫియా ప్రభుత్వ ఖజానాను పద్ధతిగా దోచుకున్న వైనం ఇప్పుడు పూర్తిస్థాయిలో బయటపడుతోంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో వెలుగుచూసిన భారీ జీఎస్టీ స్కాం తరహాలోనే నెల్లూరు జిల్లాలోనూ అదే విధానం, అదే మోసపూరిత స్క్రిప్ట్‌తో కేటుగాళ్లు ముఠాగా ఏర్పడి రూ.44.20 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయాన్ని స్వాహా చేసినట్టు జీఎస్టీ శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రెండు జిల్లాల్లో స్కాం అమలైన విధానం చూస్తే ఇది యాదృచ్ఛికం కాదని, ఒకే ముఠా – ఒకే నెట్‌వర్క్ రాష్ట్రవ్యాప్తంగా పనిచేసిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ స్కాం యొక్క మూల సూత్రం చాలా సులువు కానీ ప్రమాదకరం. వ్యాపారం జరగకుండానే జరిగినట్లు చూపించడం, సరుకులు కొనకుండానే కొన్నట్లు రికార్డులు సృష్టించడం, అమ్మకాలు లేకున్నా అమ్మినట్లు నకిలీ బిల్లులు తయారు చేయడం.
ఇదే పద్ధతి చిత్తూరులోనూ, ఇదే పద్ధతి నెల్లూరులోనూ అమలైంది.


మొదటగా కేటుగాళ్లు చేసిన పని కాగితాల మీద మాత్రమే ఉండే షెల్ సంస్థలను ఏర్పాటు చేయడం. స్టీల్, ఐరన్, గ్రానైట్స్, ట్రేడింగ్ పేర్లతో సంస్థలను నమోదు చేసి జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. వాస్తవంగా వీటికి గోదాములు లేవు, సరుకుల నిల్వలు లేవు, కార్మికులు లేరు. అయినా సరే ఈ సంస్థల పేరుతో నకిలీ జీఎస్టీ బిల్లుల ఉత్పత్తి ప్రారంభమైంది.
నెల్లూరు జిల్లాలో ఈ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన సంస్థల్లో సి.కే. స్టీల్స్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ ఒక్కటే నకిలీ బిల్లుల ద్వారా రూ.16.49 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అక్రమంగా పొందింది. ఇదే స్కాం చైన్‌లో యూఎఫ్‌వో ఎంటర్‌ప్రైజ్ ద్వారా రూ.9.23 కోట్ల, ఖల్కో ఎంటర్‌ప్రైజెస్ ద్వారా రూ.5.21 కోట్ల, యూనివర్సల్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా రూ.4.81 కోట్ల, మార్స్ ట్రేడింగ్ ద్వారా రూ.4.45 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండి పడినట్టు తేలింది. ఇదే తరహాలో దేవి ఎంటర్‌ప్రైజెస్ సంస్థ రూ.4.79 కోట్ల, శ్రీ షిరిడిసాయి ఎంటర్‌ప్రైజెస్ రూ.3.89 కోట్ల, ఇండియన్ స్టీల్స్ రూ.3.67 కోట్ల మేర నకిలీ ఐటీసీని స్వాహా చేసింది. అలాగే యాష్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా రూ.1.60 కోట్ల, శ్రుతి ఎంటర్‌ప్రైజెస్ ద్వారా రూ.1.47 కోట్ల, ఎం.ఆర్. ట్రేడర్స్ ద్వారా రూ.1.14 కోట్ల మేర ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు జీఎస్టీ శాఖ గుర్తించింది. 
చిన్న మొత్తాలుగా కనిపించినా కలిపి చూస్తే స్కాం తీవ్రతను చూపించే సంస్థలు కూడా ఉన్నాయి. శ్రీ బాలాజీ ట్రేడర్స్ ద్వారా రూ.52.67 లక్షలు, ఎల్.జీ. గ్రానైట్స్ ద్వారా రూ.43.65 లక్షలు, గంగామణి ట్రేడర్స్ ద్వారా రూ.34.39 లక్షలు, పవన్‌సాయి వర్క్స్ ద్వారా రూ.31.63 లక్షలు, శ్రీ విజయదుర్గ గ్రానైట్స్ ద్వారా రూ.29.76 లక్షలు, బాలాజీ ఎక్స్‌పోర్ట్స్ ద్వారా రూ.20.39 లక్షలు, తులసి ఎంటర్‌ప్రైజెస్ ద్వారా రూ.15.07 లక్షలు అక్రమంగా ఐటీసీ పొందినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇంకా శ్రీ అంజనేయ ట్రేడర్స్ రూ.9.82 లక్షలు, శ్రీ సాయి ఎంటర్‌ప్రైజెస్ రూ.8.76 లక్షలు, పూజిత ట్రేడర్స్ రూ.8.29 లక్షలు, మహేశ్వర కన్‌స్ట్రక్షన్స్ రూ.8.39 లక్షలు, చంద్ర ట్రేడర్స్ రూ.3.90 లక్షలు, శ్రీ రామ్ గ్రానైట్స్ రూ.4.42 లక్షలు, శివసాయి ట్రేడర్స్ రూ.1.84 లక్షలు, కే.ఎస్. ట్రేడర్స్ రూ.1.66 లక్షలు, చె. శ్రీకాంత్ రూ.1.44 లక్షలు మేర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్టు తేలింది.

చిత్తూరు, నెల్లూరు ఒకే స్కాం మ్యాప్

ఈ మొత్తాలన్నీ కలిపి చూస్తే నెల్లూరు జిల్లాలోనే రూ.44.20 కోట్లకు పైగా జీఎస్టీ స్కాం జరిగినట్టు స్పష్టమవుతోంది. చిత్తూరు జిల్లాలో వెలుగుచూసిన స్కాంలోనూ ఇదే తరహా షెల్ సంస్థలు, ఇదే తరహా నకిలీ బిల్లులు, ఇదే కాలపరిమితి ఉండటం గమనార్హం. ఇది విడివిడిగా జరిగిన మోసం కాదని, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన మాఫియా నెట్‌వర్క్ పని అన్న అభిప్రాయం బలపడుతోంది. సరుకుల రవాణా లేకుండానే, గోదాం నిల్వలు లేకున్నా, ఈ-వే బిల్లులు నకిలీగా ఉన్నా ఇంత భారీ మొత్తంలో ఐటీసీ ఎలా క్లియర్ అయిందన్న ప్రశ్నలు జీఎస్టీ అధికారుల పాత్రపై అనుమానాలను పెంచుతున్నాయి. కేటుగాళ్లతో పాటు వారికి మౌనంగా సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోకపోతే, ఈ స్కాంలు మరిన్ని జిల్లాలకు పాకే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *