27, డిసెంబర్ 2025, శనివారం

గ్రామసభల నుంచి గ్లోబల్ మార్కెట్ వరకూ మహిళల ప్రయాణం

స్వయం సహాయక సంఘాలు – మహిళా శక్తికి అసలైన చిరునామా

చిత్తూరులో డ్వాక్రా మహిళల చరిత్రాత్మక మార్పు

పొదుపు సంఘాలతో పారిశ్రామిక విప్లవం

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

ఒకప్పుడు గ్రామాల్లో మహిళల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఇంట్లో చిన్న అవసరానికి కూడా వంద, వేయి రూపాయలు లేనప్పుడు ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. శుభకార్యం జరిగినా, ఆశుభ కార్యక్రమం వచ్చినా గ్రామంలోని ధనవంతుల దగ్గర, రైతుల దగ్గర అప్పు కోసం వారాల తరబడి తిరగాల్సిన రోజులు. అప్పు తీసుకోవడమే కాదు, ఆ అప్పు తీర్చేందుకు జీవితాంతం కష్టపడాల్సిన పరిస్థితి. అలాంటి మహిళల జీవితాల్లో డీఆర్‌డీఏ ప్రవేశపెట్టిన డ్వాక్రా పథకాలు నేడు చరిత్రాత్మక మార్పుకు నాంది పలికాయి. నేడు చిత్తూరు జిల్లా మహిళలు అప్పు అడిగే స్థితి నుంచి, అప్పు ఇచ్చే స్థాయికి ఎదిగారు. పొదుపు సంఘాలుగా మొదలైన డ్వాక్రా ఉద్యమం ఇప్పుడు మహిళలను పారిశ్రామికవేత్తలుగా, కోట్లాది రూపాయల టర్నోవర్ చేసే వ్యాపారవేత్తలుగా మార్చింది. గ్రామసభల స్థాయి నుంచి గ్లోబల్ మార్కెట్ వరకూ మహిళల ప్రస్థానం నేడు జిల్లా చరిత్రలో స్వర్ణాధ్యాయంగా నిలుస్తోంది.

గ్రామసభల నుంచి సంఘాల వరకూ విస్తారమైన మహిళా నెట్‌వర్క్

చిత్తూరు జిల్లాలో మొత్తం 1,247 గ్రామ సమైక్యలు ఉన్నాయి. ఈ గ్రామ సమైక్యల పరిధిలో 34,932 డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ సంఘాల్లో మొత్తం 3,42,435 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇది కేవలం గణాంకం కాదు… గ్రామీణ మహిళల ఐక్యతకు, ఆర్థిక అవగాహనకు నిదర్శనం. జిల్లాలో అత్యధికంగా బంగారుపాళ్యం మండలం డ్వాక్రా ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచింది. ఈ మండలంలో 67 గ్రామసమాఖ్యలు, 1797 స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 17,711 మంది మహిళా సభ్యులు ఉండటం విశేషం. ఒకప్పుడు కూలీ పనులకు పరిమితమైన మహిళలు, నేడు సంఘాల ద్వారా వ్యాపార నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగడం ఈ గణాంకాల వెనుక ఉన్న అసలైన కథ.

బ్యాంకు లింకేజీ – మహిళల చేతిలో ఆర్థిక శక్తి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ కింద చిత్తూరు జిల్లాలోని 1531 సంఘాలకు 1998.4 కోట్ల రూపాయలను రుణాలుగా ఇవ్వాలని నిర్దేశించారు. ఇందులో ఇప్పటికే 1346 సంఘాలకు 1730.6 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఇప్పటివరకు మొత్తం 5395 సంఘాలకు 761.07 కోట్ల రూపాయలు అందజేశారు. ఈ బ్యాంకు లింకేజీ రుణాలు మహిళల జీవితాల్లో కీలక మలుపు. చిన్న వ్యాపారం మొదలుపెట్టాలన్నా, ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలన్నా, వ్యవసాయం, పశుపోషణ, తయారీ రంగాల్లో పెట్టుబడి పెట్టాలన్నా  ఈ రుణాలే ఆధారం. ఒకప్పుడు బ్యాంకు గడప కూడా తొక్కని మహిళలు, నేడు లక్షలు, కోట్ల రూపాయల రుణాలు తీసుకునే స్థాయికి చేరడం డ్వాక్రా ఉద్యమం సాధించిన అతి పెద్ద విజయం.

సామాజిక పెట్టుబడి – సంఘాలకు బలమైన పునాది

సామాజిక పెట్టుబడి నిధి కింద జిల్లాలో 19.79 కోట్ల రూపాయలను అందజేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇప్పటివరకు 1809 సంఘాలకు 13 కోట్ల రూపాయలను అందజేశారు. ఈ నిధులు సంఘాల అంతర్గత బలోపేతానికి, అత్యవసర అవసరాలకు, సభ్యుల సంక్షేమానికి ఉపయోగపడుతున్నాయి. అదే విధంగా శ్రీనిధి పథకం కింద జిల్లాలోని 34,635 సంఘాలకు 346.22 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 32,595 సంఘాలకు 260.81 కోట్ల రూపాయలను అందజేశారు. తక్కువ వడ్డీతో లభించే ఈ రుణాలు మహిళలను ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చెర నుంచి పూర్తిగా విముక్తం చేశాయి.

ఆదాయము పెంపుతో మహిళల చేతిలో కోట్ల పెట్టుబడులు

చిత్తూరు జిల్లాలో ఆదాయము పెంపు రంగాల కింద మొత్తం 3,25,565 మంది సభ్యులకు 3,690.20 కోట్ల రూపాయలను అందజేశారు. ఇది మహిళల ఆర్థిక విస్తరణకు స్పష్టమైన సాక్ష్యం. వ్యవసాయ రంగంలో 75,887 మందికి 965.44 కోట్ల రూపాయలు అందజేశారు. చేపల పెంపకానికి 451 మందికి 5.42 కోట్ల రూపాయలు, ఉద్యానవన పంటల పెంపకానికి 2,873 మందికి 38.13 కోట్ల రూపాయలు, పశువుల పెంపకానికి 49,563 మందికి 593.11 కోట్ల రూపాయలు అందించారు. సిరికల్చర్ రంగంలో 931 మందికి 15.67 కోట్ల రూపాయలు, తయారీ రంగంలో 2,542 మందికి 36.5 కోట్ల రూపాయలు, సేవల రంగంలో 13,297 మందికి 191.49 కోట్ల రూపాయలు అందాయి. వ్యాపార నిమిత్తం 15,450 మందికి 231.76 కోట్ల రూపాయలు, ఆస్తుల కొనుగోలుకు 72,241 మందికి 672.66 కోట్ల రూపాయలు, ఇళ్ల నిర్మాణానికి 92,330 మందికి 939.97 కోట్ల రూపాయలు అందజేశారు. ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్న విషయం ఒక్కటే – డ్వాక్రా మహిళలు ఇప్పుడు కూలీలుగా కాదు, పెట్టుబడిదారులుగా మారారు.

వినియోగ రుణాలు – జీవన ప్రమాణంలో మార్పు

వినియోగానికి సంబంధించి 2,98,615 మందికి 1,740.13 కోట్ల రూపాయలను అందజేశారు. ఇందులో 1,08,095 మందికి 510 కోట్ల రూపాయలు, పెళ్లిళ్లు, విద్యాభ్యాసం కోసం 99,925 మందికి 796.79 కోట్ల రూపాయలు, ఇతర అవసరాలకు 90,595 మందికి 433.90 కోట్ల రూపాయలు అందాయి. ఆదాయము పెంపు, వినియోగ రంగాలను కలిపి మొత్తం 624180 మందికి 5430.33 కోట్ల రూపాయలను అందజేయడం జరిగింది. ఇది జిల్లాలో మహిళల జీవన ప్రమాణం ఎంతగా మారిందో చెప్పే అద్దం.

అప్పుల చెర నుంచి పారిశ్రామికవేత్తల వరకూ

ఒకప్పుడు మహిళలు వంద రూపాయల కోసం కూడా ఇతరుల దయ మీద ఆధారపడేవారు. అప్పు కోసం రైతుల ఇళ్ల చుట్టూ తిరిగేవారు. నేడు అదే మహిళలు డ్వాక్రా సంఘాల్లో చేరి లక్షల నుంచి కోట్ల రూపాయల టర్నోవర్ చేసే పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. పాల ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్, కుట్టు పరిశ్రమ, హస్తకళలు, చిరుధాన్యాల ఉత్పత్తులు, సేవల రంగం  ఇలా అనేక రంగాల్లో మహిళలు తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. గ్రామీణ మహిళల చేతుల్లో తయారవుతున్న ఉత్పత్తులు నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో నిలబడటం డ్వాక్రా ఉద్యమం సాధించిన గర్వకారణం. చిత్తూరు జిల్లాలో డ్వాక్రా సంఘాలు నేడు కేవలం పొదుపు సంఘాలు కావు. అవి మహిళల జీవితాలను మార్చే ఉద్యమం. అప్పుల చెర నుంచి ఆత్మగౌరవం దాకా, నిరాశ నుంచి స్వయం సమృద్ధి దాకా  ఈ ప్రయాణం డ్వాక్రా మహిళల విజయగాథ. మొదటి పేజీకి మాత్రమే కాదు, చరిత్ర పుటల్లో నిలిచే కథ ఇది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *