చిత్తూరు జీఎస్టీ డివిజన్‌లో రూ.386.59 కోట్ల తుక్కు ఇనుము కుంభకోణం
మూడు సంవత్సరాలు నడుస్తున్న చీకటి దందా
జిల్లా మొత్తం ఒకే రకమైన లావాదేవీలు
ఒకే ల్యాప్‌టాప్ నుండి వందల బిల్లులు
జీఎస్టీ అధికారుల సహకారంతో రెచ్చిపోయిన ముఠా
ఇప్పటికీ అరెస్టు వారెంట్ జారీ చేయని అధికారులు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జీఎస్టీ డివిజన్‌లో వెలుగులోకి వచ్చిన తుక్కు ఇనుము బోగస్ బిల్లుల కుంభకోణం విలువ ఇప్పటి వరకు మొత్తం రూ. 386.59 కోట్లుగా అధికారులు నిగ్గుతేల్చారు. ఒక్క కిలో ఇనుము కూడా కదలకుండా కేవలం కాగితాల మీదనే మొత్తం లావాదేవీలు నడిచాయి. నకిలీ ఇన్వాయిసులను సృష్టించి జిఎస్టి రిటర్న్స్ పేరుతో ప్రభుత్వం నుండి కోట్లను దండుకున్న అతిపెద్ద కుంభకోణంగా ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కుంభకోణం ఒక్కరోజులో జరగలేదు. దాదాపు మూడు సంవత్సరాలుగా నిశ్శబ్దంగా, ఉన్నతాధికారులను పక్కదారి పట్టించే ప్రణాళికతో నడిపిన భారీ కుట్రగా దర్యాప్తు అధికారులు తేలుస్తున్నారు. మొత్తం వ్యవహారాన్ని సమీక్షించగా ఈ స్కాంను నడిపిన అసలు ముఠాలో కనీసం 14 నుండి 20 మంది వరకు కీలక పాత్రధారులు ఉన్నట్టు తేలింది. 386 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండి పడినా, ఇప్పటివరకు ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. విభాగ పరంగా కూడా అరెస్టు వారెంట్లను జారీ చేయలేదు.
ఈ మొత్తం కుంభకోణంలో తిరుపతి 3 సర్కిల్ అగ్రస్ధానంలో నిలిచినది . ఈ ఒక్క సర్కిల్‌లోనే రూ. 113.2.1 కోట్ల విలువైన బోగస్ ఇన్వాయిసులు సృష్టించారని అధికారుల పరిశీలనలో బయటపడింది. అందులో అర్హాన్ ఫెరస్ అండ్ నాన్ ఫెరస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మాత్రమే రూ. 91.27 కోట్లు దోచుకోవడం స్కాంలో హైలెట్. ఈ సంస్థ ఉన్న చిరునామాకు వెళ్లిన అధికారులకు తాళం వేసిన ఖాళీ గది మాత్రమే దర్శనమిచ్చింది . గోదాం లేదు, ఇనుము స్టాక్ లేదు, రవాణా చేసిన లారీలు లేవు. అయినా రికార్డుల్లో కోట్ల బిల్లులు. సంస్థను ఎవరు నిర్వహిస్తారన్న సమాచారం లేదు. ఇదే తరహా కుంభకోణం జిల్లా వ్యాప్తంగా జరిగింది.
చిత్తూరు పట్టణం కుంభకోణానికి అడ్డాగా నిలిచింది. చిత్తూరు మొదటి సర్కిల్‌లో రూ. 81.13 కోట్ల, చిత్తూరు రెండవ సర్కిల్‌లో రూ. 56.87 కోట్ల విలువైన నకిలీ బిల్లుల చలనం దర్యాప్తు బృందాన్ని ఆశ్చర్యపరిచింది. ఏ ఆర్ స్టీల్స్ రూ. 3.22 కోట్లు, మహాదేవ్ ఎంటర్‌ప్రైజెస్ రూ.1.99 కోట్లు, మిత్తల్ ట్రేడర్స్ రూ.1.69 కోట్లు వంటి పెద్ద మొత్తాలు చిత్తూరును ఈ దందాలో ప్రధాన కేంద్రంగా నిలిపాయి. పరిశీలనకు వెళ్లిన అధికారులకు అందుబాటులో కనిపించినవి తాళాలే… షాపులు బయట ఖాళీగా ఉండటమే కాకుండా లోపల కంప్యూటర్లు పనిచేయకపోవడం ఈ జీఎస్టీ నంబర్లు కేవలం కాగితాల దందాకే వాడబడ్డాయని తేటతెల్లం చేసింది.
పలమనేరు సర్కిల్ కూడా ఈ దందాలో ముఖ్య పాత్ర పోషించింది. మొత్తం రూ.15.13 కోట్ల విలువైన నకిలీ లావాదేవీలు నమోదు కావడం, ఒకే ల్యాప్‌టాప్ నుంచి వందల ఇన్వాయిసులు క్రియేట్ చేయడం, ఒకే ఇంటర్నెట్ కనెక్షన్‌తో ఇ రవాణా పత్రాలు సృష్టించడం ఈ నెట్‌వర్క్ టెక్నికల్ సామర్ధ్యాన్ని చూపించింది. శ్రీకాళహస్తి సర్కిల్‌లో రూ. 77 లక్షలు దందా వెలుగులోకి రావడం, అక్కడి సంస్థలు ఎప్పుడూ ఇనుము వ్యాపారం చేయనప్పటికీ ఇనుము క్వింటాళ్ల కొద్దీ అమ్మేశామని రికార్డులు చూపించడమే విచిత్రంగా నిలిచింది.
ఇవే కాదు, గూడూరు సర్కిల్‌లో రూ. 8.85 కోట్లు, తిరుపతి–Iలో రూ. 9.54 కోట్లు, జేసీ కార్యాలయం పరిధిలో రూ. 14.31 కోట్లు, శ్రీ సిటీలో రూ. 85 లక్షలు బోగస్ ఇన్వాయిసులు సృష్టించబడ్డాయి. ఇలా మొత్తం జీఎస్టీ డివిజన్ అంతా ఈ ముఠా కాళ్లు చాపినట్టు విచారణ అధికారులు చెబుతున్నారు. ఆసక్తికరంగా, కొన్ని జీఎస్టీ నంబర్లను వాడిన వ్యక్తులకు ఈ వ్యాపారం జరుగుతుందనే సమాచారం కూడా లేకపోవడం, ఆధార్–ప్యాన్ వివరాలను మూడో వ్యక్తులు దుర్వినియోగం చేసినట్టు బలమైన సూచనలు లభించాయి.
రవాణా పత్రాల్లో చూపిన లారీ నంబర్లలో అనేకవి వాస్తవంలో లేనివి కావడం, కొన్ని వాహనాలు చిత్తూరు జిల్లాతో సంబంధం లేకపోయినా రవాణా చేశామని రికార్డులు చూపించడం, ట్రాన్స్‌పోర్ట్ శాఖతో సమన్వయం చేయగా అవి నకిలీవని తేలడం ఈ స్కాంకు మరింత స్పష్టతను తెచ్చింది. బ్యాంకు వివరాలను పరిశీలించగా డబ్బు సర్క్యూలేషన్ పూర్తిగా జీరో బ్యాలెన్స్ మోడల్‌లో నడిచినట్టు తేలింది. వచ్చే నిధి వెంటనే మరో ఖాతాకు పంపడం, అక్కడి నుంచి మరో ఖాతాకు వెళ్లడం—చివరికి పూర్తిగా మాయం కావడం ఈ నెట్‌వర్క్ అత్యంత నైపుణ్యంతో పని చేసిందని సూచిస్తోంది.
దర్యాప్తు మొదటి దశలో పత్రాల ధృవీకరణ, రెండో దశలో రవాణా పత్రాలు పరిశీలించగా, ఇప్పుడు అసలు సూత్రధారులను గుర్తించే పనిలో శాఖ బిజీగా ఉంది. ఈ కుంభకోణాన్ని నడిపిన నలుగురు కీలక వ్యక్తులు, వారికి సహకరించిన మధ్యవర్తులు, జీఎస్టీ నంబర్లు ఎలా తెరిచారు అన్న అంశాలపై విచారణ సాగుతోంది. ఈ మొత్తం దందా ఇంకా ఎంత విస్తరించి ఉండొచ్చు అనే ప్రశ్న దర్యాప్తు సంస్థలను కలవరపెడుతోంది. పూర్తి విచారణ పూర్తయ్యే వరకు రూ. 386.59 కోట్ల స్కాం తుది లెక్క కాదనే అభిప్రాయలు శాఖలో వినిపిస్తున్నాయి. ఈ మొత్తం ఇంకా పెరగచ్చని భావిస్తున్నారు.

