చరిత్రలో తొలిసారి రోడ్డెక్కిన మామిడి రైతులు
హామీలకే పరిమితమైన మద్దతు ధర…
కొనేవారు లేక రోడ్డుపై మామిడికాయలు పోసి నిరసన
నాడు కాయలు కొనమని రైతుల వేడుకోలు
నేడు బిల్లుల కోసం ఎదురుచూపులు, ఆందోళనలు
అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చిత్తూరు రైతులు
రైతులకు కన్నీళ్లే మిగిల్చిన 2025 మామిడి సీజన్
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)
చిత్తూరు జిల్లా అంటేనే ఉద్యానవన సాగుకు చిరునామా. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా మామిడి సాగుకు కేంద్ర బిందువుగా పేరొందిన జిల్లా. అవిభక్త చిత్తూరు జిల్లాలో దాదాపు 97 వేల హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి సాగు జరుగుతోంది. లక్షలాది రైతు కుటుంబాలకు ఇదే ప్రధాన జీవనాధారం. ముఖ్యంగా తోతాపురి రకం మామిడి సాగులో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆసియాలోనే అతిపెద్ద మామిడి పల్ప్ తయారీ కేంద్రాలుగా పేరొందిన 27 పరిశ్రమలు ఈ జిల్లాలో ఉన్నాయి. అలాంటి జిల్లాలో 2025 సంవత్సరం మామిడి రైతులకు శాపంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగాల్సిన దమనీయ పరిస్థితి ఏర్పడింది. ఫ్యాక్టరీలో మామిడి పల్ప్ నిల్వలు పేరుకొనిపోవడంతో మామిడికాయలు తీసుకోవడానికి ఫ్యాక్టరీలో ముందుకు రాలేదు. కాయలతో రైతులు రోజులు తరబడి ఫ్యాక్టరీ గేటు వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామిడికాయలను తీసుకోకపోవడంతో కొందరు రైతులు రోడ్ల పక్కన పారబోశారు. అరగొండలో ఒక రైతు రోడ్డు మీదనే కాయలు పోసి నిరసన వ్యక్తం చేశాడు. మామిడికాయలు కోయకుండా కొందరు రైతులు తోపుల్లోనే అలాగే వదిలేశారు. మళ్లీ మామిడి సీజన్ ప్రారంభమవుతున్న ఇప్పటివరకు రైతులకు బిల్లులు అందలేదు. మద్దతు ధర అమలు చేయాలని ఒకవైపు, బిల్లులు చెల్లించాలని మరోవైపు రైతులు రోడ్డు మీదికి రావలసిన పరిస్థితి దాపురించింది.
ఒకప్పుడు మామిడి తోటల్లో పండిన కాయలు రైతు ఇంట్లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చేవి. పంట అమ్మితే అప్పులు తీరేవి, పిల్లల చదువులు సాగేవి, కుటుంబం నిలబడేది. కానీ ఇప్పుడు అదే మామిడి రైతుల జీవితాల్లో కన్నీళ్లకు కారణమవుతోంది. గత సీజన్‌లో టన్నుకు 30 వేల రూపాయల వరకు పలికిన ధర, ఈ సీజన్‌లో 4 వేల నుంచి 5 వేల రూపాయల స్థాయికి పడిపోయింది. కిలోకు నాలుగు నుంచి ఐదు రూపాయలే రావడం కోత ఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి. కానీ పెట్టుబడులు మాత్రం తగ్గలేదు. ఎరువులు, పురుగుమందులు, నీటి ఖర్చులు, కూలీల వేతనాలు కలిపి ఒక్కో రైతు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాడు. చివరకు చేతికి మిగిలింది అప్పులే. ఈ సంక్షోభానికి మూలకారణం మార్కెటింగ్ వ్యవస్థ పూర్తిగా రైతు వ్యతిరేకంగా మారడమే. చిత్తూరులో ఎక్కువగా పండే తోతాపురి మామిడి ప్రధానంగా పల్ప్ తయారీకి మాత్రమే ఉపయోగపడుతుంది. దీంతో రైతులు పూర్తిగా పల్ప్ ఫ్యాక్టరీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది ఆ ఫ్యాక్టరీలే రైతుల పాలిట అగ్నిపరీక్షగా మారాయి. గత సీజన్ నుంచి సుమారు 2.75 లక్షల టన్నుల మామిడి పల్ప్ నిల్వలు పేరుకుపోవడంతో ఈ సీజన్‌లో ఫ్యాక్టరీ యజమానులు మామిడి కొనుగోలుకు వెనుకంజ వేశారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయని చెబుతూ రైతుల పంటను కొనకుండా తప్పించుకున్నారు. ఫలితంగా చిత్తూరులోని 27 పల్ప్ ఫ్యాక్టరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేదు.
మద్దతు ధర ప్రకటన… అమలు శూన్యం
రైతుల ఆందోళనలు ఉధృతమవడంతో రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి మామిడికి కిలోకు పన్నెండు రూపాయల కనీస మద్దతు ధరను ప్రకటించింది. ఇందులో ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీలు చెల్లించాలి, మిగిలిన నాలుగు రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రకటనతో రైతుల్లో కొంత ఆశ చిగురించింది. ప్రభుత్వం తన వంతుగా రైతుల ఖాతాల్లో నాలుగు రూపాయల సబ్సిడీ మొత్తాన్ని జమ కూడా చేసింది. కానీ ఫ్యాక్టరీలు మాత్రం ఎనిమిది రూపాయలు చెల్లించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. కిలోకు నాలుగు నుంచి ఐదు రూపాయలే ఇస్తామని స్పష్టం చేశాయి. మద్దతు ధర కాగితాలకే పరిమితమైందన్న భావన రైతుల్లో బలంగా పాతుకుపోయింది. రైతులు తమ మామిడికాయలను ఫ్యాక్టరీ గేట్ల వద్దకు తీసుకొచ్చాక ధర తగ్గించి బలవంతంగా అమ్ముకునేలా చేయడం ఈ సీజన్‌లో సాధారణమైంది. టోకెన్లను తమ బంధుమిత్రులకు, అనుకూల వర్గాలకు మాత్రమే కేటాయించడంతో చిన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొందరు రైతులు రోజుల తరబడి ఫ్యాక్టరీల ఎదుట కాయలతోనే ఎదురుచూసినా కొనుగోలు జరగలేదు. రైతులు దీనిని పగటిపూట జరిగే దోపిడీగా అభివర్ణిస్తున్నారు.
రోడ్లపై మామిడికాయలు… చరిత్రలో లేని నిరసనలు
ఫ్యాక్టరీలు కాయలు తీసుకోకపోవడంతో రైతుల ఆగ్రహం ఉప్పొంగింది. తోటల్లో పండిన మామిడికాయలు పండిపోయి నేలరాలుతున్న దృశ్యాలు గ్రామగ్రామానా కనిపించాయి. కొందరు రైతులు ట్రాక్టర్లలో కాయలను తీసుకెళ్లి రోడ్లపై పారబోసి నిరసన తెలిపారు. ఫ్యాక్టరీల ఎదుట, మార్కెట్ యార్డుల్లో, కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో ఐదు లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేసినా, ఫ్యాక్టరీ ర్యాంపులకు చేరింది కేవలం మూడున్నర లక్షల టన్నులే. మిగిలిన పంట తోటల్లోనే నాశనమైంది. ఈ సంక్షోభంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. కుప్పం పర్యటనలో పల్ప్ ఫ్యాక్టరీ యజమానులతో సమావేశమై రైతుల బిల్లులు వెంటనే చెల్లించాలని సూచించారు. ప్రభుత్వం రైతుల ఖాతాల్లో మద్దతు ధర సబ్సిడీగా నాలుగు రూపాయలు జమ చేసింది. అయినప్పటికీ ఫ్యాక్టరీలు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేదు. దీంతో రైతులు మరోసారి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనలకు దిగారు. జిల్లావ్యాప్తంగా మద్దతు ధర అమలు చేయాలంటూ నిరసనలు కొనసాగుతున్నాయి.
రాజకీయ సందర్శనలు… రైతుకు న్యాయం ఎక్కడ?
మామిడి రైతుల దమనీయ పరిస్థితిని చూసి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వచ్చారు. రైతుల ఆవేదనను విన్నారు. మామిడికాయలను రోడ్లపై పోసి ట్రాక్టర్లతో తొక్కడం ద్వారా రైతులు తమ నిరసనను మరింత తీవ్రంగా వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు వచ్చి వెళ్లినా రైతుకు మాత్రం న్యాయం దక్కలేదన్న భావన మరింత బలపడింది. మార్కెట్ సంక్షోభానికి తోడు ప్రకృతి కూడా రైతుకు ప్రతికూలంగా మారింది. ఈశాన్య రుతుపవనాల సమయంలో సాధారణం కంటే డెబ్బై నాలుగు శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఆపై ఒక్కసారిగా పెరిగిన వేడి కారణంగా పూత, పిందెలు వాడిపోయి రాలిపోయాయి. సాధారణంగా రెండు లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉండాల్సిన చోట ఈసారి నలభై శాతం తగ్గుదల నమోదైంది. ఆకు ముడత, బూడిద తెగులు, కాయకుళ్లు తెగుళ్లు పంట నాణ్యతను తీవ్రంగా దెబ్బతీశాయి.
రసాయన ఉచ్చు… దిగుబడికి దెబ్బ
దిగుబడి తగ్గడంతో రైతులు భయంతో పురుగుమందుల దుకాణాల చుట్టూ తిరిగారు. దుకాణదారుల సూచనల మేరకు విచక్షణారహితంగా రసాయనాలు పిచికారీ చేశారు. కొందరు రైతులు తమ పెట్టుబడిలో అధిక భాగాన్ని రసాయనాలకే ఖర్చు చేసినా చివరకు ఇరవై శాతం పంట కూడా రాలేదని వాపోతున్నారు. ఈ అధిక రసాయన వినియోగం వల్ల ఎగుమతి అవకాశాలు కూడా దెబ్బతింటున్నాయి. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామన్నా, దానికి ఉన్న కఠిన నిబంధనలు రైతులను నిరాశకు గురిచేస్తున్నాయి. ఒక హెక్టారుకు 20 వేల రూపాయల పరిహారం పొందాలంటే కనీసం 33 శాతం నష్టం నిర్ధారణ కావాలి. చెట్లు పూర్తిగా విరిగిపోవాలనే నిబంధనలతో పూత నష్టపోయిన వేలాది చిన్న రైతులు పరిహారానికి దూరమవుతున్నారు.
ఏడాది పొడవునా అప్పుల కుప్పలు
ఈ మొత్తం పరిస్థితి మామిడి రైతులను ఏడాది పొడవునా అప్పుల చక్రంలో బంధిస్తోంది. పంట ప్రారంభంలో పెట్టుబడుల కోసం అప్పులు, సీజన్ చివర్లో ధర లేక నష్టం, బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం, తదుపరి సీజన్‌కు మళ్లీ అప్పులు. ఈ చక్రం నుంచి బయటపడే దారి రైతుకు కనిపించడం లేదు. తాత్కాలిక సబ్సిడీలు ఊరటనిస్తాయే తప్ప శాశ్వత పరిష్కారం కావు. మద్దతు ధరను కాగితాలకే పరిమితం చేయకుండా చట్టబద్ధంగా అమలు చేయాలి. ఫ్యాక్టరీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. మామిడి ఉత్పత్తి, మార్కెటింగ్‌ను సమన్వయం చేసే ప్రత్యేక మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి. నిజంగా నష్టపోయిన రైతుకు పరిహారం అందేలా నిబంధనలను సవరించాలి. ఇవి అమలుకాకపోతే చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు వెలవెలబోతాయి. ఒకప్పుడు పండుగను తెచ్చిన మామిడి, రైతు జీవితంలో శాశ్వత వేదనగా మిగిలిపోతుంది. ఇదే 2025లో చిత్తూరు మామిడి రైతు ఎదుర్కొంటున్న కఠినమైన, బాధాకరమైన నిజం.
గంగ 3 రోడ్డు పక్కన రైతులు పారబోసిన మామిడి కాయలు
గంగ 4 అరగొండలో రోడ్డుమీద మామిడికాయలు పారబోసి రైతు నిరసన
గంగ 5 జగన్ బంగారుపాల్యం పర్యటన సందర్భంగా రోడ్డు మీద మామిడికాయలు పోసి తొక్కించిన రైతులు
గంగ 6 మామిడి రైతులను పరామర్శించడానికి బంగారుపాళ్యం వచ్చిన జగన్
గంగ 7 బంగారుపాళ్యంలో రైతుల ఆక్రందన సభ
గంగ 8 మామిడి రైతుల సమస్యలపై జిల్లాలో పర్యటించిన మంత్రి అచ్చం నాయుడు
గంగ 9 మద్దతు ధర అమలు చేయాలని కలెక్టరేట్ వద్ద రైతుల నిరసన
గంగ 10 బిల్లులు చెల్లించాలని కలెక్టరేట్లో ముట్టడించిన రైతులు

