13, డిసెంబర్ 2025, శనివారం

రూ. 100 కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు

రైతులకు భారం లేకుండా హక్కుల బదిలీకి ప్రభుత్వ నిర్ణయం 

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఎన్నో ఏళ్ల సమస్యలను గమనించి వారసత్వంగా సంక్రమించే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తల్లిదండ్రుల నుండి అందుకున్న భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, అధిక రుసుములు, కార్యాలయాల్లో జరిగిన ఆలస్యాలు వంటి సమస్యలను ప్రభుత్వం సమీక్షించింది. ఈ నేపథ్యంతో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ రుసుములను నామమాత్రంగా నిర్ణయిస్తూ నూతన ఉత్తర్వులు విడుదల చేసింది. మార్కెట్ విలువ రూ.10 లక్షల లోపు ఉన్న భూములకు కేవలం రూ.100 మాత్రమే, విలువ దాటితే రూ.1000 మాత్రమే రుసుముగా తీసుకుంటారు. ఈ నిర్ణయం రైతులకు మాత్రమే కాదు, గ్రామీణ వ్యవస్థ మొత్తానికి భారంగా మారిన సమస్యలను తగ్గించడానికి సరైన మార్గం అని చెప్పాలి.


గతంలో అమల్లో ఉన్న నిబంధనల వల్ల రైతులకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. తల్లిదండ్రులు మరణించిన తరువాత వారసులు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసినప్పటికీ యాజమాన్య మార్పులు సకాలంలో జరగకపోవడంతో రికార్డుల్లో అస్పష్టత ఏర్పడింది. పట్టాదారు పాసుపుస్తకాలు అందక రైతులు అనేక సమస్యలకు గురయ్యారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ రుసుములు ఎక్కువ కావడంతో చిన్నచిన్న భూములు కలిగిన కుటుంబాలు రుసుములు చెల్లించలేక వెనక్కి తగ్గేవారు. ఉదాహరణకు, పది నుంచి పదిహేను లక్షల విలువ గల భూమిని ముగ్గురు కుటుంబ సభ్యులు పంచుకుంటే, ఒకరికే మినహాయింపు ఉండేది. మిగిలిన వారిపై ఒక శాతం రుసుము విధించేవారు. ఎవరికైనా ఎక్కువ భాగం వచ్చినప్పుడు మూడు శాతం వరకు స్టాంపు రుసుము చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ఇది గ్రామాల్లో పెద్ద భారమయ్యేది. కార్యాలయాల వద్ద జరిగే ఆలస్యాలు, తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్‌లు, కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతి వంటి సమస్యలు వేలాది పిటిషన్లను తెచ్చాయి. ఇదే కారణంగా చాలా మంది రైతులు కేవలం నూరు రూపాయల పత్రాలపై ఒప్పందాలు చేసుకుని భూములను తమ తమ భాగాలుగా పంచుకున్నారు. కానీ ఈ విధానం చట్టబద్ధం కాకపోవడంతో రికార్డుల్లో మార్పులు జరగకపోవడం, భూములను అమ్మాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యులందరి సంతకాలు అవసరమవడం, పుట్టినతెప్పుల ధృవీకరణ పత్రాలు జతచేయాల్సి రావడం వంటి ఇబ్బందులు తలెత్తాయి. ఈ వ్యవస్థ చివరకు సివిల్ వివాదాలకు దారితీసింది. రైతు తన సొంత భూమిని అమ్మాలన్నా, పూచీకత్తు cపెట్టాలన్నా, రికార్డులు సరిగా లేక అపారమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ పరిస్థితులకు అసలైన పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రైతుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురానుంది. వారసత్వంగా అందుకున్న వ్యవసాయ భూములను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే యాజమాన్యం కొత్త వారసుల పేర్లలోకి మారుతుంది. రికార్డులు ఆటోమేటిక్‌గా సవరించబడతాయి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అవుతాయి. దీంతో భూమిపై చట్టబద్ధమైన హక్కులు తమవేనని రైతులు నిర్ధారించుకోగలరు. వారు భూమిని అమ్మాలన్నా, పూచీకత్తుగా పెట్టి అప్పు తీసుకోవాలన్నా ఎటువంటి అవరోధం ఉండదు. తల్లిదండ్రులు వీలునామా రాయకుండా మరణించిన సందర్భంలో, కుటుంబ సభ్యులంతా ఏకాభిప్రాయంతో రాతపూర్వకంగా అంగీకారం తెలపడం సరిపోతుంది. దీని తరువాత సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఎటువంటి కోర్టు కేసులు, అదనపు రుసుములు అవసరం ఉండదు. ఈ విధానం చిన్న రైతులు, అట్టడుగు వర్గాల కుటుంబాల్లో పెద్ద ఉపశమనం కలిగించనుంది. గ్రామాల్లో తరచుగా తలెత్తే భూమి వివాదాలు కూడా ఈ విధానంతో తగ్గే అవకాశముంది. ముఖ్యంగా సర్వే రికార్డులు సరిగా ఉండటం వల్ల పంటలపై అందించే సాయం, భూసంబంధిత ధృవపత్రాల జారీ, పంటనష్ట పరిహారాలు వంటి అంశాలు సులభతరం అవుతాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇల్లు స్థలాలు, భవనాలు, వాణిజ్య ఆస్తులకు ఈ నిబంధనలు వర్తించవు. అయినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇది ఒక పెద్ద న్యాయం. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో భూముల యాజమాన్యం కీలకమైనదని ప్రభుత్వం భావించి ఈ మార్పులు చేపట్టింది. రైతుల ఆస్తులపై చట్టబద్ధమైన హక్కులు స్పష్టంగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో అనేక సమస్యలను నివారించనుంది.

గంగ 5 స్టాంప్ పేపర్స్

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *