4, డిసెంబర్ 2025, గురువారం

స్క్రాప్ పేరుతో జరిగిన భారీ జిఎస్టి స్కామ్ ముఠా గుట్టు రట్టు

కీలకమైన నాలుగు వ్యాపార సంస్థల గుర్తింపు

దేశం విడిచి పారిపోతూ విచారణ బృందాలకు పట్టుపడ్డ కీలక నిందితుడు

చిత్తూరు, కర్ణాటక సరిహద్దులో రెండు కంప్యూటర్ కేంద్రాల గుర్తింపు 

మూడు రాష్ట్రాలు సంయుక్త దర్యాప్తును ప్రారంభించినట్లు సమాచారం

ఒకే ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా 72 నకిలీ రవాణా పత్రాలు సృష్టి


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్క్రాప్ పేరుతో జరిగిన భారీ స్కామ్ చేస్తున్న మోటా గుట్టురట్టైంది. జిఎస్టీనీ ఎగవేసి ఐరన్ స్క్రాప్ బిజినెస్ జరగకపోయినా, లెక్కల్లో మాత్రం కోట్లు టర్నోవర్ చూపించి పన్ను మినహాయింపులు దోచుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. చిత్తూరుకు చెందిన అరహం పెట్రో అండ్ నాన్ పెట్రో సల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, యార్ స్టీల్స్, ఎమార్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్, మదీనా స్టీల్స్, జెడ్ఎఫ్ ట్రేడర్స్ పేర్లతో భారీ ఎత్తున నకిలీ వ్యాపారాలు చూపి, ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగా జిఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. వస్తువు ఒక్క గ్రామూ కదల్లేకపోయినా, కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్టు కాగితాల్లో చూపిన ఈ వ్యవహారం, చిత్తూరులో వెలుగులోకి వచ్చిన పెద్ద జిఎస్టి కుంభకోణానికి నేరుగా అనుబంధంగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.


చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన చిన్న మోసం ఇప్పుడు ఐదు రాష్ట్రాలకు విస్తరించి, పన్ను శాఖను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోంది. పేదల ఆధార్, పాన్ కార్డులను పది వేల రూపాయలు ఇస్తామని నమ్మించి సేకరించి, వాటితో వందల సంఖ్యలో నకిలీ వ్యాపారాలు తెరచి కోట్ల రూపాయల పన్నును దోచుకున్న ఈ ముఠా చేస్తున్న దందా రోజు రోజుకీ కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. వస్తువులేమీ కొనకపోయినా, అమ్మకపోయినా, కాగితాలపై కోట్లు తిరిగినట్టు చూపించి, పన్ను మినహాయింపులు తీసుకుని ప్రభుత్వ ఖజానాను బెల్లంలా కరిగించిన ఈ స్కామ్ వెనుక ఉన్న నిజాలు క్రమంగా బయటపడుతున్నాయి. చిత్తూరులో వెలుగులోకి వచ్చిన జిఎస్టి దండకు సంబంధించి  మూడు రాష్ట్రాలు సంయుక్త దర్యాప్తును ప్రారంభించినట్లు సమాచారం.  చిత్తూరు, కర్ణాటక సరిహద్దులో పనిచేసిన రెండు కంప్యూటర్ కేంద్రాలు మోసగాళ్ళ అడ్డగా  గుర్తించినట్లు తెలిసింది.  ఒకే ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా 72 నకిలీ రవాణా పత్రాలు సృష్టించినట్టు నిర్ధారణ అయ్యిందని సమాచారం. ఈ కేసులో ఒక ఇందితుడు  దేశం విడిచి పారిపోతుండగా విచారణ బృందాలు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 


మొదట చిత్తూరు జిల్లాలో ‘పత్రాలు సేకరించే’ చిన్న క్రియతో మొదలైన ఈ మోసం కర్ణాటక, తెలంగాణలకు చేరి, తాజాగా మరో రెండు రాష్ట్రాలకూ విస్తరించినట్టు పన్ను శాఖ అనుమానం వ్యక్తం చేసింది. గ్యాంగ్ వాడిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఐపీ చిరునామాలన్నీ ఒకే ప్రాంతాన్ని సూచించడం వల్ల వారి కేంద్రం ఎక్కడుందో అధికారులు అంచనాకి  వచ్చినట్లు సమాచారం. నకిలీ మొబైల్ నంబర్లు, నకిలీ మెయిల్ ఐడీలు, తప్పుడు చిరునామాలతో ఒక్కో వ్యక్తి పేరుతో వందల కొద్దీ రిజిస్ట్రేషన్లు చేయడం లో ఒక మూటా ఉన్నట్లు గుర్తించారు. పేదల పత్రాలను సేకరించిన తర్వాత ముఠా తీసుకున్న దారిలోనే అసలు మోసం మొదలవుతుంది. వస్తువులు కొనకపోయినా, అన్ని కొనుగోలు జరిగిందని నకిలీ బిల్లులు సృష్టించారు. ఆ కొనుగోలుపై పన్ను చెల్లించినట్టు రికార్డుల్లో చూపించి, అసలు చెల్లించకపోయినా కాగితాల్లో పన్ను హక్కుగా నిలబెట్టుకున్నారు. అదే మినహాయింపు హక్కును మరో నకిలీ కంపెనీకి విక్రయించి, మళ్లీ మళ్లీ లావాదేవీలు చేసిననట్లు సృష్టిస్తూ ఒకే లావాదేవీని వందల కోట్ల టర్నోవర్‌గా చూపించారు. ఇలా నకిలీ రిజిస్ట్రేషన్లు, నకిలీ రవాణా పత్రాలు, నకిలీ లావాదేవీలు అన్ని ఒకే నెట్‌వర్క్ చేతుల్లో నడిచాయి.

పేదల పేర్లకు భారీ పన్ను నోటీసులు రావడం. కోట్లు తిరిగాయి, లావాదేవీలు జరిగాయి, పన్ను తప్పించారన్న వివరాలు తమ పేర్లకు వచ్చి పడటంతో అమాయకులు షాక్ అయ్యారు.  పత్రాలు అసలైనవే అయినా వాటిని సవరించి, తప్పుడు వివరాలతో వాడటం మోసానికి కేంద్రభిందువు అయ్యింది. ఈ దందా పరిమాణాన్ని అర్థం చేసుకోవడానికి పన్ను శాఖ బ్యాంకులకు ఆరు సంవత్సరాల లావాదేవీల వివరాలు ఇవ్వమని ఆదేశించింది. ముందుగా మూడు సంవత్సరాల డేటాతో సరిపెట్టిన శాఖ ఇప్పుడు మొదటి నుంచి ఉన్న ప్రతి లావాదేవిని పరిశీలిస్తోంది. రౌండ్, ట్రిప్పింగ్ పేరుతో డబ్బును ఒకే బ్యాంకులో పది కంపెనీల నుంచి తీసుకుని తిరిగి మోసగాళ్ల చేతుల్లోకి చేరేలా చేసిన పద్ధతి పూర్తిగా బయటపడుతోంది. పత్రాల్లో మాత్రమే కనిపించే పెద్ద పెద్ద టర్నోవర్‌ల వెనుక అసలు డబ్బు మాత్రం రౌండ్‌గా తిరిగి నేరగాళ్లకే చేరింది. అంతేకాదు, ఈ స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన 17 మంది మధ్యవర్తుల వివరాలు కూడా ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. వీరే పేదల పత్రాలు సేకరించి సంతకం చేయండి, పదివేలిస్తామని ప్రలోభపెట్టి, రిజిస్ట్రేషన్ల వద్ద నటుల్లా కనిపించి పత్రాలు సమర్పించిన వీరే మొత్తం దందాకు వెన్నెముక. వీరి ఫోటోలు, వీడియోలు, మొబైల్ లాగ్‌లు కూడా దర్యాప్తు బృందాలకు దొరికినట్టు లోపల సమాచారం. ఈ కుంభకోణంలో పెద్ద మలుపు మూడు పెద్ద వ్యాపార సంస్థలు సీన్ లోకి వచ్చాయి. నకిలీ పన్ను మినహాయింపులను కొనుగోలు చేసి కోట్లు ఆదా చేసుకున్నట్టు తేలడంతో, ఈ కంపెనీల వివరాలు బయటపడితే ఇది రాష్ట్ర స్థాయి మోసమే కాదు, దేశవ్యాప్తంగా పెద్ద దుమారం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగస్వామ్యం అయిన నెట్‌వర్క్ పరిమాణం ఊహాతీతం కావడం ఇందుకు కారణం. 

ఇటీవల అదుపులోకి తీసుకున్నవ్యక్తి మొబైల్ ఫోన్‌లో వందల నకిలీ కంపెనీల డేటా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది దర్యాప్తులో భారీ మలుపు అని అధికారులు అంటున్నారు. అమాయకుల పేర్లకు పంపిన కోట్ల రూపాయల నోటీసులను రద్దు చేయడం ఇప్పుడు వేగంగా సాగుతోంది. వ్యాపారం మనది కాదని పేదలు ధృవీకరించిన తర్వాత, వారి పేర్లను తొలగించే  ప్రక్రియ మొదలైంది. అయితే వారి పేరు మీద పన్ను బకాయి చూపించబడిన దశలో, ఈ మోసం దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగా కుదిపేసిందో అర్థమవుతోంది. ఇది కంప్యూటర్ కేంద్రాలు, నకిలీ బిల్లులు, మోసపూరిత రిజిస్ట్రేషన్లతో ఇది చిన్న స్కామ్ కాదు. శ్రేణులుగా, వలయాలుగా, రాష్ట్రాల మధ్య నడిచిన భారీ నేర వ్యవస్థ. వస్తువులు లేకపోయినా బిల్లులు ఉన్నాయి. బిల్లులున్నాయి, కాబట్టి పన్ను మినహాయింపు ఉంది. ఆ మినహాయింపు పేరుతో ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయలు సులభంగా మింగేశారు. చిత్తూరులో చిన్నగా మొదలైన ఈ జిఎస్టి స్కామ్, ఇప్పుడు దేశానికి హెచ్చరిక లాంటిది. వ్యవస్థలో ఉన్న బలహీనతలు, బ్యాంకుల ధృవీకరణ లోపాలు, పన్ను పోర్టల్ భద్రతా లోపాలు అన్నీ కలిసి మోసగాళ్లకు మార్గం వేసాయి. ఈ కేసు పూర్తిగా బయటపడితే ఇది దేశ ఆర్థిక చరిత్రలో పెద్ద కుంభకోణంగా నిలిచే అవకాశం ఉంది.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *