4, అక్టోబర్ 2025, శనివారం

జిల్లాలో ఇంకా పెద్దిరెడ్డి హవా కొనసాగుతోందా?

ప్రభుత్వం మారగానే టిడిపిలో చేరిన చోటా నాయకులు 
వారిని స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్న ప్రజాప్రతినిధులు 
పార్టీకి చెడ్డపేరు వస్తుందని సీనియర్ల ఆవేదన 
కట్టడి చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశాలు


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొన్ని నియోజక వర్గాలలో ఇప్పటికీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి హవా కొనసాగుతోందని కొందరు టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలువులు వైసిపి చోటా నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అక్రమ ఆర్జనలో వారికి విశేష అనుభవం ఉండటం కారణంగా కొందరు ప్రజాప్రతినిధులు వారిని వాడుకొని లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా నియోజకవర్గాలలో తొలినుంచి పార్టీ జెండా మోసిన వారికి, కొత్తగా వైైసీపీ నుంచి టిడిపిలో చేరిన వారికి పోసగడం లేదు. నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి. టిడిపిలో చేరిన పలువురు వైసిపి నేతలు పాత పరిచయాలతో వైసిపి నేతలు చెప్పిన విధంగా వ్యవహరిస్తున్నారు. వారి వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డడ పేరు వస్తుందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడుకు కూడా పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గాలలో పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న వారిని కట్టడి చేయాలని ఇంచార్జి మంత్రులను ఆదేశించినట్టు తెలిసింది. 

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. తంబళ్లపల్లెలో ఆయన తమ్ముడు ద్వారకనాథ రెడ్డి గెలిచారు. రాజంపేట ఎంపీ గా ఆయన కుమారుడు మిథున్ రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. వారి నియోజక వర్గాలలో వారికి ఎదురులేదు. అయితే మరి కొన్ని నియోజక వర్గాలలో పెద్దిరెడ్డి అనుచరులు టిడిపి కండువా కప్పుకుని పాగా వేశారని అంటున్నారు. గతంలో చక్రం తిప్పిన అనుభవంతో ఇసుక, గ్రావెల్, గ్రానైట్ అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జి డి నెల్లూరు నియోజక వర్గం, ముఖ్యంగా పాలసముద్రం మండలంలో ఈ ముసుగు నేతల అక్రమాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఇక్కడి నుంచి చెన్నైకి అక్రమంగా గ్రావెల్, ఇసుక తరలిస్తున్నారని టిడిపి, సీపీఐ నేతలు ఆందోళన చేస్తున్నారు. మార్చి ఒకవ తేదీ చంద్రబాబు జి డి నెల్లూరు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వైసిపి నుంచి వచ్చిన వారికి సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లే అంటూ వ్యాఖ్యానించారు. పలమనేరు నియోజక వర్గంలోనూ కొందరు వైసిపి నేతలు టిడిపి ముసుగులో ఇసుక, గ్రావెల్ అక్రమంగా బెంగళూరు తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, పీలేరు నియోజక వర్గాలలోను వైసిపి నుంచి వచ్చిన కొందరు అక్రమాల చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. శుక్రవారం క్యాబినెట్ సమావేశం అనంతరం చంద్రబాబు మంత్రులతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని సూచించినట్టు తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని, అసెంబ్లీలో ఏడిపడితే అది మాట్లాడుతున్నారని అన్నట్టు తెలిసింది. ఈ సందర్భంలో చిత్తూరు జిల్లా వ్యవహారం కూడా చర్చకు వచ్చినట్టు టిడిపి సీనియర్ నేత చెప్పారు. ఇలాంటి వారిని ఇంచార్జి మంత్రులు నియంత్రించాలని ఆదేశించారు. అయితే కంచే చేను మేసినట్టు కొందరు మంత్రులే అవినీతిపరుల కొమ్ము కాస్తున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి గత నెలలో ఆరోపించారు. ఆయన ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తరువాత పార్టీ క్రమ శిక్షణ కమిటీ సూచనలతో మాట్లాడటం మానేశారు. కాగా జి డి నెల్లూరు నియోజక వర్గం దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన వెనక టిడిపి ముసుగులోని వైసిపి నేతల హస్తం ఉందంటున్నారు. ఒక మహిళ వ్యవహారంలో గొడవలను రెచ్చగొట్టి, షెడ్డుకు నిప్పు పెట్టించారని స్థానికులు అంటున్నారు. అయితే ఆ నిప్పు అంబేద్కర్ విగ్రహానికి ప్రమాద వశాత్తున అంటుకోవడంతో, ఈ విషయాన్నీ కొందరు  రాజకీయం చేశారని అంటున్నారు. వీరు తమకున్న పాత పరిచయాలతో మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామికి తప్పుడు సమాచారం ఇచ్చి టిడిపి నేతలపై నిందలు వేయించారని అంటున్నారు. అలాగే పార్టీలతో ప్రమేయం లేకుండా కేసులు పెట్టాలని కోరారు. పాత టిడిపి నేతలను కేసులో ఇరికించాలని చూస్తున్నారని వెదురుకుప్పం మండలంలో పలువురు అంటున్నారు.అయితే ఎమ్మెల్యే థామస్ వైసిపికి చెందిన స్థానిక సర్పంచ్ గోవిందయ్య పై ఆరోపణలు చేయడంతో కథ అడ్డం తిరిగిందని అంటున్నారు. ఈ నేపధ్యంలో టిడిపి కండువా కప్పుకున్న వైసిపి నేతలను కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *