పులుల సంచారం ప్రజల్లో అందోళన
చిత్తూరు, అక్టోబర్ 26 (ఆంధ్రప్రభ బ్యూరో) : చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో పులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. అడవుల్లో ఆహారం కొరతతో పులులు ఇప్పుడు మానవ నివాస ప్రాంతాల వైపు వస్తున్నాయి. తాజా ఘటన తవనంపల్లి మండలం కొండ్రాజుకాల్వ గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం ఆ గ్రామానికి చెందిన ఎస్.టి. కాలనీలో నివసించే అబ్బాస్ అనే వ్యక్తి మేకలను పులి దాడి చేసి నోట కరచుకుని అడవివైపు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. గ్రామ పరిసరాల్లో పులి ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదే రోజు సాయంత్రం అరగొండ సమీపంలోని కామాలూరు రహదారిపై పులి సంచరిస్తున్నట్లు స్థానికులు గమనించినట్టు సమాచారం. వెంటనే కామాలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రజలను అప్రమత్తం చేస్తూ గ్రామంలో దండోరా వేయించారు. జిల్లాలో ఇటీవలి నెలల్లో పులులు తరచుగా కన్పించడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో యడమరి, సోమల, పుత్తూరు, నాగలాపురం, రేణిగుంట, సత్యవేడు పరిసరాల్లో కూడా పశువులను వేటాడిన ఘటనలు నమోదయ్యాయి. పులుల వేటలతో పశువుల కాపరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫారెస్ట్ అధికారులు పులుల కదలికలపై ప్రత్యేక నిఘా వేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఒంటరిగా అడవులకు సమీపంగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు జారీ చేశారు. పశువుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని, పులుల సంచారం ఉన్న ప్రాంతాల్లో కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు అడవీ శాఖను కోరుతున్నారు. ప్రజల అప్రమత్తతతో పాటు అధికారుల సత్వర చర్యలతో ప్రమాదాలను నివారించవచ్చని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు.
---

