26, అక్టోబర్ 2025, ఆదివారం

అల్పపీడనం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం

నేడు అన్ని పాఠశాలలకు సెలవులు 

ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు 

మండల కేంద్రాల్లో ఉండాలని అధికారులకు కలెక్టర్ సూచన 

నీవా నది పరివాహ ప్రాంతాలలో మున్సిపల్ అధికారుల పర్యటన 

నదీ పరివాహక ప్రాంతాల్లో అప్రబత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపధ్యంలో  జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ జిల్లా మండల, మున్సిపాలిటీ, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులందరూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మండల స్థాయి అధికారులు అందరూ ఈ మూడు రోజులపాటు మండలంలోని బస చేయాల్సిందిగా కోరారు. అల్పపీడనం కారణంగా సోమవారం జిల్లాలోని అన్ని యజమాన్యాల పాఠశాలలకు సెలవుల ప్రకటించారు. అలాగే సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేశారు. ఫిర్యాదుదారులు ఎవరు జిల్లా కేంద్రానికి రావద్దని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.  చిత్తూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన  నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.  జిల్లాలోని అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి అందరూ ఉద్యోగులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా రెవెన్యూ శాఖ డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులందరినీ అప్రమత్తంగా ఉండేలా చూడాలని, శిధిలావస్థలో ఉన్న భవనాలను, పాఠశాలలను గుర్తించి, ఆ ప్రదేశంలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఎత్తైన ప్రదేశాలను సురక్షితమైన ప్రదేశాలను ముందుగానే గుర్తించి  ముందు జాగ్రత్త ఏర్పాట్లను చేసుకోవాలని తెలిపారు. గ్రామ పరిధిలో ఉన్న వాగులు, వంకలు ప్రవాహ తీవ్రతను ముందుగానే గుర్తించి ఎటువంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా వీఆర్వో, వీఆర్ఏ ఇతర మండల పంచాయతీ శాఖల అధికారుల పరిధిలో ఆటోలో మైకల ద్వారా, దండోరా రూపంలో ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసే విధంగా చూడాలన్నారు. ప్రతిరోజు వర్షపాత నమోదును ఎప్పటికప్పుడు మండల జిల్లా స్థాయిలో తెలిసే విధంగా చూడాలని సంబంధిత శాఖను ఆదేశించారు. కుంటలు, చెరువులు 80 శాతం నిండిన చెరువులను గుర్తించి  ఇరిగేషన్ శాఖ వారు పర్యవేక్షించి వాటిని గుర్తించి జిల్లా స్థాయి అధికారులకు ఎప్పటికి అప్పుడు  సమాచారాన్ని చేరవేయాలని, అలాగే ఆ చెరువులకు గండి పడే ప్రదేశాలను గుర్తించి,  ఇసుక బస్తాలను ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఏర్పాట్లును ప్రతి మండల స్థాయిలో  చేసుకోవాలని,  ముందస్తుగా మండల గ్రామ స్థాయిలో జెసిబి ఓనర్ల  ఫోన్ నెంబర్లను సేకరించి వారు అన్నివేళలా  అందుబాటులో ఉండే విధంగా  చర్యలు తీసుకోవాలని, గ్రామ మండల స్థాయి అధికారులకు తెలిపారు. అన్ని రిజర్వాయర్ లలో నీటి నిల్వలపై నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. ఆరోగ్యశాఖ వారిని జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండేలా చూడాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వాటిని అరికట్టుటకు తగు జాగ్రత్తలు తీసుకొని, మందుల కొరత లేకుండా చూడాలని కోరారు. మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో, పంచాయితీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మరియు ఇతర శాఖల వారితో సమన్వయం చేసుకొని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ, వారికి కావలసిన మందులు ఉండేలా  చూడాలన్నారు. పాఠశాలలలో, పాత భవనాలను గుర్తించి పిల్లలకు సురక్షితంగా ఉండేలా చూడాలన్నారు. మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తూ ఏలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా కావలసిన  ఏర్పాట్లను, కావలసిన పరికరాలను, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను, గజ ఈతగాళ్లను  ముందుగానే సిద్ధం చేసుకోవాలని పోలీసు, అగ్నిమాపక అధికారులకు ఆదేశించారు. ప్రతి శాఖలో జిల్లా అధికారులు నియోజకవర్గ స్థాయి, మండల స్థాయిలో ప్రత్యేక టీములుగా ఏర్పాటు చేసి ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా  వారి సెల్ నెంబర్లను కంట్రోల్ రూమ్ నందు  నమోదు చేసి ఉంచాలని తెలిపారు.

*మున్సిపాలిటీ అధికారుల అప్రమత్తం* 

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి కమిషనర్ పి నరసింహ ప్రసాద్ నగరపాలక  ఎంహెచ్వో డా. లోకేష్, ఇతర అధికారులతో కలిసి నీవా నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. తేనబండ, వీరభద్ర కాలనీ, ధర్మరాజుల గుడి, ఏటివార ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా నీవా నదిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరపాలక పరిధిలో మూడు రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు. మరో మూడు రోజులు మొంథా తుఫాను ప్రభావంతో  జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనాల నేపథ్యంలో నగర పాలక అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కల్వర్టర్లు, వంతెనల వద్ద ప్రజలు వాగును దాటకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. సంతపేటలో ప్రధాన రహదారి, వీధుల్లో నీటి ప్రవాహం తగ్గించడానికి అర్ధరాత్రి చర్యలు చేపట్టారు. సానిటరీ ఇన్స్పెక్టర్లు,  వార్డు కార్యదర్శులు వారి వారి వార్డుల పరిధిలో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.

*పోలీసు హెచ్చరిక* 

రానున్న మూడు  రోజులు భారీ వర్షాలు కురవనున్న కారణంగా పట్టణములోని లోతట్టు  ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు చిత్తూరు డి.ఎస్పీ టి.సాయినాథ్  ముందస్తు హెచ్చరికలు జారిచేశారు. రాబోయే నాలుగు రోజులపాటు వర్షాలు, తుఫాను ప్రభావం కారణంగా నీవా నది నీటిమట్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉందనీ, దాని ఫలితంగా నది పొంగిపొర్లి పరిసర ప్రాంతాలు, కాలనీలు మరియు తక్కువ ఎత్తులో ఉన్న ఇళ్లకు ముప్పు తలెత్తే అవకాశం ఉందన్నారు. అందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, అవసరమైతే ముందుగానే ఎత్తైన, సురక్షితమైన ప్రదేశాలకు తరలివెళ్లవలసిందిగా కోరారు. అలాగే పిల్లలు, వృద్ధులు, గృహిణులు మరియు పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. ప్రజలు అనవసరంగా నది తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. నాలుగు రోజులపాటు రెవెన్యూ,మున్సిపల్ అధికారుల సమన్వయంతో పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు.  ప్రమాద ప్రాంతాలలోని యువకులను ప్రతిరోజు పోలీసులతో సమన్వయం చేసుకుని నలుగురు చొప్పున పహారా విధుల్లో పాల్గొనమని సూచనలు ఇచ్చారు. ఏదైనా అనుకోని ఘటనలు, నీరు పెరగడం లేదా గోడలు కూలిపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తే వెంటనే 112 లేదా స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా డి.ఎస్పీ కోరారు.

*పలు మండలాల్లో వర్షపాతం* 

తుఫాను ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం భారీ నుంచి తేలికపాటి వర్షాలు పడ్డాయి. పలమనేరు మండలంలో గరిష్టంగా 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. సదం మండలంలో 44.8, పెనుమూరు మండలంలో 55, పూతలపట్టు మండలంలో 50, సోమలలో 35.4, చౌడేపల్లిలో 41.4, గంగవరంలో 37.6 ,గంగాధర నెల్లూరులో 39.2 గుడిపాలలో 25, చిత్తూరూ అర్బన్ లో 40.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లాలో సంఘటన 17.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *