దీపాల వెలుగులో చీకటిని పారదోలే దీపావళి
నేడే దీపావళి పండుగ
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
భారతీయ సాంస్కృతిక పరంపరలో ప్రతి పండుగకు ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. వాటిలో అత్యంత ప్రకాశవంతమైనది దీపావళి. అంధకారంపై వెలుగు విజయం అనే సారాన్ని ప్రతిబింబించే దీపావళి పండుగ మన జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఈ పండుగ రోజున ప్రతి ఇల్లు కాంతుల హారంగా మారుతుంది. దీపావళి రోజున బంధుమిత్రులు ఇళ్లకు వస్తారు. వారితో ఇల్లంతా సందడిగా మారుతుంది. చిన్న పిల్లల ఆనంద కిలకిలలు, మహిళల భక్తి గీతాలు, పురుషుల కాల్చే టపాకాయల మోతలు కలసి దీపావళినకి నిండుదనాన్ని నింపుతాయి.
పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు దీపావళిగా జరుపుకుంటారు. ఆ రోజున ప్రజలు దీపాలు వెలిగించి, తమ ప్రియతమ రాజును స్వాగతించారు. అదే ఆచారం వేల సంవత్సరాల తర్వాత కూడా ప్రతి భారతీయుడి హృదయంలో సజీవంగా ఉంది. కొంతమంది దీపావళిని లక్ష్మీదేవి అవతారదినంగా జరుపుకుంటారు. మరికొందరు నరకాసుర వధదినంగా భావిస్తారు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించి సత్యభామతో కలిసి విజయోత్సవంగా ఈ పండుగ జరుపుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల దీపావళి అనేది దుష్టులపై సజ్జనులు, అజ్ఞానంపై జ్ఞానం, అసూయపై ప్రేమ విజయ చిహ్నం. ప్రతి సంవత్సరం దీపావళి రోజున ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరచి, రంగోళీలు వేయడం ద్వారా పవిత్రతను ఆహ్వానిస్తారు. ఇంటింటా వెలిగే దీపాలు కేవలం అంధకారాన్ని తొలగించడమే కాదు, అవి మన హృదయాల్లోని అజ్ఞానాన్ని, ద్వేషాన్ని పారదోలాలని సూచిస్తాయి. ఈ రోజు కుటుంబ సభ్యులు, బంధువులు ఒకచోట చేరి సంతోషంగా గడుపుతారు. కొత్త బట్టలు ధరించి, పిండి వంటకాలు, మిఠాయిలు పంచుకుంటారు. పిల్లలు పటాకులు కాలుస్తూ ఆనందోత్సాహాన్ని పంచుతారు. వ్యాపారులు ఈ రోజును కొత్త ఆర్థిక సంవత్సర ప్రారంభంగా భావించి లక్ష్మీ పూజలు నిర్వహిస్తారు. పేద, ధనవంతుడు అనే తేడా లేకుండా అందరూ ఒకే సంతోషంలో మునిగిపోతారు. ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి పండుగ పల్లె, పట్టణాలన్నింటినీ ఆనందంతో నింపేస్తుంది. పల్లెల్లో మహిళలు నూనె దీపాలు వెలిగించి, తలుపు ముందు గోపురాకార రంగోలీలు వేస్తారు. పూజా గదుల్లో లక్ష్మీదేవికి పూలతో, దీపాలతో అలంకరించి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. రాత్రి వేళల్లో గ్రామ వీధులంతా వెలుగుల సముద్రంగా మారిపోతాయి. పట్టణాల్లో పటాకుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేవాలయ దీపోత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. కొందరు గోవర్ధన పూజ, బలిపాడ్యమి, యమ దీపం వంటి సాంప్రదాయాలను కొనసాగిస్తూ ధార్మికతను కాపాడుతున్నారు. చిత్తూరు జిల్లా సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీక. ఇక్కడ దీపావళి వేడుకలు ఆధ్యాత్మికతతో కూడిన ప్రజా ఉత్సవాలుగా మారతాయి. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారికి దీపావళి నాడు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కాంతులతో మెరుస్తాయి. చిత్తూరు, పలమనేరు, మదనపల్లె, పుత్తూరు ప్రాంతాల్లో దీపాల ప్రదర్శనలు, బాణాసంచా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామాల్లో పిల్లలు టపాసులు కాలుస్తూ, పెద్దలు దేవాలయాల్లో దీపాలు వెలిగించి భక్తి వాతావరణం సృష్టిస్తారు. చిత్తూరు పట్టణంలో ప్రధాన రహదారులు, షాపింగ్ సెంటర్లు, దేవాలయాలు రాత్రివేళ వెలుగుల సముద్రంగా మారుతాయి. పంచాయతీలు, యువజన సంఘాలు సామూహికంగా దీపోత్సవాలు నిర్వహిస్తూ సమాజంలో ఐకమత్యానికి నాంది పలుకుతున్నాయి. పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సామూహికంగా గౌరీదేవి పూజ చేస్తారు. గౌరీ దేవికి అత్తి రసాలు, ఆకు, వక్కలు, పండ్లు నైవేద్యంగా పెడతారు గౌరీ వ్రతం నోము దారాలను స్త్రీ పురుషులందరూ ధరిస్తారు. దీపావళి కేవలం టపాసుల, పండుగ విందుల రోజే కాదు. అది మనలోని చెడు భావాలను పారదోలే ఆధ్యాత్మిక సందర్భం. ప్రతి దీపం మనసులో ప్రేమ, శాంతి, సత్యం వెలిగించాలని ఈ పండుగ మనకు చెబుతుంది. ఇంటి ముందర వెలిగే దీపం మన జీవితంలో సుభిక్షం నింపాలని, దేశం మొత్తం వెలుగులా ప్రకాశించాలని ఆకాంక్షిద్దాం.
గంగ 4 దీపావళి
గంగ 5 గౌరీ వ్రతం

